కూనూర్: హెలికాప్టర్ ప్రమాదం తర్వాత సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ కొంతసేపు ప్రాణాలతో ఉన్నారని ప్రత్యక్ష సాక్షి కాంట్రాక్టర్ శివ కుమార్ తెలిపారు. టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న తన సోదరుడి చూసేందుకు తాను అక్కడికి వెళ్లానని చెప్పారు. వాయుసేన హెలికాప్టర్ పెద్ద శబ్దంతో కూలడం, మంటల్లో కాలుతూ కన్పించిందని, దట్టమైన పొగ రావడంతో తాను, కొందరు ఆ ఘటనాస్థలికి చేరామన్నారు. తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తి తనను మంచి నీళ్లు కావాలని అడిగారని, అయితే ఆయనే రావత్ అన్న విషయం తనకు మూడు గంటల తర్వాత ఎవరో చెబితే తెలిసిందన్నారు. “నేను మాట్లాడిన వ్యక్తి సిడిఎస్ రావత్ అని నాకు తర్వాత కొందరు వ్యక్తులు ఫోటో చూయించి చెప్పారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని అప్పుడే తెలిసింది. ఈ దేశం కోసం ఎంతగానో సేవ చేసిన వ్యక్తికి నేను మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయాను. ఆ రోజు రాత్రి నేను సరిగా నిద్రించలేకపోయాను” అని శివ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభించింది. అది హెలికాప్టర్ ఎందుకు కూలిందన్న విషయాన్ని దర్యాప్తుదారులకు తెలుపగలదని భావిస్తున్నారు.