Wednesday, January 22, 2025

గిగ్ ఎకానమీ.. పరాయీకరణకు పరాకాష్ఠ

- Advertisement -
- Advertisement -

అర్ధరాత్రి బోరున వర్షం కురుస్తున్నప్పుడు, వేడివేడి మిరపకాయ బజ్జీలు లేదా ఐస్‌క్రీమ్ తింటే ఎంత బాగుంటుందో కదా అనిపించిన వెంటనే అవి రెక్కలు కట్టుకుని మన వద్దకు వచ్చేయవచ్చు. కూర వండేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాక కరివేపాకు లేకపోతే మీరు పోపు వేసేలోగా అది మీ వంటింట్లో ప్రత్యక్షం కావచ్చు. ఇంతకు ముందు ఇలా అని ఎవరైనా అంటే ఏమి గొంతెమ్మ కోరికలు ఇవన్నీ అని ఎగతాళి చేసేవారు. కానీ అవి ఇప్పుడు తీరని కోరికలు ఎంతమాత్రం కాదు. మన కోరికలు అవి ఏవైనా సరే, మనం కోరుకున్నప్పుడు, డబ్బులు ఉండా లే కానీ క్షణాల్లో తీరగలవు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆ ఆర్థిక వ్యవస్థకు పునాది అయినటువంటి శ్రమ, శ్రామిక వర్గం ఇప్పుడు తన సాంప్రదాయక రూపాలను మార్చుకొని, కొత్త రూపంలోకి శరవేగంగా రూపాంతరం చెందుతూ వున్నాయి.

2000 సంవత్సరం తరువాత డిజిటల్ వ్యవస్థ పారిశ్రామిక, ఆర్థిక రంగాలతో పాటూ అనేక రంగాలలోకి ప్రవేశించడంతో అత్యంత వేగవంతంగా సమాచారం రంగం కూడా అభివృద్ధి చెందింది. ఇంటర్నెట్ ద్వారా అటు, ఇటు సమాచారాన్ని క్షణాలలో తెలుసుకునే, పంచుకునే పద్ధతి కూడా ఏర్పడింది. అలాగే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత డిజిటల్ టెక్నాలజీపై ఆధారపడ్డ అనేక ప్లాట్ ఫారమ్స్ కొత్త ఉద్యోగాలను సృష్టించాయి. సాంకేతిక పరిజ్ఞానపు పురోగతి మీద ఆధారపడి పని చేసే ఒక కొత్త కార్మికశక్తి మన సమాజంలో తయారైంది. మొదట ఇది సేవా రంగంలో అత్యంత వేగంగా ప్రవేశించింది. సేవలు అందించే సంస్థలు, ఆయా సేవలను ఆశించే కస్టమర్లకు తమ డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా సమాచారాన్ని అందిస్తూ, ఆ సేవలకుగాను డిజిటల్ చెల్లింపులను తీసుకుంటూ, అతి తక్కువ నిర్వహణా ఖర్చులతో ఒక కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టి, అందుకు తమకు అయ్యే వ్యయం పేరిట వసూళ్లు చేస్తూ ఇవి అపార లాభాలను ఆర్జిస్తున్నాయి.

గిగ్ ఎకానమీలో పెద్ద సంఖ్యలో కార్మికులు పార్ట్ టైం లేదా తాత్కాలిక కార్మికులుగా పని చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తం గా ఒక నిర్నీతమైన ఆఫీసులో గానీ, స్థలంలో కానీ ఉండి వీళ్ళు పని చేయాల్సిన అవసరం లేదు. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు క్రమంగా గిగ్ ఆర్థిక వ్యవస్థగా రూపొందడానికి కారణమయ్యాయి. శ్రామిక శక్తిలో గిగ్ ఉద్యోగులు ప్రాజెక్ట్ ఆధారిత కార్మికులుగా, స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, తమకు తాము పని చేసే వాళ్లుగా, తాత్కాలిక లేదా రోజులో కొద్ది సమయం పనిచేసే వాళ్లుగా ఉంటారు. క్యాబ్ డ్రైవర్లు ఆహారాన్ని, వస్తువులను డెలివరీ చేసే వాళ్ళు, రకరకాల సేవలను అందించే వాళ్ళు, ఆర్ట్ మీడియా, ఈవెంట్స్, విద్య ఇటువంటి వాటిల్లో తమకు వీలైన సమయంలో తాత్కాలికంగా పనిచేసేవాళ్లు ఈ క్యాటగిరీ కిందకే వస్తారు. ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్స్‌తో అపరిమితమైన డేటా సాంకేతికత, కమ్యూని కేషన్స్ వంటివి అందుబాటులోనే వచ్చాయి. ఇది ఒక రకపు కొత్త పని విధానం.

