త్రిస్సూర్ : 17 ఏండ్ల చిట్టి తల్లికి ఎంత పెద్ద మనసు. జన్మనిచ్చిన తండ్రికి కేరళకు చెందిన అమ్మాయి తన కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేసింది. దేశంలోనే చిన్నవయస్కురాలేన అవయవదాతగా నిలిచింది. ఇంటర్మిడియట్ చదువుతున్న దేవానంద తన తండ్రి ప్రతీష్ సుదీర్ఘ కాలేయ జబ్బుతో బాధపడుతూ జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటూ ఉండటాన్ని గుర్తించింది. తన కాలేయం దానం చేయాలని సంకల్పించింది. అయితే మైనర్లు అవయవ దానం చేయరాదనే చట్టం నిబంధనలు ఉండటంతో ఈ అమ్మాయి కేరళ హైకోర్టులో పిటిషన్ వేసి, కాలేయ దానానికి వీలు కల్పిస్తూ తనకు మినహాయింపు ఇవ్వాలనివేడుకుంది. ఆమె వినతిని పరిశీలించిన కోర్టు దీనికి అంగీకారం తెలిపింది. దీనితో ఆలస్యం చేయకుండా ఆమె ఈ నెల 9వ తేదీన కాలేయంలోని కొంత భాగాన్ని తండ్రికి అమర్చేందుకు తగు ఆపరేషన్ కోసం ముందుకు వచ్చింది. త్రిస్సూర్‌లో ఓ చిన్నపాటి హోటల్‌ను నిర్వహిస్తూ కుటుంబ పోషణకు ఆధారమైన తండ్రి బతికించుకోవడం కీలకమని కన్నకొడుకులు కూడా చేయని విధంగా ఓ కూతురుగా స్పందించింది.
దేవానంద తన తిండి ఇతరత్రా అలవాట్లను మార్చుకుని, స్థానిక జిమ్‌లో కూడా చేరి, తన కాలేయం తగు విధంగా తండ్రికి అమరేలా చూసుకుంది. అలూవాలోని రాజాగిరి ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. తండ్రికి కాలేయంతో ప్రాణాలు నిలిపినందుకు వచ్చిన ఈ ఆడబిడ్డను ఆసుపత్రి సిబ్బంది అంతా అభినందించింది. తాము ఉచిత ఆపరేషన్ చేశామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. వారం రోజుల తరువాత కాలేయ మార్పిడి ప్రక్రియ ముగిసి ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జి అయ్యారు. తనకు ఇప్పడు గర్వంగా ఆనందంగా అంతకుమించి బాధతప్పినట్లుగా ఉందని స్పందించింది. 1994 మానవ అవయవాల మార్పిడి చట్టం పరిధిలో మైనర్లు అవయవాదానం చేయరాదు. ఆసుపత్రిలో ఆరోగ్యవంతుడిగా ఉన్న తండ్రి వద్ద కూర్చుని ఆప్యాయంగా ముద్దుపెట్టుకుంటున్న దేవానంద నిజంగానే దేవతలా మారింది.