Monday, December 23, 2024

ఇప్పుడున్న ముస్లింలు ఒకప్పుడు హిందువులే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ నేత, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు చెందిన ఓ వీడియో ఇటీవల ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. భారతీయ ముస్లింలతో సహా భారత దేశంలో నివసిస్తున్న వారంతా హిందూ మతానికి చెందిన వారేనని ఆయన చెప్తున్నట్ల్లు ఆ వీడియోలో ఉంది. జమ్మూ, కశ్మీర్‌లోని దోడా జిల్లా చిరల్లా పట్టణంలో ఓ హయ్యర్ సెకండరీ స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆజాద్ ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలుకూడా పాల్గొన్నారు. ఈ నెల 9న జరిగిన ఓ కార్యక్రమంలో ఆజాద్ చేసిన ప్రసంగంలో భాగమైన ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

‘నేను ఈ విషయాన్ని పార్లమెంటులో కూడా చెప్పాను. అది మీకు చేరి ఉండకపోయి ఉండవచ్చు. సభలో చర్చ సందర్భంగా బిజెపి సభ్యుడొకరు ఎవరు బైటినుంచి వచ్చారు,ఎవరు ఈ గడ్డకు చెందిన వారనే విషయాన్ని నాకు చెప్పబోయారు. అప్పుడునేను బయటి వాళ్లు, లోపలి వాళ్లు అనే విషయంలో సమస్య లేదు. మనలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి వాళ్లే. ఇస్లాం మతం దాదాపు 1500 ఏళ్ల క్రితం మాత్రమే వెలుగులోకి వస్తే హిందూ మతం అంతకన్నా చాలా పురాతనమైనది. కొంతమంది ముస్లింలు బైటినుంచి వచ్చి మొగలుల సైన్యంలో పని చేసి ఉండవచ్చు. అప్పుడు జనం హిందూమతంనుంచి ఇస్లాంలోకి మారడం మొదలైంది’ అని ఆజాద్ అన్నారు.

‘కశ్మీర్‌లో ఒక ప్రముఖ దృష్టాంతాన్ని చూడవచ్చు. 600 ఏళ్లక్రితం కశ్మీర్‌లో ముస్లింలు ఎవరైనా ఉన్నారా? అందరూ కశ్మీరీ పండిట్లే ఉన్నారు. అందుకే నేను అందరూ హిందూధర్మంలోనే పుట్టారని అంటున్నాను. ఆగస్టు 9(ఆగస్టు క్రాంతిదిన్) ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకుని హిందువులు, ముస్లింలు, రాజ్‌పుట్‌లు, బ్రాహ్మణులు, దళితులు, కశ్మీరీలు, గుజ్జర్లు అందరూ కూడా ఈ గడ్డలో భాగమేనని, ప్రతి ఒక్కరూ దీన్ని మన ఇల్లుగా చేసుకోవడానికి కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. మనం ఈ గడ్డపై పుట్టాం. చనిపోయిన తర్వాత మళ్లీ మనం ఇక్కడికే తిరిగి వస్తాం’ అని గులాం నబీ ఆజాద్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో చర్చకు కారణమవుతోంది. సుదీర్ఘ అనుబంధం తర్వాత గత ఏడాది కాంగ్రెస్ పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రోగ్రెస్ పార్టీ పేరిట సొంత పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News