Thursday, December 26, 2024

కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్నట్టుగానే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షల బీమ సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సిఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి, విధానాలను రూపాందించాలని, రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సిఎం ఆదేశించారు. మంగళవారం డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావులు పాల్గొన్నారు.

వారం రోజుల్లోనే బీమా నగదు అందించాలని…

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు అనేకం జరుగుతున్నాయని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ఊహించని సందర్భాల్లో మృతిచెందిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని సిఎం అన్నారు. ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా అందుతున్నా అది బాధితులకు అందడంలో ఆలస్యమవుతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా మాదిరిగానే, కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం అన్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.

సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

రైతు బీమా మాదిరిగా 5 లక్షల రూపాయల ‘గీత కార్మికుల కోసం బీమా’ను ప్రవేశపెట్టినందుకు సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గీత వృత్తికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గీత కార్మికులకు పెన్షన్లు అందిస్తున్నామన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 4 కోట్ల 20 లక్షల తాటి, ఈత మొక్కలు నాటామన్నారు. తాటి, ఈత చెట్ల రెంటల్ శాశ్వతంగా రద్దు చేశామన్నారు. గీత కార్మికుల ఎక్స్ గ్రేషియా రూ.2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచామన్నారు. ప్రమాదవశాత్తు తాటిచెట్టు నుంచి పడి చనిపోయిన శాశ్వత అంగ వైకల్యం చెందిన గీత కార్మికులకు 5లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందించనున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News