Monday, December 23, 2024

కాంగ్రెస్‌లో ‘ఘర్ వాపసీ’

- Advertisement -
- Advertisement -
తెలంగాణ నేతలతో అరగంట పాటు మాట్లాడిన రాహుల్
జులై 2న పొంగులేటి, 14 లేదా 16న జూపల్లి కాంగ్రెస్‌లో చేరిక

హైదరాబాద్ : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అగ్రనేతల సమక్షంలో జులై రెండో తేదీన ఆ పార్టీలో చేరనున్నారు. సోమవారం ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, అరికెల నర్సారెడ్డి, గురునాథ్‌రెడ్డిలతో పాటు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న ఇతర నేతలు కలిశారు. జులై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్న సభకు రావాలని రాహుల్, మల్లికార్జున్ ఖర్గేలను టిపిసిసి నేతలు ఆహ్వానించారు. ఆ సభలోనే మరింత మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో అరగంట పాటు మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అందరూ మళ్లీ సొంత పార్టీలోకి రావడం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఘర్ వాపసీ జరుగుతుందని చెప్పారు. ‘కెసిఆర్ హఠావో తెలంగాణ బచావో’ నినాదంతో ముందుకు సాగాలని సలహా ఇచ్చారు. దాదాపుగా యాభై మంది నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ ఎఐసిసి ఆఫీసుకు వచ్చారు. వారితో పాటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతులు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, చిన్నారెడ్డి , రేణుకాచౌదరి సహా కీలక నేతలంతా వచ్చారు. ఈ సందర్భంగా ఎఐసిసి కార్యాలయం సందడిగా మారింది. నేతలందరితో ఖర్గే, రాహుల్ గాంధీ ఫోటో సెషన్ నిర్వహించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే కాంగ్రెస్‌లో చేరిక : పొంగులేటి
తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షలు స్వరాష్ట్రంలో ఒక్కటి కూడా నెరవేరలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ తో భేటీ తర్వాత ఎఐసిసి కార్యాలయంలో కీలక నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగాకీలక వ్యాఖ్యలు చేశారు. తము పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వేలు చేయించామని బిఆర్‌ఎస్‌పై ఎనభై శాతం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఓ దశలో తాము ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేశామని, కానీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని బిఆర్‌ఎస్‌కు మేలు జరగకూడదన్న ఉద్దేశంతోనే తాము కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకుమన్నారు.

బిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవ్వాల్సి ఉందని పొంగులేటి పిలుపు నిచ్చారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ గ్రాఫ్ పెంచిందని వివరించారు. కర్ణాటక విజయంతో హస్తం పార్టీ మరింత పుంజుకుందని చెప్పారు. రాష్ట్రంలో బిజెపి పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోందన్నారు. అన్ని పరిణామాలు బేరీజు వేసుకుని రాహుల్‌ను కలవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. రాష్ట్రం ఇచ్చినందుకు ప్రజలు కాంగ్రెస్‌కు రుణపడి ఉన్నారని చెప్పారు. ‘ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చారు. మాయ మాటలు చెప్పి ఉంటే 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. మాయమాటలతో బిఆర్‌ఎస్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. ఆరు నెలల విశ్లేషణ తర్వాత కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం. జులై 2న ఖమ్మంలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతాం. కనీవిని ఎరుగని రీతిలో ఖమ్మం సభ జరుగుతుంది. బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను మించి జులై 2 సభ ఉంటుంది. వ్యాపారమే ముఖ్యమనుకుంటే కాంగ్రెస్‌లో చేరేవాడిని కాదు. ఇప్పటికే నాకు ఇబ్బందులు మొదలయ్యాయి. బిఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసురుతున్నా. మా ఖమ్మం సభకు ఎన్ని లక్షల మంది వస్తారో లెక్కేసుకోండి.‘ – అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

వచ్చే నెల 14 లేదా 16న రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతా : జూపల్లి ప్రకటన
‘ఈసారి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వకపోతే దేవుడు కూడా క్షమించడు. కాంగ్రెస్‌లోనే చేరాలని నిర్ణయించుకున్నాం. వచ్చే నెల 14 లేదా 16న రాహుల్ సమక్షంలో చేరుతాం. మహబూబ్‌నగర్‌లో నిర్వహించే సభలో కాంగ్రెస్‌లో చేరుతామ’ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ లో చేరుతున్న 35 మందితో జాబితా విడుదల చేసిన ఎఐసిసి
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ లో చేరబోతున్న 35 మంది నేతలతో కూడిన లిస్ట్ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి చేరింది. ఈ జాబితాను ఎఐసిసి విడుదల చేసింది. జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుది కాగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు 15వ స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News