వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తారుమారు కేసు ఇప్పుడు మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మెడకు ఉచ్చు అయింది. తాను సంబంధిత జార్జియా అభియోగాల విషయంలో అధికారుల ముందు గురువారం సరెండర్ అవుతానని ట్రంప్ మంగళవారం తెలిపారు. అధికారుల విచారణకు సహకరించేందుకు నిర్ణయించుకుని సరెండర్ కానున్నట్లు వివరించారు. తాను జార్జియాలోని అట్లాంటాకు వెళ్లుతున్నట్లు అక్కడ సరెండర్ కానున్నట్లు చెపుతున్నానని, దీనిని నమ్మకపోయినా ఇది నిజం అని ట్రంప్ చమత్కరించారు.
అక్కడ వామపక్ష డిస్టిక్ అటార్నీఫానీ విల్లీస్ తనను అరెస్టు చేస్తారని ఆయన స్వయంగా తమ ట్విట్టర్‌లో తెలిపారు. 200,000 డాలర్లకు ఆయన తరఫున ఇప్పటికే లాయర్లు బాండు తయారుచేశారు. ట్రంప్ సరెండర్ దశలో అక్కడి ప్రధాన కౌంటీ జైలు వద్ద పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తారని ఫల్టన్‌కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. ట్రంప్ కోర్టులో సమర్పించే బాండు పత్రాలు ఇప్పటికే సిద్ధం చేశారు.పహ నిందితులను, ఇతరులనెవ్వరిని బెదిరించరాదు. సాక్షులను ప్రలోభపెట్టరాదు. సోషల్ మీడియాలో సంబంధిత విషయంపై అనుచిత వ్యాఖ్యలకు దిగరాదు. వంటి నిబంధనలను పొందుపర్చారు. 2024 వైట్‌హౌస్ ఎన్నికలకు ట్రంప్ ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తరఫున రేస్‌లో ముందుకు సాగుతున్నారు.
తనపై తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టారని తరచూ ఆయన సోషల్ మీడియాలో విమర్శలకు దిగుతూ వస్తున్నారు. ఇది పూర్తిగా న్యాయవిచారణకు భంగకరమైన అంశం అవుతుందని, ఇటువంటి చర్యలకు ఆయన పాల్పడరాదని పేర్కొంటూ ఇప్పటికే ఆయనకు ఆదేశాలు వెలువడ్డాయి. ట్రయల్‌కు ముందుగానే ట్రంప్ ఇప్పుడు రెండు లక్షల డాలర్ల మొత్తం చెల్లించాల్సి వచ్చింది. కోర్టు నుంచి వెలువడ్డ షరతులు ట్రంప్ సరిగ్గా పాటించినట్లు అయితేనే ఆయన అరెస్టు తరువాత బెయిల్‌కు వీలేర్పడుతుంది.
తరువాత కూడా ఆయన సముచిత రీతిలో చేసే వ్యాఖ్యలతోనే స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుంటుందని కోర్టు ఇప్పటికే తెలిపింది. ట్రంప్, ఆయనతో పాటు ఈ కేసులో 18 మంది సహ నిందితులు సరెండర్ అయ్యి , విచారణకు హాజరు కావడానికి న్యాయస్థానం శుక్రవారం మధ్యాహ్నం వరకూ గడువు ఇచ్చింది. అయితే ఒక్కరోజు ముందే తాను సరెండర్ అవుతానని ట్రంప్ ఇప్పుడు ప్రకటించారు. గురువారం నాటి ట్రంప్ పరిణామాలు అమెరికాలో తీవ్ర ఆసక్తికి దారితీస్తాయని భావిస్తున్నారు.