మద్రాసు హైకోర్టు ఆదేశం
మదురై: బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చారన్న ఆరోపణపై ఆత్మహత్యకు పాల్పడిన 17 ఏళ్ల యువతి కేసు దర్యాప్తును మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సోమవారం సిబిఐకి బదిలీ చేసింది. ఆత్మహత్యకు పాల్పడిన బాలిక తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు పాఠశాల యాజమాన్యం తరఫు న్యాయవాది వాదనలు విన్న అనంతరం జస్టిస్ జిఆర్ స్వామినాథన్ కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. బాలికకు మరణానంతరం న్యాయం అందచేయాల్సిన బాధ్యత తమపై ఉందని న్యాయమూర్తి ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు సరైన దారిలో సాగుతోందన్న అభిప్రాయం కలగడం లేదని, రాష్ట్ర పోలీసుల నుంచి ఈ కేసు దర్యాప్తును చేపట్టేందుకు ఒక అధికారిని నియమించవలసిందిగా న్యూఢిల్లీలోని సిబిఐ డైరెక్టర్‌ను ఆదేశిస్తున్నానని ఆయన చెప్పారు. అరియాలూరు జిల్లాలోని తంజావూరులో ఒక మిషనరీ స్కూలులో చదువుతున్న ఒక 17 ఏళ్ల బాలిక కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌లో ఉంటున్న ఆ బాలికను క్రైస్తవ మతంలోకి బలవంతంగా మార్చినట్లు ఒక వీడియో క్లిప్పింగ్ బయటపడింది. కాగా ఈ ఆరోపణలను స్కూలు యాజమాన్యం ఖండించింది.