Saturday, December 21, 2024

ఆర్థిక వ్యవస్థకు దొంగ దెబ్బ గిగ్ వర్క్

- Advertisement -
- Advertisement -

గత రెండు దశాబ్దాలలో పని, ఉపాధి తన రూపాన్ని పెద్దయెత్తున మార్చుకొంది. ఈ మార్పు ఆర్థిక, రాజకీయ, సాంకేతిక అంశాలు పరస్పరం బలోపేతం చేసుకోవడంపైన ఆధారపడింది. పనికి సంబంధించిన సాంప్రదాయ రూపాలు ఉనికిలో లేవని కాదు. ప్రస్తుతంలో సంఖ్యాపరంగా చూస్తే అవే ఎక్కువగా ఉంటాయి. కానీ, వాటితో పాటు, కొత్త రకాల పని, ముఖ్యంగా గిగ్ వర్క్ – పట్టణ ప్రాంతాల్లో ముఖ్యమైన ఉపాధి వనరుగా ఉంది.ఈ గిగ్ వర్క్ రోజురోజుకి చాలా వేగంగా పెరుగుతోంది.ఒక పనిని లేదా ప్రదర్శనను వివరించడానికి వినోదకారులు, సంగీతకారులు ‘గిగ్’ అనే పదాన్ని తమదైన యాసలో ఉపయోగిస్తారు. గిగ్ వర్కర్ అంటే తాత్కాలిక ఉద్యోగాలు చేసే వ్యక్తి అని నిఘంటువులు పేర్కొంటున్నాయి. వాస్తవికత ఈ అర్థానికి దూరం గా ఉంది. నిఘంటువులు ఇస్తున్న అర్ధాల్లో, నిర్వచనాల్లో గిగ్ వర్క్ ఇమడనంటోంది. చాలా మంది దిగువ స్థాయి కార్మికుల అనుభవాల్లో గిగ్‌వర్క్ భిన్నరూపాన్ని సంతరించుకొంటోంది. ఒక రోజు లో నాలుగు రకాల గిగ్ వర్కు చేస్తే కానీ ఒక మనిషి తన కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్పత్తులు విశ్వవ్యాప్తంగా చౌకగా అందుబాటులోకి రావడం, ఈ ఐటి ఉత్పత్తులను టెలికమ్యూనికేషన్స్ రంగం ఉపయోగించడంతో, వేగవంతమైన డిజిటలైజేషన్‌కు మార్గం సుగమమైంది. 1990వ దశకంలో సమాచారాన్ని ప్రాసెసింగ్ చేసే పనిలో -విశ్వవ్యాప్తంగా కార్మిక విభజన మొదలైంది. 2000 దశకంలో టెలిమీడియేటెడ్ డిజిటల్ కమ్యూనికేషన్‌లు ‘సాధారణం’గా మారాయి. ఇది ఫోన్‌ల ద్వారా అనేక రకాల సేవలను పొందేందుకు వెసులుబాటును సృష్టించింది. ప్రముఖ కార్పొరేషన్ కంపెనీలు, అలాగే కొత్త స్టార్టప్‌లు డిజిటల్ ప్లాట్ ఫారమ్‌లను సృష్టించడం ప్రారంభించాయి. ఇవి రకరకాల సేవలు అవసరమైన వారికి, వాటిని అందించే వారికి మధ్య మధ్యవర్తులుగా తమను తాము ఏర్పాటు చేసుకుంటున్నాయి.మరో మాటలో చెప్పాలంటే, ఈ డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్‌లు తమను తాము వివిధ సేవల కోసం – డిమాండ్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా సరఫరా చేయడానికి మ్యాచ్‌మేకర్‌లుగా వ్యవహరించగలిగేలా తీర్చిదిద్దుకొన్నాయి.ఇ -కామర్స్, టెక్నాలజీ, ఫుడ్&బెవరేజెస్, హోం సర్వీసెస్ వంటి రంగాల్లోని సేవల సరఫరాదారులను గిగ్ వర్కర్లు అంటారు.

