Friday, February 21, 2025

రూ.60 కోట్లతో పెద్దగట్టుకి ఘాట్ రోడ్డు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలంలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయం అభివృద్ధికి రూ.60 కోట్లు కేటాయించి, ఆలయం వద్ద ఘాట్ రోడ్డుతో పాటు గెస్ట్‌హౌస్ నిర్మిస్తామని, నిత్యం వచ్చే భక్తులకు గుడి వద్ద వసతి సౌకర్యం కల్పిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, బత్తుల లకా్ష్మరెడ్డి, మందుల సామేలుతో కలసి దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు ఆలయాన్ని సందర్శించి స్వామి వారి పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కెసిఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిని విస్మరించారని, అందుకే 11 అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ డిపాజిట్‌లు కోల్పోయిందని, రెండు పార్లమెంట్ స్థానాల్లో ఉనికి కోల్పోయిందని ఎద్దేవా చేశారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో డబ్బులు పంచి జగదీశ్ రెడ్డి కొద్ది మెజార్టీతో ఎంఎల్‌ఎగా విజయం సాధించారని వ్యాఖ్యానించారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి హయాంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలు తవ్వారని అన్నారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగం పనులను పదేళ్ల కాలంలో గత ప్రభుత్వం విస్మరించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సొరంగం పనులు మళ్లీ ప్రారంభించామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రెండు లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయి నీరు వదిలే పరిస్థితి లేదన్నారు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఆ పార్టీ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఏనాడూ పెద్దగట్టు రాలేదని, ఇప్పుడు వచ్చి స్థిరపడ్డారని, పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసిసి సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, ఆలయ ఛైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News