Sunday, December 22, 2024

గీతన్నలకు బీమా

- Advertisement -
- Advertisement -

త్వరలో మోపెడ్‌లు అందిస్తాం

వైన్ షాపుల్లో గౌడ్‌లకు
రిజర్వేషన్లు ఇచ్చాం, కల్లు
డిపోలు తెరిపించి అండగా
ఉన్నాం గీత కార్మికుల
పింఛన్‌ను రూ.2016కు
పెంచాం బిసిలకు అత్యంత
ప్రాధాన్యం ఇస్తున్నది
మా ప్రభుత్వమే దమ్ముంటే
కేంద్రంలో బిజెపి బలహీన
వర్గాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు
చేయాలి గౌడ ఆత్మీయ
సమ్మేళనంలో మంత్రి కెటిఆర్

Geetha karmikulu welfare by TRS Party

మన తెలంగాణ/హైదరాబాద్ : గీత కార్మికుల సంక్షేమానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు స్పష్టం చేశారు. రైతు బీమా మాదిరిగా గీత కార్మికుల బీమా ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. గీత వృత్తిదారులకు త్వరలో మోపెడ్‌లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమైక్య పాలనలో కులవృత్తులు పూర్తిగా ధ్వంసం కాగా, టిఆర్‌ఎస్ పాలనలో వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నామన్నారు. భారతదేశంలోనే బిసి వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్టం ఏదైనా ఉందంటే.. మొదటి వరస లో తెలంగాణ రాష్ట్రం ఉంటుందన్నారు. రాష్ట్ర బిజెపి నేతలకు దమ్ముంటే కేంద్రంలో ముందుగా బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రి త్వ శాఖను ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఆ పార్టీ నేతలు బిసి బంధు గురించి మాట్లాడాలన్నారు.

రాష్ట్రంలో బిసిల కోసమే ఒక మంత్రిత్వ శాఖ  పనిచేస్తోందన్నారు. దీనిని బట్టే బిసిల అభ్యున్నతి కోసం ఎవరూ పాటుపడుతున్నారో తేటతెల్లం అవుతోందన్నారు. బిసిల పట్ల బిజెపి నేతలవి కల్లిబొల్లి మాటలే తప్ప…వారిపై ఎలాంటి ప్రేమలేదని విమర్శించారు. బిజెపి అధికారంలో ఉన్న కర్నాటకలో కల్లు గీయడాన్ని నిషేధిస్తూ జీవో ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళననానికి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నదని చెప్పారు. ప్రతి కులవృత్తికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. వైన్ షాపుల్లో గీత కార్మికులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

అదే విధంగా గౌడన్నలకు చెట్ల పన్నును రద్దు చేశామన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కెటిఆర్ తెలిపారు. అలాగే కల్లు డిపోలను తెరిపించి గౌడన్నలకు అండగా నిలిచామన్నారు. పెన్షన్లను రూ.200 నుంచి రూ.2016కు పెంచామన్నారు. గీత కార్మికులకు కూడా నెల రూ.2016 పెన్షన్ ఇస్తున్నామన్నారు. ఇలాంటివి బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్కటైనా అమలు అవుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. వివిధ వర్గాలకు కల్పిస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో లక్ష చొప్పున సాయం చేస్తున్నామన్నారు. విద్యార్ధులు విదేశాల్లో చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోందన్నారు.

కేవలం సంక్షేమ పథకాలే కాకుండా పాలనలోనూ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయిస్తున్నామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు (2014) రాష్ట్రంలో కరెంట్ కోతలు విపరీతంగా ఉండేవన్నారు. కానీ స్వరాష్ట్రంలో కెసిఆర్ పాలనలో రాష్ట్రంలో కరెంట్ సమస్య పరిష్కారమైందన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచిందన్నారు. ఉచితంగా 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు సరఫరా చేసిందన్నారు. అలాగే వ్యవసాయ రంగానికి అవసరమైన నీటి కొరత లేకుండా పెద్దఎత్తున నీటి ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. ప్రపంచమే అబ్బుర పరిచే తీరిలో కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును సకాలంలో నిర్మించి చూపించారన్నారు. దీని వల్ల రాష్ట్రంలో వ్యవసాయం రంగం కొత్త పుంతలు తొక్కిందన్నారు. పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. ఫలితంగా వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చామన్నారు.

అలాగే రైతుల కోసం ప్రత్యేకంగా రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇక మిషన్ భగీరథతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. 975 గురుకుల పాఠశాలలు పెట్టి ఆడబిడ్డలను ఉన్నత విద్యావంతులను చేస్తున్నామని కెటిఆర్ వివరించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విధిగా నిర్వహిస్తూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచామన్నారు. దీంతో పల్లెలు కూడా పచ్చగా కళకళలాడుతున్నాయని కెటిఆర్ తెలిపారు. ప్రతి గ్రామంలో నర్సరీ, ట్రాక్టర్, నీళ్లు, కరెంటు ఏర్పాటు చేశామన్నారు. మునుముందు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంఎల్‌ఎ వివేకానందగౌడ్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎంఎల్‌ఎ భిక్షమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News