Monday, December 23, 2024

సవరల ఆదిగురువు గిడుగు

- Advertisement -
- Advertisement -

ఆదిమ సవర గిరిజనుల భాషపై పరిశోధన చేస్తూ సవరలిపిని, నిఘంటువును రూపొందించి మరోపక్క తెలుగు వాడుక భాషోద్యమానికి విశేష కృషి చేసిన గిడుగు తెలుగువారి గుండెల్లో సుస్థిర ముద్ర వేశారు. తెలుగు భాషలో వ్యహహారిక భాషా వ్యాప్తికి నిరంతర కృషి సల్పిన గిడుగు గ్రాంధిక భాషావాదుల పాలిట ‘పిడుగు’ అని కీర్తించబడిన ఘనాపాటి మన గిడుగు వెంకట రామమూర్తి పంతులు. సవర జాతి గిరిజనులపై వారి సంక్షేమంపై చేసిన గిడుగు చేసిన అవిరళ కృషే తెలుగు వాడుక భాషా ప్రస్థానానికి నాంది. పూర్వ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో గిడుగు వెంకటమ్మ, వీర్రాజు దంపతులకు 1863, ఆగస్టు 29 న జన్మించారు. గిడుగు సహాధ్యాయి గురజాడతో కలిసి 1875లో విజయనగరం మహారాజా కళాశాలలో బిఎ పట్టా పుచ్చుకొని చరిత్ర అధ్యాపకులుగా పని చేస్తున్న సందర్భంలో పర్లాకిమిడి పట్టణానికి చుట్టూర ఉన్న కొండలపై నివసిస్తున్న సవర తెగ గిరిజనులపై తన దృష్టిపడింది.

నాగరికులతో పోల్చితే వారు నీతినిజాయితీ గల మానవీయులు. కడు దైన్యస్థితిలోనూ ప్రత్యేక జీవన సంస్కృతి విస్మరించని ఆదిమ ప్రపంచం సవరలది. గిడుగు సవరలపై దృష్టి పెట్టడం చాటున వారి వెనుకబాటు తనమే కాదు చారిత్రక నేపథ్యం దాగుంది. 2500 ఏళ్ళనాటి సింధూ నాగరికత వెల్లివిరియడానికి ముందే ప్రత్యేక నాగరిక సంస్కృతి వారిది. నాటి రామాయణం, మహా భారతం, వైదిక సూత్రాలలోనూ సవరల ప్రస్తావన ఉందనడానికి నిలువెత్తు సాక్ష్యం శ్రీరాముని ఉదాత్త సేవకురాలు అయిన శబరి కూడా సవరీయురాలే. సవరల అభివృద్ధి కాంక్షించిన గిడుగు వారిని తొలుత చదువుబాట పట్టించాలని సంకల్పించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని సవరల జనాభా గతంలో 1,22,979 మంది. కాగా అక్షరాస్యత 14.38 శాతం. ప్రపంచీకరణలో వీరి సాంస్కృతిక జీవనం చతికిలపడటంతో సవర తెగ ప్రమాదంలో చిక్కుకుంది. సవర భాషను గిడుగు నేర్చుకొని సవర భాషలోనే విద్యనేర్పడానికి ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పారు.

గిడుగు రచించిన సవర వాచకాలు, కథల పుస్తకాలు, పాటల పుస్తకాలు, తెలుగు – సవర, సవర – తెలుగు నిఘంటువులను 1911లో ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం ప్రచురించింది. ఆయన కృషికి పారితోషికం ఇవ్వజూపితే అందుకు గిడుగు ‘ఆ డబ్బుతో ఒక బడి నెలకొల్పండి. నేను పెట్టిన బడులకు నిధులివ్వండి చాలు!’ అని ప్రభుత్వాన్ని కోరారు. అందుకే శిక్షణా పాఠశాలలు ఏర్పడ్డాయి. సవర భాషలో రచనలు, సవర భాషా వ్యాకరణం రచించినందుకు ప్రభుత్వం 1913లో ‘రావూ సాహెబ్’ బిరుదునిచ్చింది. పాఠ్యపుస్తకాల్లో, సామాన్య ప్రజల్లోనూ వ్యావహారిక భాషను వ్యాప్తి చేయడంలో ఆయనకు సాటిలేరు. సవర భాషలో ‘ఏ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజెస్’ (1930) వ్యాకరణంను రచించారు.

సవర గిరిజనుల సంబంధ అంశాలను చేర్చిన ‘క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా’ ను రచించిన నృశాస్త్రవేత్త థరస్టన్ తో గిడుగు చర్చించారు. హవాయి విశ్వవిద్యాలయం (అమెరికా) పాశ్చాత్య భాషావేత్త స్టాన్లీ స్టరోస్టా తన పి.హెచ్.డి. గ్రంథాన్ని సవరలిపి పరిశోధకుడైన గిడుగుకు అంకితమివ్వడం విశేషం. తరాలు మారేకొద్దీ సంప్రదాయ భాష సంస్కృతులపై ప్రపంచీకరణ సంక్షోభం నిమ్నవర్గ సమాజాలపై పెనుప్రభావం చూపుతోంది. సంప్రదాయ చదువులు, స్వంత లిపి, సామాజిక అభివృద్ధి వంటివి సన్నగిల్లిన తరుణంలో… ఆదిమ భాషల క్షీణత శరవేగంగా పెరుగుతోంది.

ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి తీసుకుంటున్న ఆదిమ భాషల పరిరక్షణ చర్యల్లో భాగంగా గిరిజనులకు బీజాక్షరాలను ప్రసాదించిన సవరలిపి నిర్మాత గిడుగు మార్గదర్శకత్వంలోనైనా మాతృభాషల్ని, అంతరిస్తున్న ఆదిమ భాషలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆగస్ట్టు 29న గిడుగు జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’ గా జరుపుకుంటున్నాం. అలాగే సవర గిరిజనులు కూడా ఆ రోజును సవర భాషా దినోత్సవంగా గుర్తించి తమ భాషకు జీవం జీవం పోయాలని వారూ కోరుతున్నారు.

గుమ్మడి లక్ష్మీనారాయణ
9491318409

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News