చాంద్రాయణగుట్ట: లంచం తీసుకుంటూ బల్దియా ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్ అవినీతి నిరోధకశాఖ వలకు చిక్కాడు. వివరాలలోకి వెళితే… మూసారంబాగ్‌కు చెందిన క్రాంతి కుమార్ తండ్రి ఆషయ్య బల్దియా విశ్రాంత ఉద్యోగి. అతడు మరణించటంతో పెన్షన్ భార్య బాలమ్మకు వచ్చింది. ఆమె కొన్ని రోజుల క్రిందట చనిపోయింది. తల్లి అంత్యక్రియల కోసం బల్దియా ఇచ్చే 20 రూపాయల కోసం నెల రోజుల క్రిందట పాతబస్తీ చాంద్రాయణగుట్ట నర్కిపూల్‌బాగ్‌లోని జిహెచ్‌ఎంసి చార్మినార్ జోన్, ఫలక్‌నుమా సర్కిల్లో(10)ని సూపరింటెండెంట్ పూల్ సింగ్‌ను కలిశాడు. అందుకు వచ్చే మొత్తంలో సగం డబ్బులు ఇస్తేగాని మంజూరు సాధ్యం కాదన్నాడు. తాను అంత ఇచ్చుకోలేనని క్రాంతి చెప్పాడు. దీంతో బేరం ఐదు వేల రూపాయలకు కుదిరింది. ఆ నగదు కూడా తన వద్ద లేదనటంతో చెక్కు ఇచ్చిన తరువాత బ్యాంకులో జమ చేసి ఇమ్మన్నాడు. లంచం డబ్బుల కోసం పూల్ సింగ్, క్రాంతి కుమార్‌కు తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడు.
దీంతో బాధితుడు క్రాంతి కుమార్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సత్యనారాయణను కలిశాడు. వారి సూచనల మేరకు మంగళవారం నర్కిపూల్ బాగ్‌లోని జీహెచ్‌ఎంసి సర్కిలో పదిలోని అతని కార్యాలయంలో లంచం డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు సూపరింటెండెంట్ పూల్ సింగ్‌ను ఉన్న ఫళంగా పట్టుకున్నారు. రసాయన పరీక్షలలో అతడు లంచం తీసుకున్నట్లు స్పష్టమైయ్యింది. పూల్ సింగ్ రాజేంద్రనగర్ సర్కిల్ నుండి డిప్యుటేషన్‌పై సర్కిల్ పదిలో పని చేస్తున్నాడు. కేసు నమోదు చేసిన అవినీతి నిరోధకశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా చార్మినార్ జోనల్ కార్యాలయం చార్మినార్ సర్దార్‌మహల్ నుండి నర్కిపూల్ బాగ్‌లో నిర్మించిన కొత్త భవనంలోకి మారిన తరువాత తొలిసారిగా ఒక ఉద్యోగి అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటంతో కార్యాలయంలో చర్చణీయాంశంగా మారింది.
GHMC Superintendent in ACB Net