ప్రజలను విభజిస్తూ పాలిస్తున్నారు
కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ విమర్శ
కశ్మీర్ పరిణామాల బాధ్యత పాక్‌దే
జమ్మూ : ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శలు గుప్పించారు. తమ కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలూ వివిధ ప్రాతిపదికలతో ప్రజల మధ్య విభజన రేఖలను గీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లోయలో 1990 ప్రాంతంలో తలెత్తిన వలసలు, కశ్మీరీ పండిట్ల ఊచకోతకు ఉగ్రవాదం, దీనిని పెంచిపోషించిన పాకిస్థాన్ కారణం అని మండిపడ్డారు. ఈ శక్తులే అప్పటి పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కాంగ్రెస్‌లో కీలక అసమ్మతి నేతగా చలామణిలోకి వచ్చిన ఆజాద్ స్పష్టం చేశారు.
కశ్మీరీ పండిట్ల వలసను ఇతివృత్తంగా తీసుకుని ఇప్పుడు వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆయన స్పందించారు. కీలక అంశాలను తీసుకుని రాజకీయ పార్టీలు ప్రజలలో విభేదాలను సృష్టిస్తున్నాయని, మతం, కులం ఇతర అంశాలను తీసుకుని పార్టీలు వ్యవహరిస్తున్న తీరు ప్రమాదకరం అన్నారు. ఈ విషయంలో తన పార్టీ (కాంగ్రెస్) కూడా అతీతం కాదని తేల్చిచెప్పారు. కులం మతం ప్రస్తావన లేకుండా ఎవరికైతే ఎక్కడైతే న్యాయం దక్కాలో అక్కడ న్యాయం దక్కితీరాల్సిందే అన్నారు. అయితే రాజకీయ పార్టీల వైఖరితో కులం మతం ప్రాతిపదికన గందరగోళం చెలరేగుతోందని తెలిపారు. మహాత్మా గాంధీ రాజకీయాలకు అతీతం అయిన విశిష్ట లౌకికవాది, హిందూ నేత అని కితాబు ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి దీనిని భారత్‌పైకి ప్రేరేపించడంతో కశ్మీర్ లోయలో హిందువులు, కశ్మీరీ పండిట్లు, ముస్లింలు, దోగ్రాలకు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు.