Tuesday, December 24, 2024

కమిషనర్‌పై బదిలీ వేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ లోటస్ పాండ్ ప్రాంతంలోని ఏపి మాజీ సిఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాసం వద్ద అనుమతులు లేకుండా వెలిసిన షెడ్లను గ్రేటర్ అధికారులు కూల్చివేతల నేపథ్యంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌పై బదిలీ వేటు పడింది. జీహెచ్‌ఎంసి కమిషనర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న అమ్రపాలి కాటా ఆదివారంఖైరతాబాద్ జోనల్ క మిషనర్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పరిపాలనా వ్యవహారాలలో భాగంగా జోనల్ కమిషనర్‌ను బదిలీ చేస్తున్నట్టుగా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు హేమంత్ రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే శనివారం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇంటివద్ద వేసిన షెడ్లను కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిం ది.

అధికార వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ కూల్చివేతల అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. దీని వెనుక ఓ మంత్రి హస్తం ఉందనేది జోరుగా ప్రచారం సాగుతోంది. జీహెచ్‌ఎంసిలోని సిసిపి, అదనపు సీసీపి, అదనపు కమిషనర్, కమిషనర్‌లలో ఎవరి దృష్టికి కూడా కూల్చివేతలు చేపట్టబోతున్నట్టు తెలియపరచకుండా చర్యలకు ఉపక్రమించడం వల్లనే జోనల్ కమిషనర్ హేమంత్‌ను బదిలీ చేసినట్టు అధికార వర్గాల్లో నానుతున్న అభిప్రాయం.

ఇంతకు ఏం జరిగిందంటే..
లోటస్ పాండ్ వద్ద ఉన్న రోడ్డు మార్గంలో ఏపి మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా షెడ్లు ఉన్నాయని ఖైరతాబాద్ మునిసిపల్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే గత శుక్రవారం ఆ షెడ్లకు సంబంధించిన యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు యజమానులు స్పందించలేదని మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో భాగంగా లోటస్ పాండ్ వద్ద మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందున్న షెడ్లను తొలగించారు. అయితే, జోనల్ సిటీ ప్లానర్ సెలవులో ఉన్నప్పటికీ కిందిస్థాయి ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం, పైస్థాయి ప్లానింగ్ అధికారులకు లేదా అదనపు కమిషనర్, కమిషనర్ నోటీసులోకి తీసుకురాకుండానే చర్యలు తీసుకున్నారనేది ఉన్నతస్థాయి అధికారుల్లోని టాక్. ఇది కాస్త రాజకీయ వర్గాల్లో, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేకెత్తించింది. దీంతో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవోరావును బదిలీ చేశారు.

కూల్చివేతల వెనుక మంత్రి?
ఏపి మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద షెడ్లు కూల్చివేతల వెనుక తెలంగాణకు చెందిన ఓ మంత్రి ప్రమేయం బలంగా ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. లోటస్ పాండ్ సమీపంలోనే ఉండే తెలంగాణ రాష్ట్ర మంత్రి నేరుగా జోనల్ కమిషనర్ హేమంత్‌కు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఆ మంత్రి వాహనాలు లోటస్ పాండ్ మార్గంలో భారీగా వెళ్తుంటాయని, ఆ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా షెడ్లు ఉన్నాయని ఆ మంత్రి నేరుగా జోనల్ కమిషనర్‌ను ఆదేశించినట్టు జోనల్ అధికారుల్లోని చర్చ. మంత్రి నేరుగా చెప్పడంతో అధికారులతో కూల్చివేతలు చేపట్టినట్టు అధికార వర్గాల్లోని అభిప్రాయం.

కూల్చివేస్తే బహుమతిగా బదిలీనా?
నియమ నిబంధనలకు విరుద్ద్ధంగా.. మునిసిపల్ అధికారుల నుంచి ఏలాంటి అనుమతులు లేకుండా రోడ్డును ఆనుకుని చేపట్టిన షెడ్లను తొలగించినందుకు అధికారికి బదిలీని బహుమతిగా ఇస్తారా..? ఆక్రమిత భూమిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటే.. అది కూడా ఫిర్యాదు మేరకు చర్యలు చేపడితే.. అధికారిని అటాచ్ చే స్తారా..? ఇదెక్కడి న్యాయమంటూ అధికార వర్గాల్లో హేమంత్ బదిలీపై పెదవి విరుపులు మొదలయ్యాయి. నియమాలను అమలు చేయాలని చెప్పేది అధికారులే& నియమ నిబంధనలు, అధికారుల ఉత్తర్వులు, ప్రభుత్వ ఆదేశాలను అమలుచేస్తే.. అధికారులపై వేటు వేయడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

చర్యలు తీసుకునే అధికారముంది
తెలంగాణ కొత్త మునిసిపల్ చట్టం2019 ప్రకారంగా& జోనల్ పరిధిలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో కొన్నింటిపై చర్యలు తీసుకునేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు, పనులు చేపట్టాలని అదేశించేందుకు జోనల్ కమిషనర్‌కు అధికారాలు ఉన్నాయనేది మునిసిపల్ సీనియర్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెలిసే నిర్మాణాలపై.. రోడ్డు ఆక్రమణల్లోని షెడ్లు, పలురకాల కట్టడాలు వంటి వాటిని కూల్చేసే అధికారాలు జోనల్ కమిషనర్ కు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి చిన్నచిన్న ఆక్రమణలను తొలగించే ముందు అదనపు కమిషనర్, కమిషనర్లకు అధికారాలు ఉంటాయని మునిసిపల్ అధికారులు వెల్లడిస్తున్నారు. కొత్త మునిసిపల్ చట్టం2019 ప్రకారం ఏలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టవచ్చు. అందుకు అయ్యే ఖర్చును కూడా నిర్మాణాదారుల నుంచి వసూలు చేయవచ్చని మునిసిపల్ చట్టం2019లో స్పష్టంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News