Monday, January 20, 2025

ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని ప్రమాణం

- Advertisement -
- Advertisement -

రోమ్: ఇటలీ తొలి మహిళా ప్రధాన మంత్రిగా జార్జియా మెలోని(45) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. 24మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా ప్రమాణస్వీకారం చేసింది. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత మెలోని ఇటీవల జరిగిన ఎన్నికల్లో 26.37శాతం ఓట్లు సాధించారు. ఫోర్జా ఇటాలియా, లీగ్ పార్టీలతో కూడిన ఆమె నేతృత్వం లోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించింది. దీంతో రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇటలీలో పూర్తి అతివాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయింది. ఇక్కడి అధ్యక్ష భవనంలో దేశాధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా సమక్షంలో మెలోని ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అంతకు ముందు సుదీర్ఘ చర్చల అనంతరం శుక్రవారం మెలోని తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. సొంత పార్టీకి తొమ్మిది క్యాబినెట్ పదవులు, లీగ్, ఫోర్జా ఇటాలియాలకు ఐదు చొప్పున శాఖలు కేటాయించారు. ఈ క్యాబినెట్‌లో మొత్తం ఆరుగురు మహిళలు ఉన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఆర్థిక మాంద్యం, పెరుగుతోన్న ఇంధన బిల్లుల వంటి సవాళ్ల నడుమ ఈ కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. వివాదాస్పదమైన ‘గాడ్, ఫాదర్‌ల్యాండ్ అండ్ ఫ్యామిలీ ’నినాదంతో మెలోని ఎన్నికల్లో ముందుకు సాగారు. ఆమె ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌ను విమర్శించేందుకూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తానని ఆమె హామీ ఇచ్చారు. మరోవైపు అధికార కూటమిలోని ఫోర్జా ఇటాలియా అధినేత బెర్లుస్కోని మాత్రం రష్యా సైనిక చర్యకు ఉక్రెయినే కారణమని ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.

Giorgia Meloni Sworn in as Italy’s first woman PM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News