చాక్లెట్ ఇప్పిస్తానని బాలికను తీసుకెళ్లిన నిందితుడు
పరారీలో అత్యాచార నిందితుడు
మనతెలంగాణ, సిటిబ్యూరోః బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లాకు చెందిన బాలిక తల్లిదండ్రులు బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి హిమయత్‌సాగర్ గ్రామంలో హోటల్ పెట్టుకుని బతుకుతున్నారు. వీరికి బాలిక(3) ఉంది, ఈ నెల 15వ తేదీన బాలిక తల్లిదండ్రులు హోటల్ పనిలో ఉండగా బాలిక బయట ఆడుకుంటోంది. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అలియాస్ కాంతు(25) జులాయిగా తిరుగుతుంటాడు. డ్రగ్స్, గంజాయికి బానిసగామారిన నిందితుడు కూలీ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలోనే బయట ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని ఆశ చూపాడు. దీంతో బాలిక అతడితో వెళ్లింది, బాలికను తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఏడవడంతో వెంట తీసుకుని హోటల్ వద్దకు వచ్చాడు.
బాలికకు రక్తస్రావం కావడంతో నిందితుడిని బాలిక తల్లి నిలదీసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తాని వారిని బెదిరించడమే కాకుండా వారిపై దాడి చేశాడు. వెంటనే హోటల్ ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించడంతో నిందితుడు స్థానికుడు కావడంతో బెదిరిపోయిన తల్లిదండ్రులు బాలికను తీసుకుని వనపర్తికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. వనపర్తికి వెళ్లిన తర్వాత బాలిక ఆరోగ్యం విషమించడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగిందని చెప్పారు. పోలీస్ కేసు పెడితేనే చికిత్స చేస్తామని వైద్యులు చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నామని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.