Friday, November 22, 2024

నిప్పుల కొలిమిగా భూగోళం

- Advertisement -
- Advertisement -

విశ్వంలో సమస్త జీవరాశులతో పాటు మానవ జాతి లాంటి జీవులు ఉన్న ఏకైక గ్రహం ఈ భూగోళమే. భూమి పుట్టుక గూర్చి అతి ప్రాచీన కాలం నుండి అనేక భావనలు ప్రచారంలో ఉన్నవి. పృథ్వీ, ధరణి, పుడమి, ధరిత్రి అనే పలు పేర్లతో పిలువబడుతున్న భూమి, ధర్మం (సార్వత్రిక ప్రయోజనం) అనే భావనతో అన్యోన్యాశ్రిత సంబంధాన్ని కలిగి ఉంది. కనుకనే భారతీయులు భూమిని ‘భూమాత’ అని అన్నారు. ప్రముఖ ప్రాచీన భారతీయ గణిత, ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్టు (కీ.శ.476-550) తన ‘ఆర్యభట్టీయం’ అనే గ్రంథంలో భూగోళః సర్వత్ వృతః అనగా భూమి వృత్తాకారంగా, అన్నీ వైపులా వ్యాపించి ఉందని చెప్పాడు. వరాహమిహీరుడు అనే మరో ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు (కీ.శ. 505- 587) తన పంచ సిద్ధాంతిక అనే గ్రంథంలో భూమి గూర్చి… పంచ భూతాలతో నిర్మితమై గుండ్రని భూమి పంజరంలో వేలాడే ఇనుప బంతిలాగా ఖగోళంలో తారల మధ్య నిలిచి ఉన్నది అని వ్యాఖ్యానించాడు.

కానీ భూమి ఒక గ్రహమని, సూర్య కుటుంబంలో ఒక భాగమని, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం భారీ విస్ఫోటనంతోబద్దలై సూర్యుని నుండి విడివడిన ఒక చిన్నముక్క భూమి అని ఆధునిక సైన్సు చెబుతోంది. నేడు అనేక సంపన్న దేశాలు సూర్య కుటుంబానికి ఆవల భూమి లాంటి మరో భూమి సెకండ్ ఎర్త్ ఉనికిని కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రహాంతర జీవుల జాడ కోసం కూడా ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సుదీర్ఘ వయస్సు గల భూమిపై మానవుల ఆధిపత్యం (ఆంత్రపోసెంట్రిజం) పెరుగుతున్న కొలది భూమిపై ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం జరిపే ప్రకృతి వనరుల విధ్వంసం, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల పెరుగుదల వంటి మతిమాలిన, ప్రకృతి విరుద్ధ చర్యలతో భూమి వేడెక్కడం (భూతాపం) వంటి విపరీత పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. తద్వారా భూగోళంపై మానవుని మనుగడకే ప్రమాదం ముంచుకొస్తున్నది. కనుక భూమికి, ప్రకృతికి కలుగుతున్న విధ్వంసాన్ని నిలువరించి, పుడమిని పరిరక్షించాలనే బృహత్తర లక్ష్యంతో ప్రతి యేటా ఏప్రిల్ 22 న ప్రపంచ ధరిత్రి దినోత్సవం (వరల్డ్ ఎర్త్ డే) ను జరుపుతున్నాము. అమెరికన్ సెనేటర్, పర్యావరణవేత్త గెలార్డ్ నెల్సన్ ఆలోచనల స్ఫూర్తితో, జాన్ మెక్నెల్ చొరవతో, 1969 డిసెంబర్ నెలలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపాలని నిర్ణయించనైనది.

అందుకనుగుణంగా 1970 ఏప్రిల్ 22 న మొట్టమొదటి ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరిగింది. గత సంవత్సరం 2022 ఏప్రిల్ 22న మన గ్రహంపై పెట్టుబడి అనే ఇతివృత్తంతో ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ సంవత్సరం కూడా గత ఏడాది ఇతివృత్తం కొనసాగింపుగా మన గ్రహంపై పెట్టుబడి (ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానేట్ ) అనే నినాదంతోనే 54 వ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించుకొంటున్నాము.193 దేశాలకు పైగా ఈ పుడమి పండుగను జరుపుకుంటున్నాయి. ఇందులో భూతాపం, ప్రకృతి పరిరక్షణ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య సంరక్షణ, ధరిత్రి పరిరక్షణల గూర్చి ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగేలా పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించబడింది.
భూగోళంపై సుమారు 71% నీరు, 29% భూభాగం ఉంది.

