మన తెలంగాణ/చాంద్రాయణగుట్ట: కొవిడ్ టీకా తీసుకు న్న కొద్దిగంటల్లోనే జీహెచ్‌ఎంసి పారిశుధ్య కార్మికురాలు మృత్యువాత పడటం పాతబస్తీలో కలకలం రేపింది. కన్నతల్లి తమ కళ్ళ ముందే ప్రాణాలు విడవటం చూసి తల్లడిల్లిన కుటుంబ సభ్యుల రోధనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. వివరాలలోకి వెళితే… ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ దానయ్యనగర్‌కు చెందిన పి.పెంటమ్మ(50), ముత్తయ్యలు భార్యాభర్తలు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. భర్త ముత్తయ్య జీహెచ్‌ఎంసిలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తుండగా అతని భార్య పి.పెంటమ్మ గోషామహల్ ప్రాంతంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. కొవిడ్ నేపథ్యంలో మొదటి డోస్‌ను గత ఏప్రిల్ మాసంలో తీసుకుంది. ఆ సమయంలో కోవిషీల్డ్ టీకా వేసుకుంది. రెండవ డోస్ వేసుకోవాలంటూ ఈనెల 14వ తేదీన ఆమె ఫోన్‌కు మేసేజ్ వచ్చింది.
దీంతో వ్యాక్సిన్ కోసం గోషామహల్, గోడేకీ కబర్ ప్రాంతంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్ళి రెండవ డోస్ కోవిషీల్డ్‌ను తీసుకుంది. అరగంట పాటు అక్కడి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది. అనంతరం అక్కడి నుండి ఇంటికి వచ్చిన ఆమె అస్వస్థతకు గురైయ్యింది. కళ్లు తిరుగుతుండటంతో విశ్రాంతి తీసుకుంది. పెంటమ్మ ఎంతకు నిద్రలేవక పోవటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఆకుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కోవిడ్ టీకా తీసుకొన్ని కొద్ది గంటల్లోనే పెంటమ్మ మృతి చెందటంతో దానయ్యనగర్ బస్తీలో చర్చణీయాంశంగా మారింది.
GHMC worker dies after receiving covid vaccine 2nd dose