ఎనిమిదేళ్ల ఈ చిట్టి తల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన రక్త క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే చికిత్స కోసం 70 లక్షల వరకు ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పుడు మరో 20 లక్షల అవసరమని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆదుకునే ఆపన్న హస్తం కోసం అర్థిస్తున్నారు. హైదరాబాద్ ఎల్.బి నగర్‌లో ఉంటున్న ఎ.రఘు, మంజుల దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రఘు ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి సాఫీగా సాగుతున్న వారి జీవితంలో పెద్ద కుదుపు వచ్చింది. రెండవ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె వేదవల్లికి 2022 నవంబరులో తీవ్ర జ్వరం వచ్చింది. వైద్యులకు చూపిస్తే మందులు ఇచ్చారు. 10 రోజులు గడిచిన జ్వరం తగ్గలేదు. ఆ చిన్నారి ఆరోగ్యం క్రమేపి క్షీణిస్తుండటంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనేక పరీక్షల అనంతరం ఆమెకు రక్త క్యాన్సర్ గా వైద్యులు ధృవీకరించారు.
అయితే అది ఏ తరహా క్యాన్సర్ అనేది నిర్ధారించేందుకు ముంబైలోని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ ఆమెకు అత్యంత అరుదైన ‘అనాప్లాస్టిక్ లార్జ్ సెల్ లార్జ్ లింఫోమా’ నాలుగో దశలో ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా 60 ఏళ్ల పైబడిన పురుషుల్లో ఎక్కువగా బయటపడే ఈ వ్యాధి చిన్నారికి సోకడంతో వైద్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చికిత్స నిమిత్తం చిన్నారిని మళ్లీ తిరిగి హైదరాబాద్ తరలించి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే అత్యంత క్లిష్టమైన కీమోథెరపీ 5 సైకిల్స్ పూర్తి చేయడంతో పాటుగా, రేడియేషన్స్ తెరఫీ, బోన్ మారో మార్పిడి కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పాపకు అత్యంత ప్రమాదకరమైన జీవీహెచ్ గట్ గ్రేడ్- 4 బోన్ మారో కాంప్లికేషన్ రావడం జరిగింది. ప్రస్తుతం పాప విపరీతమైన రక్తస్రావంతో బాధపడుతోంది. బాలికకు ప్రతిరోజు రక్తం, ప్లేట్లెట్స్ ఇస్తున్నారు. గత 115 రోజులుగా పాప ఈ చికిత్స పొందుతూనే ఉంది.
ఇప్పటికే పాప చికిత్స కోసం తమ వద్ద ఉన్నదంతా ఖర్చు చేయడంతో పాటు బంధువులు స్నేహితుల వద్ద అప్పులు తీసుకుని వెచ్చించారు. ఇక ముందు చికిత్సకు తన వద్ద ఏమీలేదని, సాయం చేసే చేతులే తమ బిడ్డను ఆదుకోవాలని రఘు ఆవేదనతో వ్యక్తం చేశారు. సాయం చేయాలనుకునే దాతలు ఫోన్ నెంబర్ 9440611760 లో సంప్రదించవచ్చే. పాప తండ్రి జూన్ నెలలో తెలంగాణ ప్రభుత్వ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. త్వరితగతని దరఖాస్తును పరిశీలించి తమ బిడ్డను ఆదుకోవడాని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.