2023 సంవత్సరాని కి గాను ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మ క నోబెల్ బహు మతిని అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్‌కి వరించింది. స్త్రీ పురుషుల మధ్య వేతనాలు, లేబర్ మార్కెట్ అసమానతలకు గల కారణాలను విశ్లేషణ చేసినందుకు గాను ఈమె ఈ అవార్డును పొందారు. 1990లో హార్వర్డ్ ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి పదవీ విరమణ పొందిన మొదటి మహిళ. అలాగే నోబెల్ ఎకనామిక్స్ బహుమతిని గెలుచుకున్న మూడవ మహిళ. అంతేకాక ఆర్థిక శాస్త్రంలో ఒంటరిగా నోబెల్ బహుమతి పొందిన మహిళగా రికార్డును సృష్టించారు.
గత 200 సంవత్సరాలుగా పని చేసే ప్రదేశంలో మహిళలు భాగస్వామ్యాన్ని ఈమె అధ్యయనం చేసి ఈ అసమానతలకు కారణాలు వివరించారు. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలో పని చేసే ప్రదేశంలో స్త్రీ, పురుషుల ఆదాయాల వ్యత్యాసాన్ని ఒకసారి చూద్దాం. ఉత్పాదక, ఉపాధి రంగాల్లో స్త్రీలు, పురుషు లందరికీ సమాన విలువ కలిగిన పనికి సమాన వేతనం కల్పించడం, ఆర్థిక వృద్ధిని గణనీయ స్థాయిలో ముందుకు తీసుకుపోవడానికి దోహదం చేస్తుంది. అన్ని రంగాలలో లింగ వివక్షకు తావుండకూడదని యుయన్‌ఒ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పొందుపర్చుకున్నప్పటి కీ సమాన విలువ కలిగిన పనికి సమాన వేతనం పొందడంలో అన్ని ప్రాంతాలలో స్త్రీలు, పురుషుల కంటే తక్కువ వేతనం పొందుతున్నారని, ప్రపంచ వ్యాప్తంగా 20% లింగ వేతన వ్యత్యాసం ఉందని, ఈ అంతరాన్ని తగ్గించడంలో పురోగతి నెమ్మదిగా ఉందని, పురుషులు, మహిళలకు సమాన వేతనం విస్తృతంగా ఆమోదించినప్పటికీ ఆచరణలో దానిని వర్తింప జేయడం కష్టంతో కూడుకున్న పని అని ఐక్యరాజ్యసమితి నివేదికలు తెలుపుతున్నాయి. సమాన వేతనం సాధించడం మానవ హక్కులు, లింగ సమానత్వానికి ఒక ముఖ్యమైన మైలు రాయి. సమాన చెల్లింపు అంతర్జాతీయ కూటమి (ఈక్వల్ పే ఇంటర్నేషనల్ కోయలిషన్ -ఇపిఐసి) అనేది ప్రస్తుతం ప్రపంచ ప్రాంతీయ, జాతీయ స్థాయిలలో లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించడానికి పని చేస్తున్న ఏకైక కూటమి.
ప్రాంతీయంగా విస్తృత అసమానతలతో ప్రపంచ వ్యాప్తంగా పురుషుల కంటే మహిళలు ఎక్కువగా నిరుద్యోగులుగా ఉన్నారు. ఉద్యోగం చేస్తున్న మహిళల్లో కేవలం 28% మంది మాత్రమే వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను పొందుతున్నారు. స్త్రీలు పురుషుల కంటే కనీసం రెండున్నర రెట్లు ఎక్కువ జీతం లేని గృహ, సంరక్షణ పనులను నిర్వహిస్తున్నారు. ఉప- సహారా ఆఫ్రికా, దక్షిణాసియాలో లింగ వేతన వ్యత్యాసం వరుసగా 4, 14 శాతంగా ఉంది. ఇంకా పిల్లలతో ఉన్న స్త్రీలు, పిల్లలు లేని స్త్రీలకన్నా తక్కువ వేతనాన్ని పొందుతున్నారు. దీనిని మాతృత్వ వేతనా వ్యత్యాసం అని కూడా పిలుస్తారు. ఈ వ్యత్యాసంపై వారిలో వరుసగా 4, 14 శాతాలుగా ఉన్నాయి.
