సోనియాతో భేటీ తరువాత ఆజాద్
కలిసికట్టుగా ముందుకు సాగుతాం
నేతకు సూచనలు అందించాం
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌లో జి 23 అసమ్మతి బృంద నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. రెండు రోజుల పాటు ఆజాద్ నివాసంలో అసమ్మతివాదుల వరుస భేటీల తరువాత సోనియాతో ఈ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షురాలిని తాను కలిసినట్లు, ఈ భేటీ బాగా జరిగినట్లు ఆ తరువాత ఆజాద్ విలేకరులకు తెలిపారు. ఇది సత్ఫలితాల భేటీ అని వ్యాఖ్యానించారు. పార్టీలో అంతర్గతంగా నాయకత్వంపై అసంతృప్తి ఉందనే వాదనను ఆజాద్ కొట్టిపారేశారు. సోనియానే పార్టీ పగ్గాలు చేపట్టాలని, ఆమె నాయకత్వం కొనసాగాలని పార్టీలోని నేతలంతా ఏకగ్రీవంగా నిర్ణయించారని, ఇందులో ఎటువంటి తేడా అభిప్రాయభేదాలు లేవని ఆజాద్ తేల్చిచెప్పారు. అయితే తమ వైపు నుంచి ఆమెకు కొన్ని సూచనలు ప్రతిపాదనలు ఈ భేటీ దశలో అందించామని వివరించారు.
ఐదు రాష్ట్రాలలో పరాజయానికి సంబంధించి వర్కింగ్ కమిటీ అందరు నేతల అభిప్రాయాలను కోరిందని, వీటిని ఆమెకు తెలియచేశామని ఆజాద్ చెప్పారు. త్వరలో జరిగే మరికొన్ని అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గెలిపించేందుకు సంఘటితంగా వ్యవహరించి ముందుకు సాగాలని సంకల్పించినట్లు ఆజాద్ వివరించారు. ఈ దిశలోనే ఇప్పటి భేటీ జరిగిందన్నారు. నాయకత్వంపై ఎటువంటి ప్రశ్న తలెత్తలేదని స్పష్టం చేశారు. బుధవారం నుంచి ఆజాద్ ఇతర కొందరు నేతలతో తమ నివాసంలో సమావేశం అవుతూ వచ్చారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగాలని, కొత్త నాయకత్వం ఎంపికపై తొందరలోనే కీలక సమావేశం ఏర్పాటు జరగాలనే అంశాలతో జి 23 నేతల భేటీ జరిగింది. ఈ దశలోనే పార్టీలోని అసమ్మతినేతలందరితో మాట్లాడాలని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని రాహుల్ గాంధీ చేసిన సూచనల మేరకు సోనియా స్వయంగా ఇప్పుడు ఆజాద్‌ను కలిసినట్లు వెల్లడైంది. ఒక్కరోజు క్రితం రాహుల్ హర్యానా మాజీ సిఎం భూపీందర్ సింగ్ హూడాను కలిశారు.