Monday, December 23, 2024

అమ్మాయిలు అదుర్స్

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు అమ్మాయిలు కాలేజి చదువులు చదవడం అంటే ఎంతో గొప్ప విషయంగా ఉండేది. ఉన్నతస్థాయి కుటుంబాల్లో అది కూడా కొద్ది శాతంలో మాత్రమే అమ్మాయిలు పైచదువులు చదివేవారు. ఆడపిల్లలు ఎక్కువ చదివితే పెళ్లిళ్లు కావడం కష్టమని, అమ్మాయిలకు త్వరగా పెళ్లిచేసి తమ బాధ్యత తీర్చుకోవాలనే భావన చాలా మందిలో ఉండడమే దీనికి బలమైన కారణం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దేశంలో ఉన్నత విద్యనభ్యసించడంలో అమ్మాయిలు అబ్బాయిలతో పోటీపడుతున్నారు. ఏడాదికేడాది ఉన్నత విద్యా సంస్థల్లో చేరే యువతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.ఉన్నత విద్యపై కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే ప్రకారం ఉన్నత విద్యలో చేరే విద్యార్థుల సంఖ్య మొట్టమొదటి సారి 2020-21 విద్యా సంవత్సరంలో మొత్తం 4.14 కోట్లకు చేరగా అమ్మాయిల సంఖ్య 2 కోట్లను దాటింది. అంటే అబ్బాయిలతో పోటీపడే విధంగా అమ్మాయిలు ఉన్నత విద్యనభ్యసించడానికి ముందుకు వస్తున్నారు.

2014-15 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2020-21 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యనభ్యసించే మొత్తం విద్యార్థుల సంఖ్య 21% పెరిగింది. 2014-15 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2020-21 విద్యాసంవత్సరం నాటికి ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి వర్గాల్లో ఉన్నత విద్యనభ్యసించే అమ్మాయిల శాతం అబ్బాయిలకన్నా ఎక్కువగా ఉండడం విశేషం. ఈశాన్య ప్రాంత రాష్ట్రాల నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో చేరే అమ్మాయిల శాతం అబ్బాయిలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది.2014-15 విద్యా సంవత్సరం నుంచి 2020-21 మధ్యకాలంలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులు మొత్తంగా 29శాతం పెరగ్గా, అమ్మాయిలు 34 శాతం పెరగడం గమనార్హం.అయిదేళ్ల క్రితంతో పోలిస్తే ఉన్నత విద్యాసంస్థల్లో చేరే విద్యార్థుల సంఖ్య 67 లక్షలకు పైగా పెరిగింది. ఇందులో 50 శాతానికి పైగా విద్యార్థులు ఆరు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మొత్తంమీద ఉన్నత విద్యనభ్యసించే 18 23 ఏళ్ల మధ్య వయసు యువతుల నిష్పత్తి అబ్బాయిలతో పోలిస్తే 1.05గా ఉంది.

అయితే సంఖ్యాపరంగా చూస్తే అబ్బాయిలు ఎక్కువ. అయితే దేశంలోని అనేక రాష్ట్రాలతో పోలిస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఈ విషయంలో వెనకబడి ఉండడం ఆశ్చర్యకరం. ముఖ్యంగా బీమారీ రాష్ట్రాలుగా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాలకంటే కూడా ఈ రాష్ట్రం వెనకబడి ఉంది. నారీశక్తికి పెద్దపీట వేస్తున్నామని, మహిళలు అన్నిరంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పుకునే మోడీ తన సొంత రాష్ట్రంలో ఆడపిల్లల చదువు విషయం గురించి ఆలోచించకపోవడం వింతగానే కనిపిస్తోంది. వాస్తవానికి విద్యారంగ విషయంలో గుజరాత్ ఎంతో వెనుకబడి ఉందంటూ గతంలో సైతం గణాంకాలతో సహా వార్తలు వచ్చాయి.ఈ విషయంలో తెలంగాణతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలన్నీ మెరుగ్గా ఉన్నాయి.అంతేకాదు ఈశాన్య రాష్ట్రాలయిన అసోం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం వంటి రాష్ట్రాలు కూడా గుజరాత్‌కన్నా పైస్థాయిలో ఉన్నాయి. అంతకన్నా పెద్ద ట్విస్ట్ ఏమిటంటే నిత్యం తీవ్రవాద హింసతో అట్టుడికిపోతున్న కశ్మీర్ సైతం ఉన్నత విద్యనభ్యసించే అమ్మాయిల విషయంలో ప్రధాని సొంత రాష్ట్రంకన్నా ఓ మెట్టుపైనే ఉంది.

ఎక్కడ లోపం ఉందో ఆ రాష్ట్ర పాలకులు ఆలోచించాలి. విద్యారంగంలో రాణించిన రాష్ట్రాలు అన్ని రంగాల్లోను ముందు వరసలో ఉంటాయనే దానికి దక్షిణాది రాష్ట్రమైన కేరళ చక్కటి ఉదాహరణ. ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాల కారణంగా సమాజంలో ఒకప్పుడు వెనుకబడిన వర్గాలుగా ముద్రపడిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ తదితర వర్గాల్లో ఆడపిల్లలు పైచదువులు చదవడానికి పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నట్లు ఈ నివేదికను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఉన్నత విద్య చదివే అమ్మాయిల శాతం మొత్తం విద్యార్థుల్లో 2014 -15 విద్యాసంవత్సరంలో 45 శాతంగా ఉండగా 2020-21 విద్యా సంవత్సరం నాటికి 49 శాతానికి చేరుకుంది. అంటే అబ్బాయిలతో పోటీపడే విధంగా అమ్మాయిలు కూడా పైచదువులు చదవడానికి ఇష్టపడుతున్నారు. ఇది చాలా మంచి మార్పు. ఈ విషయంలో వెనుకబడి ఉన్న గుజరాత్ లాంటి రాష్ట్రాల పాలకులు ఇప్పటికయినా ఈ విషయంపై ప్రధానంగా దృష్టి పెట్టి అమ్మాయిల చదువును ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News