న్యూఢిల్లీ : ఇటలీ చరిత్ర లోనే తొలిసారి ఓ మహిళా నేత ప్రధాని పదవిని చేపట్టనున్నారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత జార్జియా మెలోని (45) ఇటీవల జరిగిన ఎన్నికల్లో 26.37 శాతం ఓట్లు సాధించారు. ఆమె నేతృత్వం లోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించింది. మెలోని పూర్తిగా అతివాద నేత. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడిన పూర్తి అతివాద ప్రభుత్వం కూడా ఇదే. వివాదాస్పదమైన ‘గాడ్, ఫాదర్‌ల్యాండ్ అండ్ ఫ్యామిలీ ’ నినాదంతో మెలోని ముందుకు సాగారు. ఆమె ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
ఇటలీ నౌకాదళం లిబియా సముద్ర మార్గాన్ని మూసివేయాలని ఆమె కోరుకుంటున్నారు. అదే సమయంలో దేశం లోని ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా తరచూ హెచ్చరికలు జారీ చేశారు. గత ఎన్నికల్లో మెలోని పార్టీకి కేవలం 4 శాతం మాత్రమే ఓట్లు లభించాయి. కానీ , మారియో డ్రాఘీ నేతృత్వం లోని కూటమిలో చేరడానికి నిరాకరించారు. దీంతో ఆమె ప్రధాన ప్రతిపక్ష నేతగా నిలిచారు. గ్రాబ్టెల్లా లోని ఓ కార్మిక కుటుంబంలో మెలోని జన్మించారు. చిన్నతనం లోనే తండ్రి వారి కుటుంబాన్ని వదిలేసి వెళ్లి పోయారు. దీంతో మెలోని తల్లి వద్దే పెరిగింది. యుక్త వయసులో ఆమె నియో ఫాసిస్టు సంస్థ యూత్ విభాగంలో చేరారు. కాకపోతే తాను ఫాసిస్టుని కాదని ఆమె చెబుతారు.