కంప్యూటర్ ప్రోగ్రామును రాసే కోడర్లు, గ్రాఫిక్ డిజైనర్లు మొదలుకొని రకరకాల సరుకులు, ఆహారం మనకు ఇళ్లకు తెచ్చి అందించే డెలివరీ సిబ్బంది వరకు వీళ్లంతా చేసే విభిన్న రకాల పనులన్నింటిని గిగ్ వర్క్ అనే అంటారు. గిగ్ వర్క్ పనిని బట్టి పని పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. డిజైనర్లు, కోడర్లు, ఎడిటర్లు వంటి నైపుణ్యం కలిగిన కార్మికులు బహుశా క్యాబ్ డ్రైవర్లు, రైడర్‌ల కంటే ఎక్కువ స్థాయిలో స్వయంప్రతిపత్తిని, బేరసారాల శక్తిని కలిగి ఉండవచ్చు.

గిగ్ వర్క్ అనేది ‘ఉపాధి’ ప్రధాన రూపం కానప్పటికీ, ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అమెరికాలో 2005 -15 సంవత్సరాల మధ్యకాలంలో ‘ప్రామాణిక ఉపాధికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన పనుల్లో’ నిమగ్నమైన కార్మికుల శాతం మొత్తం శ్రామిక శక్తిలో 10.7 శాతం నుండి 15.8 శాతానికి పెరిగింది. బ్రిటన్‌లో మొత్తం శ్రామికశక్తిలో దాదాపు 4 శాతం మంది గిగ్ పనిలో నిమగ్నమై ఉన్నారని అంచనా. ఉబర్, డెలివరో వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఇంగ్లాండులోని 75 కంటే ఎక్కువ నగరాల్లో సేవలందిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 500 కంటే ఎక్కువ నగరాల్లో పని చేస్తున్నాయి. గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, లాభాపేక్షలేని సంస్థ మైఖేల్ &సుసాన్ డెల్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రచురించిన ఇటీవలి నివేదిక ప్రకారం గిగ్ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యం – 5 నుంచి 12 శాతం మధ్య -ఎక్కువగా ఉంది.

అభివృద్ధి చెందిన దేశాల భాగస్వామ్యం 1 నుంచి 4 శాతం మధ్య మాత్రమే ఉంది. ఈ ఉద్యోగాలలో చాలా వరకు డెలివరీలు, రైడ్‌షేరింగ్, మైక్రోటాస్క్‌లు, కేర్, వెల్నెస్ వంటి అల్పాదాయాన్నిచ్చే ఉపాధులుగా ఉన్నాయి. భారతదేశంలో గిగ్ ఆర్ధికవ్యవస్థ రాబోయే మూడు – నాలుగు సంవత్సరాల్లో మూడు రెట్లు పెరుగుతుందని; వచ్చే 8- 10 సంవత్సరాలలో వ్యవసాయేతర రంగంలోనే ఇలాంటి తొమ్మిది కోట్ల ఉద్యోగాలు నెలకొనే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. అస్సోచామ్ నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే వెసులుబాటుతో సిబ్బందిని పెట్టుకోగలిగిన అంటే యాజమాన్యాలు తమ కు అవసరమైనప్పుడు పనిలోకి తీసుకొని అక్కరలేనప్పుడు ఇంటికి పంపించే విధంగా సిబ్బందిని నియమించుకోగలిగిన అతిపెద్ద దేశాలలో ఒకటిగా ఉద్భవించింది.

గిగ్- డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఆర్థిక వ్యవస్థ ఎలా పని చేస్తుంది? సాధారణంగా, జొమాటో, ఉబర్ వంటి కార్పొరేషన్‌లు తమ సేవలు వినియోగించుకొనే కస్టమర్లు, వారికి సేవలు అందించే సర్వీస్ ప్రొవైడర్లు – ఉభయులూ లాగిన్ అయ్యే విధంగా వారిని అనుసంధానం చేసే డిజిటల్ ఇంటర్‌ఫేస్‌ను సృష్టిస్తాయి.ఈ సంస్థలు తమను తాము అనుసంధాన కర్తలుగా లేదా బ్రోకర్లుగా పరిచయం చేసుకొంటాయి. జొమాటోనే ఉదాహరణగా తీసుకొంటే, ఈ అనుసంధాన ప్రక్రియకు రెస్టారెంట్లు ఒక వైపున కస్టమర్లు మరో వైపున ఉంటారు. రెస్టారెంట్ నుండి కస్టమర్‌కు ఆహారం పొట్లాన్ని అందిం చే పద్ధతిని సులభతరం చేయడానికి ‘రైడర్లు’ యత్నిస్తున్నారు.

ఇటీవలి వరకు జొమాటో లావాదేవీలన్నీ నష్టాలనే చవిచూశాయి. కానీ అది కంపెనీకి పెద్ద ఆందోళన కలిగించలేదు. ఎందుకంటే వినియోగదారుల మనసును గెలుచుకోవడం ద్వారా మార్కెట్లో గుత్తాధిపత్యం సాధించడమే సంస్థ ప్రాథమిక లక్ష్యం. మార్కెట్లో తన ‘పాదముద్రలు’ మరింత ఎక్కువగా కనిపించాలని కంపెనీ కోరుకుంటోంది.అందుకోసం కిరాణా సరుకుల డెలివరీ, మందుల షాపుల నుంచి మందుల డెలివరీని చేయడానికి కూడా తన సేవలను విస్తరిస్తోంది. కంపెనీ ప్రధానంగా ఉద్యోగుల జీతాలు తనదైన బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకోవడం మీదనే పెట్టుబడులు, ఖర్చులు పెట్టాలి.

రైడర్లను ఉద్యోగులుగా పరిగణించరు.వారికి కిలోమీటరుకు ఇంత అని నామమాత్రంగా కొంత సొమ్మును చెల్లిస్తారు. అయితే కొన్ని ప్రోత్సాహకాలను ఇస్తారు. ఇవి వారు డెలివరీ చేసిన ఆర్డర్‌ల సంఖ్యను బట్టి లేదా వారి ఆదాయాన్ని బట్టి ఉంటాయి. రైడర్ల కొరత కారణంగా డెలివరీ సాధ్యం కాని పరిస్థితిని కంపెనీ కోరుకోదు. అందువల్ల, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ‘కస్టమర్లు ఎక్కువగా ఉన్న చోట ‘ఫ్రీలాన్స్ భాగస్వాములుగా’ చేరవలసిందిగా రైడర్లను ప్రోత్సహిస్తారు. డెలివరీ ఛార్జీలను తగ్గించడానికి, ఎక్కువ మంది కస్టమర్లను పొందేందుకు, ప్రత్యేకంగా తక్కువ దూరాల్లో వినియోగదారులను చేరడానికి సైకిళ్లతో ప్రయాణించే వారిని ప్రోత్సహిస్తారు. ఒక యాప్ ద్వారా ఒక కస్టమర్ రూ.500 ఆహారాన్ని ఆర్డర్ చేస్తే, కంపెనీ రెస్టారెంట్ నుండి కమిషనుగా 30-35 శాతం వసూలు చేస్తుందనుకొందాం. అంటే 30 శాతం వద్ద రూ. 150 కమిషను వస్తుంది. అయితే కంపెనీ రైడర్‌కు ఒక్కో ఆర్డరుపైన దాదాపు 25-30 శాతం అంటే రూ. 500 ఆర్డర్‌పైన 125-150 రూపాయలు చెల్లిస్తుంది.

గిగ్ వర్కులో పని గంటలు చాల సౌకర్యంగా అదే పెద్ద ప్రయోజనంగా పేర్కొంటారు. పని చేసే వ్యక్తి తానే స్వయంగా ఎన్ని గంటలు పని చేయాలి, ఎంత సంపాదించాలి అనేది స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చని చెబుతారు. కార్మికులు స్వేచ్ఛగా ఉన్నారనే భావనను ఈ ప్లాట్‌ఫారాలు ప్రచారం చేస్తాయి. వారిని ‘ఫ్రీలాన్సర్‌లు’ లేదా ‘భాగస్వాములు’ అని పిలుస్తారు. ఈ భాష కూడా కార్మికులను కంపెనీలతో సమానంగా ఉంచుతుంది. వారిని స్వయం ఉపాధి పొందే, స్వతంత్ర భాగస్వాములు ‘వ్యాపారవేత్తల’ లాగా వర్ణిస్తుంది. అనుబంధ ఆదాయ వనరుగా గిగ్ వర్క్‌ను తీసుకునే వారు కొంత సౌలభ్యాన్ని ఆస్వాదించవచ్చు, కానీ జీవనోపాధికి ప్రధాన వనరుగా దీనిని ఎంచుకొనేవారి విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. రోజువారీ పని 11-12 గంటలు ఒక ప్రమాణంగా ఉంటుంది. ఇంత ఎక్కువ గంటలు పనిచేసినప్పటికీ మన మహానగరాల్లో చాలా మంది తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు.

