Friday, December 20, 2024

ఘరానా మోసం… వినూత్న పంథాలో చెలరేగిపోతున్న సైబర్ ముఠాలు

- Advertisement -
- Advertisement -
వేలి ముద్రలు చోరీ చేసి, నగదు విత్ డ్రా
ఇద్దరు అంతరాష్ట్ర కేటుగాళ్లు పట్టివేత

మన తెలంగాణ/హైదరాబాద్ : వినూత్న పంథాలో సైబర్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఘరానా మోసానికి తెరలేపుతున్నాయి. వేలి ముద్రలు చోరీ చేసి నగదు విత్ డ్రా చేసిన కేసుకు సంబంధించి ముఠాలోని ఇద్దరు అంతరాష్ట్ర కేటుగాళ్లు బీహార్‌కు చెందిన రంజిత్, బెంగళూరుకు చెందిన సఫత్ ఆలంను సిఐడి అధికారులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గతేడాది డిసెంబర్‌లో నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఖాతాలో నుంచి విడతల వారీగా రూ.24వేల రూపాయలు విత్ డ్రా అయ్యాయి. అతని ప్రమేయం లేకుండా ఖాతాలో నుంచి నగదు పోవడాన్ని గుర్తించిన విశ్రాంత ఉద్యోగి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన సిఐడి అధికారులు వేలిముద్రల చోరీతో ఈ మోసం జరిగినట్లు తేల్చారు. ప్రధాన నిందితుడు అక్రంను సిఐడి అధికారులు గతేడాది డిసెంబర్‌లోనే అరెస్ట్ చేశారు.

రిజిస్ట్రేషన్లు, రెవన్యూ శాఖ వెబ్ సైట్ల నుంచి నిందితులు సేల్ డీడ్ పత్రాలను డౌన్ లోడ్ చేసుకొని, వాటిలో ఉన్న వేలిముద్ర గుర్తులను కంప్యూటర్లలో స్కాన్ చేసినట్లు సిఐడి అధికారుల దర్యాప్తులో తేటతెల్లమైంది. డాక్యుమెంట్లలో ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లు సైతం సేకరించినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. ఆ తర్వాత సిలికాన్ వేలిముద్రలు రూపొందించి, కస్టమర్ సర్వీస్ పాయింట్ మిషన్లలో నగదు తీసుకు న్నట్లు, ఈ ముఠా పలుచోట్ల ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. సైబర్ కేటుగాళ్లు వేలిముద్ర ప్రింట్‌ను తొలుత పేపర్‌పైకి తీసుకుని గాజు గ్లాస్‌పై ముద్రిస్తారు. దానిపై రబ్బర్ పోస్తే. పాలీమర్ ప్రింట్ తయారవుతుంది. అదే నకిలీ వేలిముద్రగా మారుతుంది. బయోమెట్రిక్ యంత్రంలో ఆ నకిలీ వేలిముద్రల్ని పెట్టి బ్యాంకు ఖాతాలోని నగదు సైబర్ కేటుగాళ్లు కాజేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు ఎపి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్, ఐజీఆర్‌ఎస్‌లోని భూలావాదేవీల దస్త్రాలు చోరీ చేశారు. వీటి ఆధారంగానే తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు మోసాలకు ఈ సైబర్ ముఠాలు తెరతీశాయి. రూ.14.64 లక్షల్ని నేరస్థులు ఇలా కాజేసినట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు.
అప్రమత్తతే శ్రీరామరక్ష…
ఇలాంటి వినూత్న తరహాలో నేరాలకు తెరదీస్తున్న సైబర్ ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి పలు సూచనలను తెలుపుతున్నారు. సైబర్ కేటుగాళ్లు మీ ఖాతాలోని డబ్బుల్ని కొట్టేస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లోకి వెళ్లి అందులో ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం పోలీసులు సూచించారు. ఏది ఏమైనా అప్రమత్తతే శ్రీరామరక్ష అన్న విషయాన్ని విస్మరించొద్దు.. ఇలాంటి సైబర్ కేటుగాళ్ల పట్ల  తస్మాత్.. జాగ్రత్త…!!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News