ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ స్పందించిన తీరుకు భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.జర్మనీ విదేశాంగ మంత్రిత్వశాఖ కేజ్రీవాల్ అరెస్టుపై విడుదల చేసిన ప్రకటన దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలంటూ అనవసర వ్యాఖ్యలు చేసింది.దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీ లోని జర్మనీ రాయబారిని కేంద్ర విదేశాంగ శాఖ పిలిచి నిలదీసింది. కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. “ భారత్ ప్రజాస్వామ్య దేశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన , నిష్పాక్షిక మైన విచారణకు అర్హులు.
అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీ లోని ఆ దేశ రాయబారికి సమన్లు పంపింది. శనివారం ఉదయం జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ జార్జ్ ఎంజ్‌వీలర్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఆయన వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది.