Saturday, November 23, 2024

లింకన్ అంతర్యుద్ధ ఉపన్యాసం

- Advertisement -
- Advertisement -

అమెరికా అంతర్యుద్ధ కాలంలో పెన్సిల్వేనియా రాష్ట్రం జెట్టిస్బర్గ్ వద్ద సైనిక శ్మశాన వాటికను ప్రారంభిస్తూ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 19 నవంబర్ 1863 న 15 వేల మందికి చేసిన సంబోధనే జెట్టిస్బర్గ్ ఉపన్యాసం. ఈ శ్మశానం జెట్టిస్బర్గ్ జాతీయ శ్మశానంగా మారింది. అంతర్యుద్ధపు ముఖ్య నిర్ణయాల ప్రదేశం జెట్టిస్బర్గ్. ఆ పోరులో నాలుగున్నర నెల్ల క్రితమే అమెరికా సైన్యం కాన్ఫెడరేట్ దళాలను ఓడించింది. అమెరికా చరిత్రలో జెట్టిస్బర్గ్ ఉపన్యాసం ముఖ్యమైంది. అంతర్యుద్ధ, బానిసత్వాల అంతం ఈ ఉపన్యాస ఆశయాలు. అమెరికా నుండి వేర్పాటు ప్రకటించుకున్న గుర్తింపు పొందని 11 వేర్పాటువాద దక్షిణ రాష్ట్రాలను కాన్ఫెడరేట్ అంటారు. అది సైన్యాన్ని నిర్మించుకుంది. అంతర్యుద్ధంలో అమెరికాతో యుద్ధం చేసింది. 1865కు ముందు కొన్ని అమెరికా రాష్ట్రాల్లో బానిసత్వం, బానిసల వ్యాపారం చట్టసమ్మతం. శ్వేత జాతీయునితో నీగ్రో సమానుడు కాడు. ఉచ్ఛజాతికి నీగ్రోలు లోబడి ఉండాలన్న బానిసత్వం అక్కడి సహజ సామాజిక నియమం.

7 బానిస రాష్ట్రాలు దక్షిణ కరోలిన, మిసిసిపి, ఫ్లోరిడా, అలబామా, జార్జియా, లూసియానా, టెక్సాస్ కలిసి 8 ఫిబ్రవరి 1861 న కాన్ఫెడరేట్ రాజ్యాన్ని, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పర్చుకున్నాయి. ఏ దేశమూ దీన్ని గుర్తించలేదు. బ్రిటన్, ఫ్రాన్స్ లు వీటిని పోరాట రాష్ట్రాలుగా గుర్తించి ఆయుధాలను, ఇతర సామగ్రిని సరఫరా చేశాయి. తర్వాత 4 రాష్ట్రాలు వర్జీనియా, అర్కన్సాస్, టెన్నెసి, ఉత్తర కరోలిన కాన్ఫెడరేట్‌లో కలిశాయి. 4 సరిహద్దు బానిస రాష్ట్రాలు డెలవరె, మేరీలాండ్, కెంటక్కి, మిసౌరి లు అమెరికాలోనే ఉండిపోయాయి. 4 మార్చి1861 న లింకన్ అధ్యక్షుడయ్యారు. 12 ఏప్రిల్ 1861న అంతర్యుద్ధం మొదలయింది. అమెరికా సమగ్రత, సమైక్యతల రక్షణ లక్ష్యంగా లింకన్ అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. బానిసత్వ నిషేధం లింకన్ ధ్యేయం. ఏ రాష్ట్రంలో కాని, ఒక రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కాని బానిసలను విముక్తి చేస్తానని 1 జనవరి 1863న లింకన్ ప్రకటించారు.అమెరికా పార్లమెంటు 31జనవరి 1865న బానిసత్వ రద్దును ఆమోదించింది. 6 డిసెంబర్ 1865న 13వ రాజ్యాంగ సవరణతో బానిసత్వం రద్దయింది. 9 ఏప్రిల్ 1865 నాటికి క్రమేపీ కాన్ఫెడరేట్ దళాలు, నాయకులు బలహీనపడ్డారు.

కాన్ఫెడరేట్ సానుభూతిపరుడు, నటుడు జాన్ విల్కెస్ బూత్ 15 ఏప్రిల్ 1865 న లింకన్‌ను హత్య చేశాడు. కాన్ఫెడరేట్ రాష్ట్రాలు అంతమయ్యాయని నాటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ 9 మే 1865 న ప్రకటించారు. 18 నవంబర్ 1863 రాత్రి లింకన్ గంభీర నిశ్శబ్ద ఆలోచనలో మునిగారు. 19 నవంబర్ 1863 ఉదయం అనారోగ్యంగా కనిపించారు. కాగితంపై ఏదో రాసుకున్నారు. 2 నిమిషాల ఆయన మాట ల్లో ప్రతి పదం స్పష్టతతో ప్రతిధ్వనించింది. ఆ స్వరం జనాలను కదిలించింది. ఆ ఉపన్యాసాన్ని ప్రజలు నిశ్శబ్దంగా విన్నారు. 4 స్కోర్ల ఏడేళ్ళ (87) క్రితం మన పితామహులు ఒక కొత్త దేశాన్ని (అమెరికాను) ఈ ఖండంలో స్థాపించారు. స్వేచ్ఛతో అందరూ సమానమన్న అంకిత భావంతో అది ప్రతిపాదించబడింది. ఇప్పుడు మనం భయంకర అంతర్యుద్ధంలో ఉన్నాము.ఇది మన నిబద్ధతను పరీక్షిస్తోంది. భీకర పోరాటంలో మనమిక్కడ సమావేశమయ్యాము. ఈ దేశ దీర్ఘకాల మనుగడకు ప్రాణాలర్పించినవారి శాశ్వత విశ్రాంత స్వల్ప స్థలాన్ని అంకితం చేసుకోడానికి ఇక్కడికి వచ్చాం.

