జమ్మూ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నుంచి ప్రజలు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. దేశ ప్రధాని స్థాయికి ఎదిగినా ఆయన తన మూలాలు మర్చిపోలేదని, తననో చాయ్‌వాలాగా గర్వంగా చెప్పుకుంటారని అన్నారు. తనకు, మోడీకి రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నప్పటికి, వ్యక్తిగతంగా ఆయన ఉన్నతమమైన వ్యక్తి అని కొనియాడారు. ఇటీవల ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగియనున్న సందర్భంగా ప్రధాని మోడీ రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేస్తూ ఆజాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు. సొంత పార్టీ ప్రయోజనాలతో పాటు రాజ్యసభ, భారతదేశ ప్రయోజనాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. కరోనా సమయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆజాద్ తనను కోరారని, దాంతో వెంటనే అఖిలపక్ష భేటీ పెట్టానని గుర్తు చేశారు.