ఎసిబి వలలో జిహెచ్‌ఎంసి డిఇ, ఫీల్డ్ అసిస్టెంట్
రూ.20వేలు లంచం తీసుకుంటూ పట్టబడ్డ వైనం
నిందితులకు 14 రోజుల రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కాప్రా జిహెచ్‌ఎంసి డిఇ మహాలక్ష్మీ, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ లు రూ.20 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లంచం కేసులో పట్టుబడిన నిందితులను ఎసిబి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే… ఇటీవల జిహెచ్‌ఎంసి సర్కిల్ 1 కాప్రా పరిధిలో పనిచేసే స్వీపర్ రాములు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో రాములు ఉద్యోగాన్ని అతని భార్య సాలమ్మకు ఇచ్చేందుకు డిఇ మహాలక్ష్మీ రూ.50వేల లంచం డిమాండ్ చేసింది. ఈక్రమంలో లంచం రూ.50వేల మొత్తాలు అదే సర్కిల్‌లో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌కు ఇవ్వాలని డిఇ మహాలక్ష్మి సూచించింది. దీంతో సాలమ్మ కుమారుడు శ్రీనివాస్ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ విజయ్‌కుమార్‌ను కలిసి రూ. 20వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. చట్ట ప్రకారం తన తండ్రి రాములు ఉద్యోగాన్ని తన తల్లికి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన డిఇ మహాలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ విజయ్‌కుమార్‌ల అవినీతి వ్యవహారాన్ని శ్రీనివాస్ ఎసిబి అధికారులను దృష్టికి తీసకెళ్లడంతో పాటు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్ దగ్గరలోని మల్లాపూర్ శివ పార్వతి హోటల్‌లో ఇడి మహాలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ విజయ్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఎసిబి అధికారులు డిఇ మహాలక్ష్మి కార్యాలయంతోపాటు నాగారం చక్రిపురి కాలనీలోని ఆమె నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. కాగా, డిఇ మహాలక్ష్మి నివాసంలో బంగారం, నగదు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయిన తర్వాత మహాలక్ష్మిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎసిబి డిఎస్‌పి సూర్యనారాయణ వెల్లడించారు.
కారణ్యనియామకంలో కక్కుర్తి:
స్వీపర్ రాములు మరణించిన తరువాత ఆయన భార్య సాలమ్మకు ఉద్యోగం ఇవ్వాల్సి ఉండగా ఇరవై వేలు లంచంగా ఇస్తేనే ఉద్యోగం ఇస్తామని, లేదంటే ఉద్యోగం రాకుండా చేస్తామని డిఇ మహాలక్ష్మి బెదిరించింది. ఉద్యోగం కావాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో సాలెమ్మ కొడుకు శ్రీనివాస్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడని ఎసిబి డిఎస్‌పి తెలిపారు. డిఇ మహాలక్ష్మి 20 వేల రూపాయలు లంచంగా తీసుకున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆమెతోపాటు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ విజయ్‌కుమార్ చేతి వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించి వెంటనే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. కాగా, లంచం తీసుకున్న ఇడి, ఫీల్డ్ అసిస్టెంట్‌లను మల్లాపూర్ వార్డు కార్యాలయంలో అధికారులు విచారించామన్నారు. కాప్రా మున్సిపాలిటీ కార్యాలయంతో పాటు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించినట్లు డిఎస్‌పి సూర్యనారాయణ తెలిపారు. లంచం కేసులో పట్టుబడిన డిఇ, ఫీల్డ్ అసిస్టెంట్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజర్చగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని ఎసిబి డిఎస్‌పి సూర్యనారాయణ పేర్కొన్నారు.
GHMC DE and Field Assistant in ACB Net