అధికారులకు మేయర్ ఆదేశాలు
హైదరాబాద్: నాలాల అభివృద్ది పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిఅధికారులను ఆదేశించారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం కింద చేప్పటిన పనులతో ఇప్పటికే వందలాది కాలనీలలో వరద ముంపు సమస్య తీరిందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.ఎల్‌బినగర్ జోన్‌లో కొనసాగుతున్న పలు నాలా పనులను మేయర్ బుధవారం పరిశీలించారు. ఇందులో భాగంగా సరూర్ నగర్ చెరువు నుండి వయా కోదండరామ్ నగర్ మీదుగా చైతన్యపురి కాలనీ వరకు రూ. 21.47 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను పరిశీలించారు. అదేవిధంగా సరూర్ నగర్ చెరువు వద్ద నూతనంగా చేపట్టిన తూముల అభివృద్ది పనులతో పాటు బండ్లగూడ చెరువు నుండి నాగోల్ వరకు చేపట్టిన పనులను మేయర్ పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… జిహెచ్‌ఎంసి పరిధిలో చేపట్టిన 36 పనులు వేగవంతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన పనులతో వందలాది కాలనీలకు ముంపు సమస్య తప్పిందన్నారు.
అత్యంత వరద ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఎల్ బి నగర్ లో చేపట్టిన పనులు త్వరలోపూర్తి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, వర్షాలు పడినా పనులకు అంతరాయం లేకుండా నిరంతరంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అంతేకాకుండా ప్రధాన నాలాల వద్ద వర్షం వరదల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకోకుండా మెస్ తో పాటు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు మేయర్ వెల్లడించారు. అంతేకాకుండా మొబైల్, మినీ మొబైల్ స్టాటిక్ టీమ్ లను ఏర్పాటు చేసి ప్రజలకు వరద ప్రభావం వలన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిహెచ్‌ఎంసిపరిధిలో మొత్తం 54.11 కిలోమీటర్ల దూరం గల 37 పనులు సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో చేపట్టారు .ఎల్‌బి నగర్ జోన్ పరిధిలో వరద ముంపు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వరద సమస్యనివారణకు14.49 కిలోమీటర్ల మేర రూ. 113.59 కోట్ల వ్యయంతో 10 పనులు చేపట్టామని, ఇందులో కొన్ని చివరి దశకు చేరుకోగా మరి కొన్ని పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు.