వడ్డీలు కట్టలేక బల్దియా సతమతం
రోజుకు రూ.1.04 కోట్ల వడ్డీ
నెలకు రూ.31.32 కోట్లు చెల్లించాల్సిందే..
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగర అభివృద్ధికి బల్దియా భారీగా నిధులను ఖర్చు చేసింది. అయితే ఇందుకు సంబంధించి సొంత వనరులపై కాకుండా బ్యాంకు రుణాలపై పూర్తిగా ఆధారపడింది. దీంతో క్రమంగా జిహెచ్‌ఎంసి అప్పుల ఊబిలో కూరుకుపొయే పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు కావాల్సిన మేరకు మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత జిహెచ్‌ఎంసిదే. అయితే ఇదే క్రమంలో ఆదాయమార్గాలను కూడా అన్వేశించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడమే అప్పులు పెరిగేందుకు కారణమవుతోంది. ఇప్పటికే పీకలల్లోతు అప్పుల్లో ఉన్న బల్దియా అనవసర ఆర్భాటాలకుపోతు అప్పులను మరింత పెంచుకంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
నగరంలో రోడ్ల అభివృద్ధితో పాటు నగర సుందరీకరణ, రోజువారీగా రోడ్ల నిర్వహణ తదితర పనులకు సంబంధించి 202021 ఆర్థ్ధిక సంవత్సరం నాటికే రూ. 4595 కోట్ల అప్పు చేసింది. వీటికి వడ్డీ రూపంలో ఏడాదికి రూ.381.31 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అంటే ఆదాయం వచ్చినా రాకపోయినా రోజువారికి బల్దియా వివిధ బ్యాంకులకు సుమారు కోటి 4 లక్షల 40వేల చొప్పున రూ.31 కోటి 32 లక్షలు చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని ఈ ప్రతి నెల చివరి వారం బ్యాంకులకు జిహెచ్‌ఎంసి చెల్లిస్తు వస్తోంది. అంతేకాకుండా హడ్కోకు సంబంధించి వడ్డీతోపాటు ప్రతి మూ డు నెలలకోసారి వాయిదాలను సైతం చెల్లిస్తోంది. వడ్డీలతో పాటు రుణ వాయిదాలకు తోడు ఉద్యోగులు వేతనాలు, రిటైర్డు ఉద్యోగులు పెన్షన్లతో పాటు ఇతర నిర్వహణ ఖర్చులు సైతం రూ.120 కోట్లపైగా ఉంటోంది. దీంతో వడ్డీలు, నిర్వహణ ఖర్చులకే ప్రతినెల జిహెచ్‌ఎంసి రూ.150 కోట్లకు పై చిలుకు ఖర్చు చేస్తోంది.
వివిధ స్కీమ్‌లకు రూ 4,595 కోట్ల అప్పులు
నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి జిహెచ్‌ఎంసి ఇప్పటికే మొత్తం రూ.4,595 కోట్ల అప్పు చేసింది. ఇందులో స్టాటజిక్ రోడ్ డవలప్‌మెంట్ పోగ్రాం (ఎస్‌ఆర్‌డిపి) పనులకు సంబంధించి ఎస్‌బిఐ నుంచి రూ.2500 కోట్లను 8.65 శాతం వడ్డీ కింద రుణం తీసుకోగా ఇందులో ఇప్పటి వరకు ఎస్‌ఆర్‌డిపికి రూ.1691 కోట్లు, లింక్ రోడ్ల అభివృద్ధికి రూ.223 కోట్లు, చెరువుల అభివృద్ధికి రూ.88.47 కోట్లు ఖర్చు చేయగా ఇంకా రూ.497.53 కోట్లు మాత్రమే బ్యాంక్‌లో నిల్వ ఉన్నాయి.
అదేవిధంగా సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం (సిఆర్‌ఎంపి)కి గాను సంబంధించి ఎస్‌బిఐ వద్ద మరో రూ.1460 కోట్లకు 7.20 శాతం వడ్డీతో అప్పు చేసింది. అంతేకాకుండా బాండ్స్ ద్వారా రెండు దఫాలుగా రూ.495 కోట్లను బల్దియా సేకరించింది. వీటితో పాటు నగరంలో అసంపూర్తిగా మిగిలిపోయిన వాంబే గృహాల పూర్తి చేసేందుకు గాను హడ్కో నుంచి రూ.140 కోట్లు, ఇందులో 100 కోట్లు వడ్డీ 10.15 శాతం, మరో 40 కోట్లు 9.90 శాతం వడ్దీ కింద రుణాలను తీసుకున్నారు.
వివిధ బ్యాంకుల రుణాలకు చెల్లిస్తున్న వడ్డీలు
క్ర. సంఖ్య బ్యాంకు రుణం రూ.కోట్లలో వడ్డీ శాతం ప్రాజెక్టులు ఏడాదికి వడ్డీ
1. ఎస్‌బిఐ రూ. 2500కోట్లు 8.65 ఎస్‌ఆర్‌డిపి రూ.216.25కోట్లు
2. ఎస్‌బిఐ రూ.1460కోట్లు 7.20 సిఆర్‌ఎంపి రూ.105.12కోట్లు
3. బాండ్స్ రూ.200 కోట్లు 8.90 ఎస్‌ఆర్‌డిపి రూ.17.8 కోట్లు
4. బాండ్స్ రూ.190 కోట్లు 9.38 ఎస్‌ఆర్‌డిపి రూ.17.8కోట్లు
5. బాండ్స్ రూ.100కోట్లు 10.23 ఎస్‌ఆర్‌డిపి రూ.10.23కోట్లు
6. హడ్కో రూ.100 కోట్లు 10.15 వాంబే హౌసింగ్ రూ.10.15కోట్లు
7. హడ్కో రూ.40కోట్లు 9.90 వాంబే హౌసింగ్ రూ.3.96 కోట్లు
మొత్తం రుణాలు 4,595 కోట్లు మొత్తం వడ్డీలు రూ. 381.31 కోట్లు