పట్టణాల్లో జీవన వ్యయం పెరిగిపోయి ఖర్చులను భరించలేకపోతున్నారు. ఇంట్లో వండుకొని తినడం మానేసి, పక్కనున్న హోటల్‌కి నడుచుకొంటూ వెళ్లి హాయిగా తిని రావడానికి కూడా బద్దకించి ఆన్‌లైనులో ఆర్డరుచేసి భోజనం తెప్పించుకొంటున్నాము. ఈ ప్రక్రియలో మన యువతను రోడ్డు పాలు చేస్తున్నాం. ఎంత చదువుకొంటే మాత్రం ఏమిటి ప్రయోజనం మోటర్ సైకిలెక్కి అన్నం పొట్లాలు అందించడమేగా పని. లేదంటే ఉబర్ డ్రైవర్ గా పని చేయాలి. అంటే నాలుగు చక్రాల బండి మీద అదే రోడ్డుమీద పరుగులు తీయాలి.మన తాతలు, ముత్తాతలు వ్యవసాయదార్లమని, వివిధ రకాల వృత్తి పనులు చేస్తున్నామని గొప్పగా చెప్పుకొనేవారు. దేశానికి అన్నం పెడుతున్నామని గర్వపడేవారు.ఆ తరువాత మన తండ్రుల తరం అంతోఇంతో చదువుకొని పంతుళ్ళుగా, డాక్టర్లగా, లాయర్లగా, ఇంజనీర్లుగా ఇంకా అనేక వృత్తుల్లో, వివిధ కంపెనీల్లో ఉత్పాదకరంగ కార్మికులుగా పని చేశారు. తమ కుటుంబాలను పోషించుకోవడంతోపాటు దేశానికి కూడా తమ పని ద్వారా సేవ చేశామని తృప్తిని పొందారు. మన తరం సంపదను కూడేసింది.

పిల్లలను బాగానే చదివించింది. కానీ ఏమిటి లాభం. వాళ్ళ చదువులు మోటర్ సైకిళ్ల మీద, కార్ల మీద తిరుగుతూ కస్టమర్లు ఇచ్చే టిప్పులు లెక్కపెట్టుకోవాల్సిన స్థితిలో పడ్డారు. ఎన్నో ఉద్యమాలు చేసి సంపాదించుకొన్న ఎనిమిది గంటల పని దినం పోయి స్వేచ్ఛ పేరుతో 12 గంటల పనికి అంకితమవుతున్నారు. మన యువత అన్ని రకాల సామాజిక సంబంధాలకు దూరంగా జరుగుతూ, ఒంటరి తనాన్ని అలవర్చుకొంటూ కొత్త రకం బానిస జీవితం వైపు అడుగులు వేస్తోంది. ఇదంతా విశ్లేషించుకొని చూస్తే గిగ్ ఆర్ధిక వ్యవస్థ మనల్ని ముందుకు నడిపిస్తోందా -వెనక్కి నడిపిస్తోందా ఆలోచించాలి.గిగ్ వర్క్‌తో నైపుణ్యాలు మాయమయ్యే స్థితి నెలకొంటుంది. ఎవరూ తాము చేసే పనికి సరైన న్యాయం చేకూర్చలేరు. నాణ్యమైన పనులను అందించలేరు. గిగ్ వర్క్‌తో నైపుణ్యాలు మాయమయ్యే స్థితి నెలకొంటుంది. యువత ఏ ఒక్క పని మీద దృష్టి కేంద్రీకరించి, దానిని స్వంతం చేసుకోలేదు.

ఎందుకంటే గిగ్ ఆర్థిక వ్యవస్థల్లో నిత్యజీవన పోరాటంలో అంత సమయం తీరిక లభించవు. అలాగే ఉత్పాదక రంగంలో ఉండాల్సిన యువత అధిక సంఖ్యలో సేవారంగంలోకి మళ్ళితే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? సమాజం బాగుండాలంటే ఈ రెండు రంగా ల మధ్య సమతుల్యత అవసరం. ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కడ కామాలు, ఫుల్ స్టాపులు పెట్టాలో అర్ధం చేసుకోవాలి. యువత గిగ్ వర్క్ రోడ్లను వదిలి నైపుణ్యాలను సాధించే వైపుగా ప్రయాణం సాగించాలి, తమ జీవన రహదారులను సరైన ఉత్పత్తి మార్గాల్లో నిర్మించుకోవాలి.

పరుచూరు జమున
jamunap@gmail.com

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News