ఇప్పుడు భూగ్రహం అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనుచున్నది. భూమండలంపై శిలాజ ఇంధనాల అతి వినియోగం, కార్బన్ డై ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్గారాలు రోజు రోజుకూ పెరుగుతుండటం వల్ల కలిగే భూతాపం మానవాళికి పెనుశాపంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వనరుల విధ్వంసం, పర్యావరణ కాలుష్యం, ప్రకృతిలో అకస్మాత్తుగా చోటు చేసుకుంటున్న అసాధారణ వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, సముద్ర జలాల ఆమ్లత్వం, ఎయిరోసాల్స్, వేడిగాలులు, ఫారెస్ట్ ఫైర్స్, ఓజోన్ పొర క్షీణత, అణు యుద్ధాలు, బయోవార్స్, కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకం మొదలగు అంశాలు మానవుని ఆందోళనకు కారణమవుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలు తీరే విధం గా, భూతాపాన్ని ఎలా తగ్గించాలి! కాలుష్యం నుండి భూమిని ఎలా రక్షించుకోవాలి! భూగోళ సుస్థిరతను ఎలా కాపాడుకోవాలి! అనేవి మన ముందున్న ప్రధాన సవాళ్ళు. భూతాప నియంత్రణపై 2016లో జరిగిన పారిస్ ఒప్పం దం (కాప్-21) ప్రకారం 2030 నాటికి, పారిశ్రామిక విప్లవం నాటి కంటే ముందు పరిస్థితులతో పోలుస్తూ భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 2 సెంటీగ్రేడ్ డిగ్రీల వరకు పరిమితం చేయాలని ప్రపంచ దేశాలన్నీ నిర్ణయించాయి.

కానీ అధిక కర్బన ఉద్గారిత దేశాలు పారిస్ ఒప్పందం అమలులో ఆసక్తి కనబరుచుట లేదని, ఇప్పటి వరకు ఆచరణలో ఆశించిన పురోగతి లేదని డిసెంబర్ 2022లో జరిగిన ఈజిప్ట్ సదస్సు (కాప్-27) పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2030 2052 సంవత్సరాల మధ్య 1.5 సెంటిగ్రేడ్‌ల భూఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత 10-15 ఏండ్లలో ఉష్ణోగ్రత 2 డిగ్రీల కంటే ఎక్కువగా పెరుగుతుందని, దీన్ని అరికట్టాలంటే 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాలను సగానికి పైగా తగ్గించాలని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం వారి గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ అవుట్ లుక్ రిపోర్ట్ స్పష్టం చేసింది. సమీప కాలంలో భారత్‌తో సహా ప్రపంచ దేశాలలో పరిమితికి మించి వేడిగాలులు వీస్తాయని, తద్వారా మెజారిటీ ప్రజలు ఉష్ణ వత్తిడిని ఎదుర్కొంటారని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మన దేశంలో 80 శాతానికి పైగా ప్రజలు ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని, 2050 నాటికి ఈ సమస్య తీవ్రతరం అవుతుందని ఏప్రిల్ 2023లో విడుదలైన కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రమిత్ దెబనాథ్ నేతృత్వంలోని అధ్యయన నివేదిక తెలిపింది.

