నాటి తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిన జలదృశ్యంలో అమరుల స్మారక చిహ్నం ఏర్పాటు ద్వారా అమరుల త్యాగాలకు సిఎం కేసీఆర్ ఇస్తున్న నిజమైన నివాళి అని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ అమరవీరులకు జిహెచ్‌ఎంసి కౌన్సిల్ ఘనంగా నివాళ్లు అర్పించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురు వారం మేయర్ గద్వాల విజయలక్ష్మిఅధ్యక్షతన జిహెచ్‌ఎంసి ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు, జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. సందర్భంగా మేయర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఎందరో అమరవీరుల స్వప్నం, ప్రజల చిరకాల కోరిక అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్వప్నం నెరవేరడం కోసం 60 సంవత్సరాలుగాఈ నేల పై పుట్టిన బిడ్డలు అవిశ్రాంత పోరాటాలు చేశారన్నారు. మొదటి సారి భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం 1942 నుండి 1948 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్న, హరిజన ముత్తమ్మ, బండి యాదగిరి, షేక్ బందగి, సోయబ్ ఉల్లా ఖాన్‌లాంటి ఎందరో వీరులు ఈ నేల కోసం ప్రాణాలు అర్పించారన్నారు.
1956లో మరో సారి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో విలీనం కావడం, తెలంగాణ తల్లి విముక్తి కోసం మళ్లీ 1969లో మొదలైన ప్రత్యేక తెలంగాణ పోరాటం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, మేధావులు, ప్రముఖ రాజకీయ నాయకులు చేరికతో ఉద్యమం కొససాగందని తెలిపారు. తొలిదశ ఉద్యమంలో తొలి అమరుడు 17 సంవత్సరాల శంకర్ అనే విద్యార్థి ప్రాణం త్యాగంతో ఉద్యమం ఎగసిపడి 369 విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేసినా ప్రత్యేక రాష్ట్ర స్వప్నం నెరవేరలేదన్నారు. నాటి అమరవీరులకు ప్రతిరూపం గన్ ఫౌండ్రీలోగల స్మారక స్థూపం నిదర్శనం అని తెలిపారు.1956 నుండి 2001 సంవత్సరం వరకు ప్రజల ఆకాంక్ష పై సంస్కృతి, సంప్రదాయాలపై, నీళ్లు, నిధులు, నియామకాలలో జరుగుతున్న దోపిడీపై ఎందరో యువకుల త్యాగాలతో తెలంగాణ ఉద్యమం నింగికి ఎగిరినేలపై పడుతున్న ఫినిక్స్ పక్షిలా2009 నవంబర్ 29న నాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష తో మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపిరి పోసుకున్న విషయం తెలిసిందేనన్నారు.. ప్రజా ఉద్యమ త్యాగాల ఫలితంగా కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ కల సాకారమనిందని వెల్లడించారు.
ఇదేక్రమంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నూతనంగా నిర్మించిన సచివాలయానికి డా.బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకొని అమరవీరుల స్మారక చిహ్నం సాక్షిగా ప్రజల ఆకాంక్షలతో పాటు సంస్కృతి సంప్రదాయాలను పెంపొందిస్తూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలించిందని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర స్వప్నం కోసం ప్రాణాలర్పించిన మలిదశలో తొలి అమరుడు శ్రీకాంతాచారి అన్నారు. తెలంగాణ ప్రగతి కాంతులతో మీ త్యాగమే ప్రతిఫలిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, బిజెపి, ఎంఐఎం కార్పొరేటర్లు, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఈ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, జోనల్ కమిషనర్లు మమత, శ్రీనివాస్, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, సిసిపి దేవేందర్ రెడ్డి వివిధ విభాగాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.