మన దేశంలో…
మన దేశం అధిక జనాభాతో పాటు విస్తృత మార్కెట్ కలిగి ఉండడం మూలాన ప్రపంచ ఆర్థిక, నిర్మాణాత్మక అభివృద్ధిని ప్రభావితం చేసే ముఖ్యమైన దేశాలలో మన దేశం ఒకటిగా నిలుస్తుంది. ఈ అభివృద్ధి సాధించడానికి మన దేశ లేబర్ మార్కెట్లో పురుషులతో పాటుగా మహిళల వాటా కూడా కీలక పాత్ర కలిగి ఉన్నారు. అయినా మన దేశ లేబర్ మార్కెట్‌లో అసమానతలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం మన దేశంలో ఉపాధి లింగ వ్యత్యాసం 50.9% ఉంది. 70.1% పురుషులతో పోలిస్తే శ్రామిక శక్తిలో 19.2% మహిళలు మాత్రమే ఉన్నారు. భారత దేశంలో కాలక్రమేణా లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించడంలో చెప్పుకోదగ్గ పురోగతి ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వ్యత్యాసం ఎక్కువగా ఉంది.
1993- 94లో పురుషులతో పోలిస్తే భారతీయ మహిళలు సగటున 48% తక్కువ సంపాదించారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం 2018 -19లో ఈ వ్యత్యాసం 28%కి తగ్గింది. అధిక సంస్థలలో మహిళల పని సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. మాతృత్వ వేతనా వ్యత్యాసం మన దేశంలో కూడా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022 ప్రకారం భారత దేశం 146 దేశాలలో 135వ స్థానంలో ఉంది. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ భారత దేశంలో 7 రకాల అసమానత లు ఉన్నాయని తెలిపారు. అవి మరణాల అసమానత, జన్మతః అసమానత, ఉపాధి అసమానత, యాజమాన్య అసమానత, ప్రత్యేక అవకాశాల అసమానత, ప్రాథమిక సౌకర్యాల అసమాన త, గృహ అసమానత.
భారత్ తీసుకుంటున్న చర్యలు
లింగ వేతన వ్యత్యాసాన్ని పూడ్చేందుకు భారత దేశం అనేక చట్టాలను తీసుకు వచ్చింది. 1948లో కనీస వేతనాల చట్టాన్ని రూపొందించింది. 1976లో సమాన వేతన చట్టాన్ని ఆమోదించి న అగ్రగామి దేశాల్లో మన దేశం ఒకటి. మన దేశం రెండు చట్టాల్లోనూ 2019 సమగ్ర సంస్కరణలు చేపట్టి వేతనాలపై కోడ్‌ను రూపొందించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించడంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహాయపడిందని ఆధారాలు చూపిస్తున్నాయి. దేశంలో మొత్తం గ్రామీణ, వ్యవసాయ వేతనాలు వేగంగా పెరగడానికి ఈ పథకం దోహదపడింది. ఇంకా దీని ద్వారా ప్రత్యక్షంగా, కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కార్మికుల వేతన స్థాయిలను పెరగడం, పరోక్షంగా అధిక సంపాదన ద్వారా వ్యవసాయ వృత్తులలో పాల్గొన్న మహిళలకు ప్రయోజనాలు చేకూర్చింది. 2017లో ప్రభుత్వం 1961లో ప్రసూతి ప్రయోజన చట్టాన్ని సవరించడం వలన 10 లేదా అంత కంటే ఎక్కువ మంది కార్మికులు పని చేసే సంస్థల్లో మహిళలందరికీ వేతన రక్షణతో కూడిన ప్రసూతి సెలవును 12 వారాల నుండి 26 వారాలకు పెంచింది. ఇది అధికారిక ఆర్థిక వ్యవస్థలో పని చేస్తున్న మధ్యస్థ, అధిక- స్థాయి వేతన సంపాదకుల్లోని తల్లుల మధ్య మాతృత్వ వేతన వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఉపయోగడుతుంది. స్కిల్ ఇండియా మిషన్ లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించగలుతుంది.
డి జె మోహన రావు
9440485824