త్రేతాయుగం నుండి దేవతలు సైతం కల్లును సురాపానకంగా స్వీకరించి ఆనందాన్ని వ్యక్తీకరించి తన్మయత్వాన్ని పొందేవారు. సమాజంలో ప్రతి రంగంలో రోజురోజుకి ఎన్నో మార్పులు చోటుచేసుకుని నవశకానికి నాంది పలుకుతుంటే ఒక్క గీత కార్మికుల బతుకుల్లో మాత్రం మార్పు లేకపోవడం బాధాకరం. పాలకులు, ప్రభుత్వాలు మారినా గీత కార్మికుల జీవన విధానంలో విలక్షణమైన మార్పులు రావడం లేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకు పోరాటమే భవితగా ముందుకు సాగుతున్న ఈ జాతికి భరోసా ఇచ్చేవారెవరు? కుటుంబ బాధ్యతలే పరమావధిగా బాధలు ఎన్ని ఉన్నా భరిస్తూ కులవృత్తిని నమ్ముకున్న ఈ కష్టజీవులను ఆదరించే దిక్కెవరు? తరాలు మారుతున్నా గీతకార్మికుల తలరాతలు మారడం లేదనడానికి ఎన్నో సంఘటనలు మన ముందు కదలాడుతున్నాయి.
రెక్కాడితేగానీ డొక్కాడని వీరి జీవితాలు ప్రతిక్షణం కత్తిమీద సాము లాంటివి. ఆత్మగౌరవం తోడుగా ధైర్యమే దోస్తీగా కులవృత్తి జీవన భృతిగా సాగుతున్న వీరి బతుకులకు రక్షణ కరువైందని చెప్పవచ్చు. ఎన్నికల సమయంలో స్వార్థపూరిత ఆలోచనలతో, అవసరానికి వాడుకునే ఆటబొమ్మల మాదిరిగా చూస్తూ గీత కార్మికుల ఓట్ల కోసం పాకులాడే పాలకులు తప్ప గౌడన్నల సంక్షేమానికి దారి చూపేవారు కానరారు. జిఒల పేర్లతో, సర్క్యులర్ల సాకుతో కాలక్రమంగా గీత వృత్తి ఉనికిని దూరం చేస్తున్నారే తప్ప వృత్తి పరిరక్షణకు, ఉపాధి కల్పనకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు అనడంలో సందేహం లేదని చెప్పవచ్చు. అధికారుల, పాలకుల అండతో అగ్రవర్ణాల ఆగడాలతో అమాయకపు గీతకార్మికుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునే నాథుడే లేడు. వివిధ కార్యక్రమాల పేర్లతో వృత్తి పరిరక్షణ ప్రచారం పేరుతో తాటి, ఈత వనాలు పెంచుతామని చెప్తూనే, వాటి పర్యవేక్షణ బాధ్యతను గాలికి వదిలేసి గీత కార్మికుల పట్ల పాలకులు నిర్లక్ష్యపు వైఖరిని ప్రదర్శిస్తున్నారు. పంట భూముల్లో ఉన్న తాటి, ఈత చెట్లను కొంత రుసుం చెల్లించి తొలగించుకోవచ్చనే నిబంధన గౌడన్న జీవనోపాధికి బీటలు పారేలా చేస్తుంది.
ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి దుర్మరణం చెందిన గీతకార్మికుల ఎక్స్‌గ్రేషియా మంజూరు విషయంలో కూడా నిమ్మకునీరెత్తినట్లు ఉండటమే చేస్తుంది. సంవత్సరాలు గడుస్తున్నా కుటుంబంలో ఎవరి తోడులేక, బాధ్యతాయుమైన వ్యక్తిలేక ఎంతోమంది గీత కార్మికుల కుటుంబాలకు ఇప్పటి వరకు కూడా ఎక్స్‌గ్రేషియా రాకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఈత, తాటివనాలకు రక్షణ దిక్కులేదు కానీ కొత్తవనాల పెంపు కార్యక్రమాలు రూపొందించడం హాస్యాస్పదం అని చెప్పవచ్చు. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తే ఇప్పటివరకు బాధిత గీతకార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చిన పాపానపోలేదు. నిర్లక్ష్యపు నీడలు వెంటాడుతూ నిరుపేద గౌడన్నల జీవితాలు అగమ్యగోచరంగా మారినా ప్రభుత్వాల మనసు మాత్రం మారడంలేదు. బడుగు బలహీన వర్గాల్లో అధిక జనాభా కలిగిన గీత కార్మికుల సంక్షేమానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించి గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గీత కార్మికుల కుటుంబంలో ఉన్న యువతకు ఉపాధి కల్పన కోసం తాడి టాపర్ బోర్డు ఏర్పాటుచేసి తాటి ఈత సంబంధిత పదార్థాల ఉత్పత్తిని చేపట్టాలి. ప్రకృతి సిద్ధంగా, సహజంగా లభించే కల్లును మార్కెట్లో అందుబాటులో ఉంచి వాణిజ్య పరిశ్రమగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలి.
తాటి ఈత ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి గీత కార్మికుల జీవనోపాధికి పటిష్టమైన కార్యక్రమాలు, పథకాలు రూపొందించాలి. వృద్ధులైన గీత కార్మికులకు తగిన మొత్తంలో పింఛన్లు ఇవ్వాలి. తాటి ఈతవనాల పెంపకానికి సంబంధించి మరుగుజ్జు రకానికి చెందిన రకాలపై దృష్టి సారించాలి. ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై పడి మరణించే పరిస్థితిని రూపుమాపడానికి నిర్ణయాత్మక ఆలోచనతో తాడిచెట్టు ఎక్కే యంత్రాలను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కానీ వాటిని పూర్తిస్థాయిలో రాష్ట్ర మొత్తంలో ఉన్న గీత కార్మికులకు అందేలా చర్యలు తీసుకోవాలి. పూర్తిస్థాయిలో అన్ని గ్రామాలకు సేఫ్టీ మోకులను అందించేలా ప్రణాళికలు రూపొందించి నిర్మాణాత్మకమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టివిఎస్ మోపెడ్లు కొనుగోలు చేసి ఇవ్వాలి. కుటుంబాలు గడవడం కష్టంగా మారి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న, ఎండిన తాటి, ఈత వనాలతో కల్లు రాక నానా ఇబ్బందులుపడుతున్న గీత కార్మికులకు గౌడ స్వయం ఉపాధి సంఘాలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించాలి.
బెల్టు షాపుల దెబ్బకు కల్లు అమ్ముడుపోక ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్న పరిస్థితులను పాలకులు ఆలోచన చేయాలి. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గీత కార్మికుల సంక్షేమానికై ఒక్క నూతన పథకం కూడా అమలు చేయడం లేదని గౌడన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా గీత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నా, గీత కార్మికులు చస్తే తప్ప బతకడానికి పథకాలు ఏమీ లేవు. తాటి చెట్లు ఎక్కి కల్లు గీసుకునే గీత కార్మికులు ప్రమాదవశాత్తు పడి మరణిస్తే, శాశ్వత అంగ వైకల్యం పొందిన వారికి ప్రభుత్వం రూ. 5 లక్షల బీమా నుండి 10 లక్షల వరకు వర్తింపజేయాలి. గీత వృత్తిని అభివృద్ధి చేసేందుకు సబ్సిడీ పథకాలు రూపొందించడంలో ప్రభుత్వం గౌడ కులస్థులను విస్మరించే పరిస్థితి మారాలి. మొదటి నుంచి గౌడ జాతిపై చిన్నచూపుతో ప్రభుత్వం గీత కార్మికులపై వివక్ష చూపుతుంది. ఇప్పటికైనా పాలకులు గౌడన్న బతుకులకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు రూపొందించాలి.
వంశీకృష్ణ గౌడ్ బండి
9550837962