ఒకవేళ ఇప్పుడున్న భూ ఉష్ణోగ్రత 20c కంటే ఎక్కువగా పెరిగితే ధ్రువ ప్రాంతాల్లో మంచు ఫలకాలు కరుగుతాయి. సముద్రాలు పోటెత్తుతాయి. సముద్రతీర నగరాలు, చిన్న చిన్న దీవులు నీట మునుగుతాయి. రుతువులు గతి తప్పుతాయి. మండుటెండల్లో కుండపోత వర్షాలు కురుస్తాయి. వర్షాకాలంలో ఎండలు భగ్గుమంటాయి. అకాల వర్షాల వల్ల, వరదలు పంట నష్టం, జంతువుల వలసల్లో మార్పులు కనిపిస్తాయి. వడగాడ్పులు, కరువు, కాటకాలు ఏర్పడుతాయి. నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం వల్ల భూమి ఉపరితలం వేడెక్కడమే కాకుండా, సముద్రాల అడుగు భాగం కూడా వేడెక్కుతున్నట్లు వాషింగ్టన్ లోని నేషనల్ ఓషనిక్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ తన తాజా నివేదిక -2023 లో తెలిపింది. సముద్రాలలో కలిగే వేడి అలల (మెరైన్ హీట్ వేవ్స్ ) ప్రభావంతో అక్కడి జీవావరణ వ్యవస్థలోని ప్లాంక్టన్ మొదలు నీలి తిమింగలాల వరకు అన్నీ జీవుల మనుగడ ప్రమాదంలో పడుతోందని కూడా ఆ నివేదిక తెలియజేసింది. భూతాపం పెరుగుదలను అరికట్టలేకపోతే సముద్రాలు సలసల కాగిపోవడం ఖాయమని, ఫలితంగా సమీప కాలంలో భూమి నిప్పుల కొలిమిగా మారుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిస్థితిని తక్షణం అడ్డుకోకపోతే భూమి ఉష్ణోగ్రతలు గత 3 లక్షల సంవత్సరాలలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగిపోతాయి. అప్పుడు తలెత్తే విపత్తుల గురించి మాటల్లో చెప్పలేము అని సూత్రీకరించిన ప్రముఖ అమెరికన్ శాస్త్రవేత్త నోర్డ్ హాస్ మాటలు నిజం కాకమానవు.
మానవాళి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఈ తరుణంలో భూగోళ పరిరక్షణకు అవగాహనా పరిష్కార మార్గాలు కనబరచకపోతే ముందు తరాలు మనల్ని క్షమించవు. మానవ జీవనవికాసాన్ని, లక్ష్యాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వనరుల పరిమిత వినిమయంతో, ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశలో ప్రజలు, ప్రభుత్వాలు హెల్దీ ప్లానేట్ ఫర్ హెల్దీ పీపుల్ అనే ఆచరణాత్మక వైఖరితో ప్రణాళికలు రూపొందించాలి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం తీర్మానాలు ప్రపంచ దేశాలు కచ్చితంగా పాటించాలి. ప్రభుత్వాల పరంగా భూపరిరక్షణ, పర్యావరణ చట్టాలను కఠినతరం చేయాలి. ప్రకృతి వనరుల శోషణ కాకుండా, ఆ వనరుల పోషణ, సంరక్షణలే పరమావధిగా కృషి జరుగాలి.

భూగోళంపై ప్రకృతి వనరుల పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంచడంతో పాటు, ఉత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తరించడం, సుస్థిర సేద్య విధానాలకు పెద్దపీట వేయడం, ఆటవీ పరిరక్షణ ప్రాధాన్యాంశాలుగా గుర్తించి, అందుకనుగుణంగా తగు చర్యలు తీసుకోవడం వల్ల పుడమిని భూతాపం నుండి స్వాంతనం కలిగించవచ్చును. ప్రజలు సాధ్యమైనంత వరకు పర్యావరణ సానుకూల ఉత్పత్తులనే ఉపయోగించాలి. డిస్పోజబుల్ ప్యాకేజీలకు దూరంగా ఉండాలి. హరితహారం స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా ‘గ్రీన్ హ్యాండ్స్’ పేరుతో మె గా ప్లాంటేషన్ కార్యక్రమాల నిర్వహణకు నడుం బిగించాలి. పర్యావరణ రక్షణకు ప్రతి పౌరుడు పునః వాడకం, పునః చక్రియం, పునరుద్ధరణ, తగ్గింపు, పునః అభివృద్ధి అను 5 ఆర్స్ ఫార్ములాను పాటించాలి. భూతాపం, పర్యావరణ పరిరక్షణ, అడవుల నరికివేత, జీవరాశుల కనుమరుగు, కాలుష్యం, ఓజోన్ పొర క్షీణత వంటి అంశాల గూర్చి ప్రజలను వాతావరణ అక్షరాస్యులు (క్లైమేట్ లిటరేట్స్)గా, పర్యావరణ సంరక్షకులుగా మార్చుటకు అవగాహనా సదస్సులు, ఊరేగింపులు, భూవారోత్సవాలు, కరపత్రాల పంపిణీ, వన మహోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టాలి. విద్యార్థులను పర్యావరణ ఉద్యమ సైనికులుగా తయారు చేయాలి. మానవాళి ప్రస్తుతం అతి పల్చటి మంచు పొరపై ఉన్నదని, అది వేగంగా కరిగిపోతున్నదని ఇటీవల బెర్లిన్ సదస్సులో యుఎన్‌ఒ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వాఖ్యానించిన మాటలు భూగోళంపై మానవాళి మనుగడ అత్యంత ప్రమాదంలో ఉందని తెలియజేస్తున్నాయి. కనుక ప్రకృతిలో భాగమైన మానవుడు తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కొంటూ, తననష్టాన్ని తానే కొనితెచ్చుకుంటున్న భస్మాసుర ప్రవుత్తిని విడనాడి పర్యావరణ పరిరక్షణకు, భూగోళ సంరక్షణకు పాటుపడాలి.

డా. భారత రవీందర్
9912536316

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News