విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 8మందికి కొవిడ్ పాజిటివ్
మన తెలంగాణ / సికింద్రాబాద్ : గాంధీ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌లో సోమవారం నుంచి ఒమిక్రాన్ వేరియంట్‌ను నిర్ధారించే జీనోమ్ సీక్వెన్సీ పరీక్షలు ప్రారంభమైనట్లు గాంధీ మెడికల్ వైరాలజీ మైక్రో బయాలజీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ నాగమణి తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ పాజిటివ్ కలిగిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధ్దారించడానికి నిర్వహించే జీనోమ్ స్వీక్వెన్సీ పరీక్షల ఫలితాలు రావడానికి నాలుగు రోజుల సమయం పడుతుందన్నారు. జీనోమ్ సీక్వెన్సీ పరీక్షల కోసం కేంద్రం నుంచి కిట్స్ వచ్చాయని వీఆర్‌డిఎల్ ఫండ్ నుంచి వైద్య పరికరాలను ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి వైరస్ పరీక్షలకు అవసరమైన రీఎజంట్స్ వచ్చాయని తెలిపారు. ఒక్కొక్క శాంపిల్ కోసం పరీక్షలు నిర్వహించడం కుదరదని 48 మంది అనుమానితుల నుంచి వచ్చిన నమునాలు జమ కాగానే నిర్ధారణ పరీక్షల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. డిసెంబర్ ఒకటి నుంచి 15వ తేదీ వరకు తమకు అందిన 48శాంపిల్స్ పరీక్షల ప్రక్రియ సోమవారం ప్రారంభించామని ఫలితాలు నాలుగు రోజుల తర్వాత వస్తాయన్నారు. జీనోమ్ సీక్వెన్సీ నిర్ధ్దారణ పరీక్షల కోసం తమ సిబ్బంది సిడిఎఫ్‌డిలో శిక్షణ తీసుకున్నారని, అలాగే స్పెషలైజ్డ్ సాఫ్ట్‌వేర్‌కు చెందిన ఇంజనీర్ కూడ తమకు అందుబాటులో ఉన్నారని ఆమె తెలిపారు.