ఉన్నచోటే ఉంటూ కూడా ఆన్ లైన్ ద్వారా వేరు వేరు ప్రాంతాలకు సంబంధించిన పనిని గిగ్ కార్మికులు చేయగలుగుతారు. ఈ తరహా గిగ్ కార్మికులు మన దేశంలో 2020-21 నాటికి 77 లక్షల వరకూ ఉన్నారు. కోవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయిన అనేక మంది కార్మికులు గిగ్ కార్మికులుగా మారారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని వీళ్ళని అప్పుడు గొప్పగా పిలిచినా, అతి తక్కువ కూలీ చెల్లించి ఎంతో క్లిష్టపరిస్థితి మధ్య కూడా వాళ్ళ సేవలను సమాజం అందుకుంది. ‘ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ ఎకానమీ అనే పేరుతో వివరంగా రూపొందిన నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2020- 21 లో రిటైల్ ట్రేడ్ విక్రయాల విభాగంలో 26.6 లక్షల మంది, రవాణా రంగంలో 13 లక్షల మంది, తయారీ రంగంలో 6.2 లక్షల మంది, వస్తువుల తయారీ రంగం, ఆర్థిక సేవలు, బీమా రంగాలలో 6.3 లక్షల మంది గిగ్ కార్మికులు ఉన్నారు. విద్యారంగం లో లక్షకు పైగా, ఇతర సేవా రంగాలలో కూడా పెద్ద సంఖ్యలో ఈ గిగ్ కార్మికులు ఉన్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోటి మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని, 2030 నాటికి వీరి సంఖ్య 2.4 కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితాబ్రా తెలిపారు. ఈ కార్మికులను ప్లాట్ ఫామ్ (ఆన్‌లైన్ యాప్‌లలో, డిజిటల్ ప్లాట్ ఫామ్‌లపై పని చేసేవాళ్ళు), నాన్ ప్ల్లాట్ ఫామ్ ( శాశ్విత లేదా తాత్కాలిక ప్రాతిపదికన సాంప్రదాయ రంగాల్లో పని చేసే కార్మికులు) అని రెండు విభాగాలుగా వర్గీకరించారు. ప్రపంచంలోనే ఇప్పుడు యువతరం ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం. మూడు వంతుల జనాభా 15 నుండి 24 ఏళ్ల వయసులో వున్నది. ఇది ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర నిర్వహించగలిగిన శ్రామికశక్తిగా రూపొందింది. డిజిటల్ ఎకానమీలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఒక రకంగా, భవిష్యత్తులో ఈ యువశక్తి ఎలాంటి హక్కులు, ఉద్యోగ, ఆర్థిక భద్రత లేని వెట్టి, అర్ధ బానిస కార్మికులుగా తయారై డిజిటల్, గిగ్ ఎకానమీకి ఉపయోగపడనున్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారత దేశంలో మహిళా గిగ్ వర్కర్లు 28 శాతం మంది ఉన్నారు. వీరు ఎక్కువలో ఎక్కువగా గృహ సేవలు, బ్యూటీషియన్స్‌గా ఉన్నారు. ఈ హోమ్ సర్వీస్ ప్రొవైడర్స్‌ను గిగ్ ఎకానమీలో దినసరి, క్యాజువల్ లేబర్ గానే కాక, ‘పింక్ కాలర్ వర్కర్స్’గా కూడా పిలుస్తున్నారు. గిగ్ స్టైల్ ఆఫ్ వర్క్ అనేది భారతదేశంలో ఇటీవల భావనే. అయితే, ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వర్క్ ఫోర్సులో భాగంగా గుర్తించబడుతున్నారు. అనేక లక్షల మంది కార్మికుల్ని అనుసంధానం చేస్తూ పనిచేస్తున్న అనేక పెద్దపెద్ద వేదికలు ప్రపంచం అంతా ఉన్నాయి.