ఈ అమరులు వ్యర్థంగా మరణించలేదని, దేవుని అధీన ఈ దేశంలో నూతన స్వేచ్ఛ ఉద్భవించాలని, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ప్రభత్వం భూమి నుండి మాయం కారాదని (శ్మశానంలో కలవకూడదని) మనమిక్కడ ఉన్నతంగా తీర్మానించుకుందాం. ఈ వాక్యాలు దశాబ్దాల తరబడి ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. అమెరికాకే కాక అన్ని ప్రభుత్వాలకు శక్తివంతమైన చలన క్రియాశీలతలకు దారి చూపాయి. అధ్యక్షుని ఆనాటి ఉపన్యాస జాబితాలో లేని జాగ్రత్తగా కూర్చబడిన ఈ సంక్షిప్త లింకన్ ఉపన్యాసం అమెరికా ప్రయోజనాలను కాపాడిన అతి ప్రభావశీల వ్యాఖ్యానం. 272 పదాల ఆ ఉపన్యాసంలో అప్పటికి 87 ఏళ్ల క్రితం 4 జులై1776 న 13 రాష్ట్రాలతో ఏర్పడ్డ అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను ప్రస్తావించారు. నీతినిబద్ధత స్వేచ్ఛా స్వాతంత్య్రాల దేశం కోసం ప్రాణాలర్పించి జెట్టిస్బర్గ్ శ్మశానంలో నిద్రిస్తున్న అమరుల త్యాగాలను వివరించారు. జాత్యహంకారం, బానిసత్వం అమానవీయాలని, మనుషులంతా సమానమని, అంతర్యుద్ధం తప్పక నెగ్గవలసిన పరీక్ష అని అన్నారు. ప్రజాతంత్రం సమాధి కారాదని హెచ్చరించారు.

లింకన్ జెట్టిస్బర్గ్ ఉపన్యాసం అమెరికా అంతర్యుద్ధంలో ఐరోపా దేశాల జోక్యాన్ని తగ్గించింది. పాలకుల ఉపన్యాసాలు ప్రజలకు నమ్మకం కలిగించాలి. సమస్యలను పరిష్కరించాలి. సమస్యల సృష్టికర్తలకు మానవీయ ఆలోచన కలిగించాలి. ఒకరిని మరొకరిపై రెచ్చగొట్టరాదు. స్వాతంత్య్ర సమరవీరులు అంకితభావంతో, పవిత్ర కర్తవ్యంగా చేసి మిగిలిన పనులను పూర్తి చేయాలి. వారు సాధించిన తాత్విక సిద్ధాంతభౌతిక సంపదలను నాశనం చేయరాదు. మాటలు కాక చేతలు భావితరాలకు మేలు చేస్తాయి. వారి త్యాగ ఫలిత స్వాతంత్య్రానికి నేటి పాలకులు భంగం కలిగించరాదు. ముందుతరాల పోరాటాలు, త్యాగాలు నేటి తరానికి అనేక హక్కులనిచ్చాయి. వాటిని కాపాడాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతలు లేక తమ హక్కులే తెలియని వారికి సహకరిద్దాం. పెట్టుబడిదారీ సమాజంలో సంక్షేమ రాజ్యాన్ని ఆశించలేము. కార్పొరేట్లకు కొమ్ముకాయని సంక్షేమ పథకాలను ఆహ్వానిద్దాం.

స్వేచ్ఛా స్వాతంత్య్ర, సామ్యవాద, మార్క్సిస్టు సిద్ధాంత కర్తలైన వామపక్ష పోరాట యోధులతో సహా భారత జాతీయోద్యమ నాయకుల త్యాగాలను నేటి పాలకులు వక్రీకరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను పాతరేశారు. రాజ్యాంగ లోపాలను వాడుకొని ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తున్నారు. భారత సామాజిక సమైక్యత సంరక్షణ నేటి మన అవసరం. లింకన్‌ను చంపిన జాన్ విల్కెస్ బూత్‌లు గాంధీని హంతక మతోన్మాద గాడ్సేల రూపంలో భారతంలోనూ తయారయ్యారు. ఇప్పుడు పాలక గాడ్సేలు పెరిగారు. నేటి భారత నిరంకుశ, కార్పొరేట్ ఫాసిస్టు ధోరణులను ప్రజలు నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయ పార్టీలను సమర్థించే చైతన్యాన్ని ఈ నిశ్శబ్ద భవిష్యత్తు నిర్ణేతలకు అందించాలి. లింకన్ నిర్వచించిన ప్రజాస్వామ్య ప్రభుత్వ అవసరాన్ని గుర్తు చేయాలి. ప్రజా సంక్షేమ సమసమాజ విధానాల పార్టీలు ఫాసిస్టు వ్యతిరేక లక్ష్యంలో కలిసి పని చేయాలి. మనమిప్పుడు అపాయకర భయంకర భవిష్యత్తును కాపాడుకోవలసిన పరీక్షా సమయంలో ఉన్నాము. ఇది మనం తప్పక గెలవవలసిన పరీక్ష.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News