న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌తోపాటు పలువురు నేతలు జమ్ము కశ్మీర్లో పార్టీ కీలక పదవులకు రాజీనామా చేశారని సమాచారం. పార్టీతీరుపై అసమ్మతితోనే ఆయన తిరుగుబాటు సంకేతాలు పంపారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొద్దిసేపటికే ఆయన పదవినుంచి వైదొలిగారు. జమ్ము కశ్మీర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి కూడా ఆజాద్ రాజీనామా చేశారని పార్టీవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌పార్టీ ఆలిండియా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడైన ఆజాద్ అధిష్ఠానానికి తమ అసమ్మతి తెలిపేందుకు అపాయింట్‌మెంట్ కోసం చూస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్నో కీలక పదవులును నిర్వహించిన ఆజాద్ జమ్ముకశ్మీర్ సిఎంగా, కేంద్ర మంత్రిగానూ సేవలందించారు.
రెండేళ్ల క్రితం పార్టీలో సంస్థాగత మార్పులు అవసరమని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖరాసిన నేతల్లో ఆజాద్ కూడా ఒకరు. ఆజాద్ సన్నిహితుడు గులాం అహ్మద్ మీర్‌ను జమ్ముకశ్మీర్ చీఫ్ పదవినుంచి కాంగ్రెస్ అధిష్ఠానం తొలగించింది. దీంతో గతనెలలో మీర్ పదవినుంచి వైదొలిగారు. మీర్ స్థానంలో వికార్ రసూల్ వాని నియమితులయ్యారు. దీనిపై ఆజాద్ కినుక వహించి తిరుగుబాటుకు తెరలేపారని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. కాగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రచార కమిటీతోపాటు, రాజకీయ వ్యవహారాల కమిటీ, సమన్వయ కమిటీ, మ్యానిఫెస్టో కమిటీ, క్రమశిక్షణ కమిటీ, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీలన్నీ తక్షణం అమల్లోకి రానున్నాయి.
Ghulam Nabi Azad Resign key post in Kashmir