ఉబర్, జొమాటో, స్విగ్గి, ఓలా, డన్జో, అర్బన్ కంపెనీ, ఫ్లిప్‌కార్ట్, ఎయిర్ బాన్, ఫ్రీ లాన్సర్, ఇలా పెద్ద పెద్ద ప్లాట్ ఫామ్స్ దేశ విదేశాల్లో పని చేస్తున్నాయి. 2024 నాటికే భారతదేశ గిగ్ ఎకానమీ 455 బిలియన్ డాలర్లకు చేరుకోనిందని అసోసియేట్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.ఎస్.ఒ. సి.హెచ్.ఎ. ఎమ్.) అంచనా వేసింది. ఇప్పుడు ఇలాంటి ప్లాట్ ఫామ్‌లు అపారమైన లాభాలను ఆర్జిస్తూ ఇతర రంగాలలోకి, భవన నిర్మాణ, వైద్య, విద్య రంగాలతో పెట్టుబడులు పెడుతూ శరవేగంగా విస్తరిస్తూ వున్నాయి. మార్కెట్ మాయాజాలంలో నిజంగా ఇదంతా ఒక విప్లవాత్మకమైన మార్పే. పెట్టుబడి తన రూపాన్ని మార్చుకుంటూ వుంది. గిగ్ ఎకానమీలో గతంలో లాగా ప్రత్యక్షంగా కంటికి కనిపించే పెట్టుబడిదారుడో, ఒక యజమానో మనకి కనపడడు.

ఈ వ్యాపారాలు నిర్వహించేవి కంపెనీలు, ఫ్యాక్టరీలుగా తమని తాము చెప్పుకోవడం లేదు. వాళ్ళని వాళ్ళు ప్లాట్ ఫామ్స్‌గా, ప్రొవైడర్స్‌గా చెప్పుకుంటున్నారు. అంతేకాదు, అది కార్మికుడి రూపాన్ని, పని స్వాభావాన్ని కూడా మార్చివేసింది. కార్మికుడు అనే పదాన్నే వాళ్ళు తొలగించి వేశారు. ఇప్పుడా కార్మికుడిని పార్టనర్, కెప్టెన్ వంటి పేర్లతో పిలుస్తున్నారు. కార్మికుడిని స్వతంత్ర యజమాని అంటూ కస్టమర్లకి గిగ్ కార్మికుడికి మధ్య తమ పని అనుసంధాన మాత్రమే అని అంటూ ఆ పని చేసినందుకు మాత్రమే తమకు చెల్లింపులు వస్తాయని, గిగ్ కార్మికుడికి తాము ఎంత మాత్రమూ పూచిదారులము కామని ఇవి వాదిస్తున్నాయి.

హక్కులు, జీతాలు, పని గంటలు వంటి తమని అడిగేందుకు ఈ కార్మికులకు ఎలాంటి హక్కు లేదని, వాళ్లు ఏమున్నా కస్టమర్లతోనే వీటిని తేల్చుకోవాలని గిగ్ ఎకానమీ జంకూగొంకు లేకుండా తెగేసి చెబుతూ వుంది. గిగ్ ఎకానమీలో కార్మికులకు ఏమవుతుంది? వాళ్లు ఒక రకంగా బానిస కార్మికులే. ఇప్పుడు వాళ్ళు ఒక యజమానికి కట్టివేయబడి లేనప్పటికీ పని గంటల నిబంధన లేనప్పటికీ వాళ్లకి ఎలాంటి హక్కులు, భద్రత లేవు. కార్మికులకు నెల జీతం లేదు. ఉద్యోగ భద్రత లేదు. సెలవులు లేవు. పదవీ విరమణ ప్రయోజనాలు అసలే లేవు. స్థిరమైనటువంటి ఆదాయం, కనీస వేతనాలు లేవు. కార్మికులు వందల సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులు అన్నీ ఈ గిగ్ ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా మటుమాయం అయిపోయాయి. ఇప్పటి దాకా యజమాని, కార్మికుడు అని ఉన్న నిర్వచనాలను గిగ్ ఎకానమీ విధానం పక్కకు నెట్టివేసి, ఒక మధ్యంతర వ్యవస్థని గిగ్ ప్లాట్ ఫాం పేరుతో ముందుకు తీసుకు వచ్చింది.

ఈ బరితెగింపును నియంత్రించే చట్టాలు లేవు. ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్లు ఉన్నాయి. ఇంత కాలంగా నిర్మితమైన కార్మిక అనుకూల వ్యవస్థలను అన్నింటినీ, ఇప్పుడు కుప్పకూల్చారు. 24 గంటల సర్వీస్‌లో ఉండే ఒక కొత్త గిగ్ కార్మిక వ్యవస్థని సృష్టించారు. అర్ధరాత్రి రెండు గంటలకి, 3 గంటలకి, వర్షంలో ఐస్‌క్రీమ్ తినాలని ఎవరికైనా అనిపిస్తే ఈ డెలివరీ బాయ్‌లు నిద్రగాచి మరి వాటిని తీసుకువెళ్లి కస్టమర్లకి అందిస్తారు.

మనం ఐస్‌క్రీమ్‌ని తిని ఆనందించవచ్చు కానీ, ఆ వర్షం కురుస్తున్న వేళ దాన్ని మనకు మోసుకొచ్చిన వ్యక్తి కష్టం ఏమిటో, అతను ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఎవరో మనకి ఎన్నడూ పట్టదు. వాళ్ళకీ, మనకీ మధ్య ఒక్క మాటన్నా లేకుండా సరుకు, సేవలు ఇవ్వడం, పుచ్చుకోవడం అనే సంబంధం తప్ప. మరేం మిగల లేదు. వాళ్లు మన దృష్టిలో, సమాజం దృష్టిలో వాళ్లంతా ఇన్విజబుల్స్. మనం కోరిన సామాన్లని తీసుకువచ్చే రోబోట్స్ లాంటివాళ్ళు, వాళ్ళుఅంతే. ఒకచోట నుంచి ఒక చోటికి సామాన్లు పోతున్నప్పుడు ఉండే కేవలం కన్వేర్ బెల్ట్ లాంటి వాళ్ళు. గిగ్ కార్మికులు మనుషులు కాదు మన లాంటి కస్టమర్లకు. మన అసంతృప్తి, ఫిర్యాదుతో నిమిషంలో అతడు ఉద్యోగం కోల్పోగలడు.

పరాయీకరణ పరాకాష్ఠ ఈ గిగ్ ఎకానమీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న ఈ మార్పుల వేగాన్ని, పెట్టుబడి కొత్త వేషంలో అత్యంత దుర్మార్గంగా లాభాల వేట సాగించడాన్ని అర్థం చేసుకుంటూ, ఈ మొత్తం క్రమాన్ని, దాని మూలాలను పట్టుకోవడంలో, అందుకు తగినటువంటి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయడంలో నిజానికి కార్మిక సంఘాలు వెనుకబడే వున్నాయి. గతంలో జరిగినట్లుగానే గిగ్ పెట్టుబడి కూడా, తనను తాను ధ్వంసం చేసుకునే మూలాలను తనలోనే సృష్టి చేసుకుంటుంది. 150 ఏళ్ల క్రితం నాటి చికాగో కార్మికుల వద్దకు ఇప్పటి గిగ్ కార్మికులు పోకతప్పదు.

విమల

బహుముఖం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News