Monday, December 23, 2024

జర్మనీ టెక్నాలజీ…. ఆ బోగీలలో భద్రత ఎంత?

- Advertisement -
- Advertisement -

ఎల్‌హెచ్‌బి బోగీలతో భద్రత ఎంత ?
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో
మృతుల సంఖ్య పెరగడంపై నిపుణుల ఆందోళన

మనతెలంగాణ/హైదరాబాద్:  కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో అధునాతనమైన ఎల్‌హెచ్‌బి (లింక్ హాఫ్‌మన్ బుష్) బోగీలున్నా మృతుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం వీటి భద్రతపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జర్మనీ పరిజ్ఞానంతో తయారైన ఈ బోగీలు ప్రమాదం జరిగినప్పుడు వాటి తీవ్రతను తగ్గిస్తాయి. గతంలో తమిళనాడులోని పెరంబదూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఉత్పత్తి అయ్యే బోగీలను రైల్వే శాఖ వినియోగించేది.

Also Read: అక్కడ స్రైమరీ స్కూళ్లలో బైబిల్‌పై నిషేధం

ప్రమాదాలు జరిగినప్పుడు అది ప్రయాణికుల పాలిట మృత్యులోగిళ్లుగా మారేవి. దీంతో వాటి స్థానంలో జర్మనీ పరిజ్ఞానంతో రూపొందిన ఎల్‌హెచ్‌బి బోగీలను రైల్వే శాఖ వాడుతోంది. అందులో భాగంగా ముందుస్తుగా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ బోగీలను అమర్చడం ప్రారంభించింది. పాత బోగీల స్థానంలో దేశవ్యాప్తంగా చాలా రైళ్లకు వీటిని అమర్చుతోంది. పాతకాలం బోగీలతో (గరిష్ట వేగం 120 కిమీలు) ఉండగా ఎల్‌హెచ్‌బి బోగీలతో 200 కి.మీల వేగంతో వెళ్లినా కుదుపులు లేకుండా రైళ్లు ప్రయాణిస్తాయి. గతంలో రెండు, మూడు ప్రమాదాల్లో ఎల్‌హెచ్‌బీ బోగీలతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.

ఐసిఎఫ్, ఎల్‌హెచ్‌బి బోగీల మధ్య చాలా తేడా

ఐసిఎఫ్, ఎల్‌హెచ్‌బి బోగీల మధ్య చాలా తేడా ఉంటుంది. ఎల్‌హెచ్‌బి బోగీలు ఆధునిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ బోగీలు ప్రమాదాలను పూర్తి స్థాయిలో అరికడతాయని రైల్వే శాఖ భావిస్తోంది. అందులో భాగంగానే ప్రతి రైలుకు ఈబోగీలను అమర్చనున్నట్టు ప్రకటించింది.

ఐసిఎఫ్ బోగీలు ఇలా…

ఐసిఎఫ్ బోగీల్లో డ్యూయల్ బఫర్ హుక్ కష్టర్స్ ఉంటాయి. బోగీకి, బోగీకి మధ్య ఇవే అనుసంధానంగా ఉంటాయి. -రైలు ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పరస్పరం ఢీకొని ఒకదానిపైకి ఒకటి దూసుకెళతాయి. దీంతో భారీ ప్రాణనష్టం సంభవిస్తోంది. రైలు ప్రమాద మరణాల్లో 90 శాతం వీటి వల్లే జరుగుతున్నాయని రైల్వే అధికారులు గుర్తించారు. ఈ బోగీల గరిష్ట వేగ పరిమితి గంటకు 120 కి.మీ.లు మాత్రమే.

కానీ, చాలా రైళ్లను గరిష్టంగా 110 కి.మీల వేగంతోనే నడుపుతున్నారు. అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే ఐసిఎఫ్ బోగీలు ఊగిపోతూ భారీ శబ్దం చేస్తాయి. వీటిలో స్ప్రింగ్ సస్పెన్షన్ విధానం ఉంటుంది. రైలు వేగంగా ప్రయాణించినప్పుడు బోగీలు ఊయల మాదిరి ఊగకుండా నిరోధించలేకపోతోంది. ఇందులో సాధారణ ఎయిర్ బ్రేక్ విధానం ఉంటుంది. బ్రేక్ వేశాక వెంటనే నిలిచిపోతే బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముంది. దీంతో బ్రేక్ వేశాక రైలు చాలా దూరం ముందుకెళ్లి రైలు ఆగుతుంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందే ఈ కోచ్‌లో ఎసి బోగీకి రూ. కోటిన్నర, స్లీపర్ బోగీకి రూ. 85 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఒక్కో కోచ్‌లో 64 మంది ప్రయాణికులు ప్రయాణించేలా సీటింగ్ ఉంటుంది.

ఎల్‌హెచ్‌బి బోగీలు ఇలా..

ఎల్‌హెచ్‌బి బోగీలకు సెంటర్ బఫర్ కవర్లుంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పక్కకు పడిపోతాయి తప్ప ఒకదానిపై ఒకటి దూసుకుపోవు. -బోగీలు 200 కి.మీ.ల వేగాన్ని సైతం తట్టుకొనేలా వీటిని రూపొందించారు. కానీ, వాటిని ప్రస్తుతం 160 కి.మీ. వేగానికే రైల్వే అధికారులు పరిమితం చేశారు. ఎల్‌హెచ్‌బి కోచ్‌లు బరువు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ వేగంతో పరుగుపెడతాయి. కుదుపులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వీటిల్లో ఎయిర్‌కుషన్ సస్పెన్షన్ వ్యవస్థ ఉంటుంది. రైలు వేగంగా వెళ్లినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ బోగీలకు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. దీనివల్ల బ్రేక్ వేసినా బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముండదు.

మైల్ స్టీల్‌తో రూపొందే ఎసి కోచ్‌లకు రూ.2.5 కోట్లు ఖర్చు అవుతుండగా, స్లీపర్ కోచ్‌లకు రూ. కోటిన్నర వరకు ఖర్చవుతోంది. -ఐసిఎఫ్ బోగీల కంటే 2 మీటర్ల ఎక్కువ పొడవు ఉండే ఎల్‌హెచ్‌బి బోగీలో 72 మంది ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఎల్‌హెచ్‌బి బోగీలున్న రైళ్లలో కూడా ప్రమాదాల తీవ్రత అధికంగా ఉండడంతో ఎల్‌హెచ్‌బి బోగీల వల్ల ఎంతమేర లాభం అన్న దానిపై నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వేకు ఆధునిక ఎల్‌హెచ్‌బి బోగీలను కేటాయించాలని గతంలో కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి రైల్వే బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వే అధికంగా నిధులను కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో 6,578 ఆధునిక ఎల్‌హెచ్‌బి బోగీలను కేటాయించాలని నిర్ణయించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News