మార్చి 28, 29న జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక నిరుపేద ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు సంస్థలకు అనుకూలంగా పాలన కొనసాగిస్తోందని.. అందులో భాగంగా కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసే నేషనల్ మానిటైజేషన్ పైపులైనును ఉపసంహరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ కోరారు.
అదే విధంగా అధిక ధరలను నియంత్రించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని చేయాలని, 2020 విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 28-29 తేదీలలో రెండ్రోజుల పాటు సార్వత్రిక సమ్మెను నిర్వహించాలని జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. మార్చి 14వ తారీఖున ఢిల్లీలో గాంధీ పీస్ ఫౌండేషన్‌లో జరిగిన ఎస్‌కేఎం సమావేశం ఈ నెల 28-29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతును ప్రకటించిందని తెలిపారు. సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో రైతులు, నిరుపేద ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.