Thursday, January 23, 2025

సొంత గూటికి 19 మంది ఆజాద్ విధేయుల రాక!

- Advertisement -
- Advertisement -

జమ్మూ: గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’లో చేరిన 19 మంది నాయకులు శుక్రవారం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించనున్న తరుణంలో వారు ఇలా తిరిగి గ్రాండ్ ఓల్డ్ పార్టీలోకి వచ్చారు. అలా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులలో మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తారాచంద్, నాలుగుసార్లు మంత్రిగా పనిచేసిన పీర్జాదా ముహమ్మద్ సయీద్, మాజీ శాసనసభ్యుడు ఠాకుర్ బల్వాన్ సింగ్, జమ్మూ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంకె. భరద్వాజ్ తదితరులు ఉన్నారు. దీంతో గులాం నబీ ఆజాద్ పెట్టిన ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’లో ముసలం మొదలయినట్లయింది.

ఈ సందర్భంగా తారాచంద్ మాట్లాడుతూ ‘మేము కాంగ్రెస్‌ను వీడాలనుకుని నిర్ణయించి తప్పుచేశాము. తిరిగి మా పాత పార్టీలోకి రావడంపై అందరూ సంతోషంగా ఉన్నారు. మేము లౌకిక శక్తులను బలపరుస్తాం’ అన్నారు. వివిధ హోదాల్లో పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తాము రుణపడి ఉంటామని కూడా వారీ సందర్భంగా తెలిపారు. ‘గులాం నబీ ఆజాద్ మంచి మిత్రుడు, మేము ఆయన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తాం. లౌకిక శక్తులపై దాడి జరుగుతోందని మేము గుర్తించాం, అందుకే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం’ అని చాంద్ అన్నారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మాట్లాడుతూ ‘ఈ నాయకులు పార్టీని వీడలేదు. కాకపోతే వారు కొన్నాళ్లు సెలవు తీసుకున్నారంతే. వారంతా ఇప్పుడు మళ్లీ తిరిగొచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ఇలా కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చిన కశ్మీర్ నాయకులంతా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, సిపిఐ(ఎం) నాయకుడు ఎం.వై. తరిగామి కూడా రాహూల్ మార్చ్‌లో పాల్గొననున్నారు. శ్రీనగర్‌లోకి రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ ప్రవేశించగానే మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతం పలుకనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News