Wednesday, January 22, 2025

మళ్లీ కాంగ్రెస్‌లోకి గులాం నబీ ఆజాద్?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పార్టీని వీడి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ పేరిట సొంత పార్టీ ప్రారంభించిన జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందకు సంబంధించి రెండు పార్టీలమధ్య చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆజాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బిజెపిని ఎదుర్కోగలిగేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని, తాను కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం కాదని, పార్టీ వ్యవస్థలో ఉన్న లోపాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని ఆజాద్ వ్యాఖ్యానించడంతోఅధిష్ఠానంనుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భారత్ జోడో యాత్రకు రావలసిందిగా ఈ యాత్ర కన్వీనర్ దిగ్విజయ్ సింగ్ ఆయనకు ఆహ్వానం కూడ పంపించారు.

జి23 అసమ్మతి నేతల్లో ఉన్న బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ హుడా కూడా ఆజాద్‌ను నేరుగా కలిసి ఆహానించారు. ఆజాద్ శిబిరంనుంచి కూడా నేతలు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర త్వరలో జమ్మూ, కశ్మీర్‌లో ప్రవేశించనుంది. ఆ సమయంలో ఆజాద్ తన పార్టీ కేడర్‌తో కలిసి యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబికా సోనీ కూడా ఆజాద్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఆజాద్‌కు, పార్టీ అధినాయకత్వానికి మధ్య ఉన్న గ్యాప్‌ను తొలగించే బాధ్యతను ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది. యాత్రకు హాజరై ఆ తర్వాత రాహుల్‌తో మాట్లాడాలని ఆమె ఆజాద్‌కు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ఆఫర్‌పై ఆజాద్ ఇప్పటివరకు స్పందించలేదు.

నిజానికి కాంగ్రెస్ పార్టీని వీడేటప్పుడు ఆజాద్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌కు పరిపక్వత లేదని, ఆయన వ్యక్తిగత సహాయకులే పార్టీని నడిపిస్తున్నారని ఆరోపించారు. తనలాంటి సీనియర్ నాయకులను పక్కన బెట్టేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితికి రాహులే ముఖ్య కారణమని కూడా దుయ్యబట్టారు. 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌లో సేవలందించిన ఆజాద్ గత ఆగస్టులో పార్టీని వీడిన విషయం తెలిసిందే. కాగా ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు స్పందిస్తూ రాజకీయాల్లో ఏమయినా జరగవచ్చని అన్నారు. అయితే ఆజాద్ మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తే తాము నిజంగానే ఆశ్చర్యపోతామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News