Wednesday, January 22, 2025

వరంగల్‌లో గలీజు దందా..

- Advertisement -
- Advertisement -

వరంగల్  : వరంగల్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేసి అబార్షన్లు చేస్తూనే ఉన్నారు. వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం ఆకస్మిక తనిఖీలు చేసి అనేక స్కానింగ్ సెంటర్ల ను సీజ్ చేస్తున్నప్పటికీ, అబార్షన్లు చేసే ముఠా లో ఏ మాత్రం మార్పు రాలేదు. గుట్టుచప్పుడు కాకుండా వరంగల్ సిటీలో అబార్షన్‌ల దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా వరంగల్ సిటీలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న, అబార్షన్లు చేస్తున్న ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం ట్రాప్ చేశారు.

ఓ మహిళా ఎస్‌ఐని అబార్షన్ కోసం పంపించి, అక్కడ జరుగుతున్న తంతు చూసి ఆపై నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా, అబార్షన్లు చేస్తున్న ప్రైవేటు వైద్యులు సహా మొత్తం పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ నగరం నడిబొడ్డున ములుగు రోడ్డు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ దందా సాగు తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వందకుపైగా అబార్షన్లు జరిగాయని, లింగనిర్ధారణ పరీక్షలు చేసి, అబార్షన్లు చేయడమే పనిగా ఈ ఆసుపత్రిలో పలువురు ముఠాగా ఏర్పడి పనిచేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఆసుపత్రిలో నిర్వహించవలసిన రికార్డులను నిర్వహించడం లేదని గుర్తించారు.

ఆపరేషన్ కేస్ షీట్లను కూడా సరిగ్గా నిర్వహించటం లేదని గుర్తించారు. ఆర్‌ఎంపిలు, ప్రైవేటు వైద్యులతో సహా మొత్తం పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ముఠా జిల్లా వ్యాప్తంగా ఎంతగా విస్తరించింది అన్న దానిపై కూపీ లాగుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News