Monday, December 23, 2024

భారతీయ నిపుణులకు జర్మనీ వీసాలు 90 వేలకు పెంపు

- Advertisement -
- Advertisement -

భారత్, జర్మనీ మధ్య సంబంధాలు పటిష్ఠం అవుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హర్షం ప్రకటించారు. ఇటీవల సహకారాలే సుదృఢ మైత్రికి తార్కాణం అని ప్రధాని పేర్కొన్నారు. ఢిల్లీలో 18వ ఆసియా పసిఫిక్ జర్మన్ వాణిజ్య మహాసభ 2024లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, ‘ఒక వైపు సిఇఒ ఫోరమ్ ఇక్కడ సమావేశం జరుగుతుండగా మరొక వైపు మన నౌకా దళాలు సంయుక్తంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి’ అని చెప్పారు. జర్మన్ నౌకా దళ నౌకలు గోవా రేవులో ఉన్నాయి. భారత్, జర్మనీ మధ్య ఏడవ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. ‘అంటే భారత్, జర్మనీ మధ్యస్నేహం ప్రతి రంగంలో ప్రతి అడుగులో సుదృఢం అవుతోందన్నమాట’అని మోడీ అన్నారు. ఈ ఏడాదితో భారత్ జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తి అవుతున్నాయని ప్రధాని తెలియజేశారు. వచ్చే 25 ఏళ్లు ఈ భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కబోతున్నదని ఆయన సూచించారు.

‘ఈ సంవత్సరం భారత్ జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25వ సంవత్సరం. రానున్న 25 సంవత్సరాలు ఈ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చబోతున్నది. రానున్న 25 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన భారత్ కోసం ఒక రోడ్‌మ్యాప్ రూపొందించాం’ అని మోడీ తెలిపారు. జర్మన్ మంత్రివర్గం ‘భారత్‌పై దృష్టి కేంద్రీకరింపు’ డాక్యుమెంట్ విడుదల పట్ల ప్రధాని మోడీ హర్షం వెలిబుచ్చారు. పటిష్ఠమైన రెండు ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ శ్రేయస్సు కోసం ఏవిధంగా సహకరించుకోగలవో ఆ డాక్యుమెంట్ వివరిస్తోంది. ‘ఇటువంటి కీలక తరుణంలో జర్మన్ మంత్రివర్గం భారత్‌పై దృష్తి కేంద్రీకరింపు డాక్యుమెంట్‌ను విడుదల చేసినందుకు ఆనందిస్తున్నాను. ప్రపంచంలోని పటిష్ఠమైన రెండు ప్రజాస్వామ్య వ్యవస్థలు, రెండు ప్రపంచ ప్రముఖ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ శ్రేయస్సు కోసం సంయుక్తంగా ఒక బలమైన శక్తి కాగలవో సూచించే బ్లూప్రింట్ ఆ డాక్యుమెంట్.

వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒక సంపూర్ణ రీతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు దృక్పథాన్ని, నిబద్ధతను అది ప్రతిబింబిస్తోంది. భారత నైపుణ్య శ్రామిక శక్తిపై జర్మనీ చూపిన నమ్మకం ముఖ్యంగా అద్భుతమైనది’ అని మోడీ పేర్కొన్నారు. నిపుణులైన భారతీయులకు వీసాలు హెచ్చించాలన్న జర్మనీ నిర్ణయం ఆ దేశ వృద్ధికి దోహదం చేయగలదన్న దృఢవిశ్వాసాన్ని కూడా ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. ‘నిపుణులైన భారతీయులకు ప్రతి సంవత్సరం ఇచ్చే వీసాలను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని జర్మనీ నిశ్చయించింది. ఇది జర్మనీ వృద్ధికి కొత్త ఊపు ఇస్తుందని నా దృఢవిశ్వాసం’ అని మోడీ చెప్పారు. ‘మన పరస్పర వాణిజ్యం 30 బిలియన్ డాలర్లపై స్థాయిని చేరింది. ఇప్పుడు ఒక వైపు వందలాది జర్మన్ సంస్థలు భారత్‌లో ఉండగా, భారత్ సంస్థలు కూడా జర్మనీలో తన ఉనికిని వేగంగా పెంచుకుంటున్నాయి. భారత్ కూడా ప్రపంచ వాణిజ్య, తయారీ కేంద్రంగా మారుతోంది. అటువంటి పరిస్థితిలో భారత్‌లో తయారీ, ప్రపంచం కోసం తయారీగా చేసేందుకు మీకు ఇది అత్యంత అనువైన సమయం’ అని ప్రధాని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News