Wednesday, April 23, 2025

బాలికలు భళా

- Advertisement -
- Advertisement -

ఇంటర్ ఫలితాల్లో 74శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటిన అమ్మాయిలు ఫస్టియర్‌లో
65.96,సెకండియర్‌లో 65.65శాతం ఉత్తీర్ణత నమోదు ఫలితాల్లో అగ్రస్థానాన నిలిచిన మేడ్చల్, ములుగు జిల్లాలు రీకౌంటింగ్, రీవాల్యూయేషన్‌కు వారం రోజులు గడువు మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉత్తీర్ణులైన
విద్యార్థులకు డిప్యూటీ సిఎం భట్టి అభినందనలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడులయ్యాయి. ఈసారి ఫలితాల్లోనూ మళ్లీ బాలికలే ముందంజలో ఉన్నారు. ఈ పరీక్షల్లో మొదటి సంవత్సరం 65.96 శాతం ఉత్తీర్ణత సాధించగా, రెండో సంవత్సరం విద్యార్థుల్లో 65.65 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు.ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 73.83 శాతం మంది బాలికలు ఉత్తీర్ణతను సాధించగా, సెకండియర్‌లో 74.21 శాతం బాలికలు పాస్ అయ్యారు. మరోవైపు ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 57.83 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించగా, రెండో ఏడాదిలో 57.31 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను tgbie.cgg.gov.in, results.eenadu.net వెబ్‌సైట్‌లలో తెలుసుకోవచ్చు. మంగళవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంటర్మీడియేట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరీక్షల విభాగం అధికారులు పాల్గొన్నారు.

ఫస్టియర్, సెకండియర్‌లో 65.81 శాతం ఉత్తీర్ణత
ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు 4,88,430 మంది విద్యార్థులు రాయగా, 3,22,191 మంది ఉత్తీర్థత సాధించారు. ఫస్టియర్‌లో 65.96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సరంలో 5,08,582 మంది పరీక్షలు రాయగా, 3,33,908 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 64.8 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ప్రథమ సంవత్సరం ఫలితాలలో జనరల్‌లో 1,89,638 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా, 68,011 మంది బి గ్రేడ్, 27,069 సి గ్రేడ్, 9,134 మంది డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్‌లో 18,195 మంది మంది విద్యార్థులు ఎ గ్రేడ్, 9,585 మంది బి గ్రేడ్, 540 మంది సి గ్రేడ్, 19 మంది డి గ్రేడ్ సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌లో 1,93,285 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా,25 మంది ప్రైవేట్ విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించారు.

పెరిగిన ఉత్తీర్ణత
ఇంటర్మీడియేట్ ఫలితాలలో గత రెండేళ్లతో పోల్చితే ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2023లో ప్రథమ సంవత్సరంలో 51.49 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 2024లో 50.57 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈ ఏడాది గత రెండేళ్ల కంటే అధికంగా 57.68 శాతానికి ఉత్తీర్ణత పెరిగింది.అలాగే ద్వితీయ సంవత్సరంలో 2023లో 66.81 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 2024లో 63.86 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. సెకండియర్‌లో కూడా ఈ ఏడాది గత రెండేళ్ల కంటే అధికంగా 70.26 శాతానికి ఉత్తీర్ణత పెరిగింది.

బాలికలదే పైచేయి
ఇంటర్ ఫలితాలలో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 65.96 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 73.83 శాతం నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 65.65 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 74.21 శాతం నమోదైంది. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 2,23,407 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, 1,64,876 ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 24,860 మంది బాలికలు హాజరు కాగా, 18418 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 2,15,895 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, 1,28,976 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఫస్టియర్‌లో మేడ్చల్, సెకండియర్‌లో
ములుగు జిల్లాలు టాప్
రాష్ట్ర ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్, ములుగు జిల్లాల విద్యార్థులు సత్తాచాటారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 77.21 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా, 76.36 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో, 70.52 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. మహబూబాబాద్ జిల్లాలో అత్యల్పంగా 48.43 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. అదేవిధంగా సెకండియర్ ఫలితాల్లో 81.06 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లాకు ప్రథమ స్థానం, 80.24 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం జిల్లాకు ద్వితీయ స్థానం, 77.91 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 56.38 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఎంపిసిలో అత్యధిక ఉత్తీర్ణత నమోదు
ఇంటర్మీయేట్ ఫలితాలలో గ్రూపుల వారీ గా ఎంపిసి ఫస్టియర్‌లో 76.65 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బైపిసిలో 67.88 శాతం, సిఇసిలో 45.56 శాతం, ఎంఇసి లో 65.53 శాతం, హెచ్‌ఇసిలో 34.51 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా సెకండియర్ ఎంపిసిలో 72.23 శాతం, బైపిసిలో 71.93 శాతం, సిఇసిలో 46.92 శాతం, ఎంఇసిలో 56.96 శాతం, హెచ్‌ఇసిలో 46.26 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు.

మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రకటించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజును బుధవారం (ఏప్రిల్ 23) నుంచి ఈనెల 30వ తేదీలోపు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే రీ వ్యాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 30వ తేదీలోగా ఫీజు చెల్లించాలని అన్నారు. రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.100, స్కాన్ చేసిన జవాబు పత్రాలు, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.600 చెల్లించాలని పేర్కొన్నారు.

సందేశాలు నివృత్తికి ఈ నెంబరుకు కాల్ చేయండి
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎలాంటి సందేశాలు ఉన్నా helpdesk- ie@telangana.gov.inకి ఈమెయిల్ చేస్తే సందేహాలు నివృత్తి అవుతాయి. లేకపోతే 9240205555 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News