* ఫిబ్రవరి 11న 11 గంటలకు
* ప్రత్యేక సర్వసభ్య సమావేశం
* నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం
* 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జిహెచ్‌ఎంసి ) మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నికకు మూహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12.30గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్. పార్థసారధి జిహెచ్‌ఎంసి యాక్టు 1955, సెక్షన్లు 9,10, (యాక్టు II 1956) రూల్స్ 3 అనుగుణంగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 11వ తేదీ ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం మధ్యాహ్నాం 12.30 గంటలకు ముందుగా మేయర్ ఎన్నిక నిర్వహించి ఈ ప్రక్రియ పూరైన తర్వాత డిప్యూటీ మేయర్ ను ఎన్నికను జరపనున్నారు. రెండు ఎన్నికలు పరోక్ష పద్దతిలో నిర్వహించనున్నారు. ఎదైనా అనివార్య కారణంగా వల్ల 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడితే 12 వతేదీన నిర్వహించనున్నారు.
ఎన్నిక నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు…
ప్రత్యేక సర్వసభ్య సమావేశంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహణ, పర్యవేక్షణకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక అధికారులను నియమించనుంది. సమావేశం నిర్వహణకు గాను గ్రేటర్ పరిధిలోని 4 జిల్లాలు రానుండగా ఇందులో ఎదో ఒక జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అధికారిగా నియమించనున్నారు. అదేవిధంగా ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణకు సంబంధించి ఓ సీనియర్ ఐఎఎస్ అధికారిని నియమించనున్నారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం చేయించేందుకు గాను జిహెచ్‌ఎంసి కమిషనర్ ప్రిసైడింగ్ అధికారిగా ఉండనున్నారు
ఫిబ్రవరి 6న ప్రత్యేక సమావేశం నోటీసు జారీ…
ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహణ, మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఫిబ్రవరి 6వ తేదీన నూతనంగా ఎన్నికైన కార్పోరేటర్లందరికీ నోటీసులు పంపించనున్నారు. ఫిబ్రవరి 11 ఉదయం 11.00 గంటటలకు సర్వసభ్య సమావేశం, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మధాహ్నం 12.30 మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నిక ఉంటుందని జిహెచ్‌ఎంసి చట్టం 1955 సెక్షన్ (1), (1A), 5ల ప్రకారం ఈ నోటీసులు అందజేయనున్నారు.