Wednesday, January 22, 2025

300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ రెండవ దశ

- Advertisement -
- Advertisement -

వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు
రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాలు
వైరస్ భయాలన్నింటికీ హైదరాబాద్ ప్రపంచానికి ఆశాదీపం
బయో ఏసియా సదస్సు 2024 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మంగళవారం ప్రారంభమైన హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ 2024 అవార్డుకు ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహిత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాను సిఎం అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సెమెంజాకు అవార్డును అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “మూడు వందల ఎకరాల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తాం. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీంతో మౌళిక సదుపాయాలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో రాష్ట్రంలో 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక గంట ప్రయాణ దూరంలోని అత్యంత సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సదుపాయంగా ఉంటుంది..” అని సిఎం అన్నారు.

కరోనా సమయంలో కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలున్న పరిస్థితుల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న బయోఏషియా సదస్సు కీలకంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బయోసైన్స్ రాజధానిగా హైదరాబాద్ నేడు యావత్ మానవాళికి ఒక భరోసాగా నిలిచిందని పేర్కొన్నారు. వైరస్ భయాలను ధీటుగా ఎదుర్కోగలమనే నమ్మకాన్ని హైదరాబాద్ కలిగించిందని, ఇప్పుడు ప్రపంచంలో వినియోగించే ప్రతి మూడు వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతోందని సిం గుర్తు చేశారు.

ఆరోగ్య భద్రత విషయంలో ప్రపంచంలోని అందరి సమస్యలు ఒకేలా ఉన్నాయని కోవిడ్ నిరూపించిందని, అయితే సమస్యల పరిష్కారాలను కూడా మనం కలిసికట్టుగానే సాధించాలని సిఎం సూచించారు. ఒక్క బయో సైన్సెస్ లోనే కాదు, ఐటీ-సాఫ్ట్ వేర్, రీసెర్చ్, స్టార్టప్ రంగాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన అనుకూల వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. చిన్న స్టార్టప్ లు, పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వారధిగా నిలిచే ఎంఎస్‌ఎంఈ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. “ మీరు నింగిలోని తారల వద్దకు చేరాలని కలలు కంటే.. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే రాకెట్ లా మా ప్రభుత్వం పనిచేస్తుంది ” అని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు భారీ స్థాయిలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. ఏటా 5 కోట్ల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తే లక్ష్యంగా ప్రఖ్యాత టకేడా సంస్థ ఇక్కడి బయోలాజికల్-ఈ సంస్థతో కలిసి హైదరాబాద్ లో తయారీ కేంద్రం నెలకొల్పడాన్ని స్వాగతించారు. వైరస్ ల వల్ల ప్రపంచంలో నెలకొన్న భయాలకు హైదరాబాద్ నుంచి నమ్మకాన్ని కల్పిస్తున్నామని సీఎం అన్నారు. జర్మనీకి చెందిన మిల్టేనీ సంస్థ తన రీసెర్చ్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని చెప్పారు. మానవాళికి మంచి చేసే చర్చలు, ముందడుగుతో హైదరాబాద్ బయో ఏషియా సదస్సు విజయవంతం కావాలని సిఎం ఆకాంక్షించారు.

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం
పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని ఆయన అన్నారు. బయో ఆసియా 2024 సదస్సు సందర్భంగా పలు దేశాల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్ లోని హెచ్‌ఐసిసిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ భౌగోళిక స్థితిగతులు, ఇతర అంశాలపైన సిఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు. హైదరాబాద్ లో భిన్నత్వంలో ఏకత్వం ఉందని, శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు.హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో లీడర్ గా ఉందని, మరిన్ని రంగాల్లో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకత్వ చొరవ కారణంగానే హైదరాబాద్ లో ఫార్మా విస్తరించిందన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఏ ప్రాంతానికి వెళ్లడానికైనా గంటన్నర సమయం సరిపోతుందన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్ ను పూర్తి చేస్తామన్నారు. హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ తెలిపారు.
కాగా భారతదేశంలో తొలి కమర్షియల్ ఆఫీస్ హైదరాబాద్ లోనే ప్రారంభిస్తున్నట్లు ఆమె సిఎం రేవంత్ రెడ్డికి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుకు వివరించారు. హైల్త్ కేర్, హైల్త్ టూరిజం, హైల్త్ స్కీల్లింగ్ ల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి శ్రీధర్ బాబులు ఈ సందర్భంగా సూచించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండి జెర్మీజూర్గన్స్ కూడా సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులతో సమావేశమయ్యారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి శ్రీధర్ బాబులు వారికి సూచించారు.

ప్రధానంగా వ్యాపార పంటలపైన దృష్టి సారించాలన్నారు. తెలంగాణలో 26 రకాల పంటలను పండించగలిగే భూములున్నాయని వారు వరించారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉందన్నారు. డిజిటల్ హైల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నట్లు జెర్మీజూర్గన్స్ కు ముఖ్యమంత్రి తెలియజేశారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని తనను కలిసిన బెల్జియం అంబాసిడర్ డెడిర్ వాండర్ హసక్ కు సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి మరికొందరు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. కావాల్సిన భూమితో పాటు ఇతర సదుపాయాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News