Sunday, January 19, 2025

మహిళపై 72 మంది అత్యాచారం..మాజీ భర్తే దోషి

- Advertisement -
- Advertisement -

భార్యకు మత్తుమందు ఇచ్చి పలువురితో అత్యాచారం చేయించిన కేసులో ఆమె మాజీ భర్త డొమినిక్ పెలికాట్(72)తోపాటు , అత్యాచారానికి పాల్పడిన మరో 50 మందిని ఫ్రాన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. ఫ్రాన్స్‌లో సంచలనం రేపిన ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు న్యాయస్థానం విచారణ చేపట్టింది. డొమినిక్‌తోపాటు వారందరినీ నేరస్తులుగా పరిగణిస్తున్నట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రపంచం తలదించుకునేలా ఓ మహిళపై పాశవికంగా ప్రవర్తించిన డొమినిక్‌కు మాత్రం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మిగతా దోషులకు విధించిన శిక్షపై స్పష్టత లేదు. ఫ్రాన్స్ లోని ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి అయిన డొమినిక్ పెలికాట్ , భార్యపై కొన్నేళ్లపాటు కిరాతకంగా ప్రవర్తించాడు. రాత్రిపూట ఆమె తినే ఆహారంలో రహస్యంగా డ్రగ్స్ కలిపి తినిపించేవాడు. ఆమె మత్తు లోకి జారుకున్న తరువాత ఇంటికి కొందరు వ్యక్తుల్ని రప్పించేవాడు. వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే రహస్య కెమెరాల్లో రికార్డు చేసేవాడు.

ఇలా దాదాపు పదేళ్లపాటు ఆమెపై అకృత్యాలు కొనసాగాయి. 2011 నుంచి 2020 మధ్య కాలంలో ఈ దారుణాలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. 2020లో ఓ షాపింగ్ సెంటర్‌లో డొమినిక్ కొందరు మహిళలను రహస్యంగా వీడియో తీస్తుండగా అక్కడి సెక్యూరిటీ గార్డు గుర్తించి పట్టుకున్నాడు. ఆ తరువాత పోలీస్‌లు అతడి ఫోన్, కంప్యూటర్‌ను తనిఖీ చేయగా భార్యపై చేయించిన అకృత్యాలు బయటపడ్డాయి. మొత్తం 72 మందితో92 సార్లు భార్యపై అత్యాచారం చేయించినట్టు దర్యాప్తులో తేలింది. ఈ దురాగతాలకు పాల్పడిన వారి వయసు 26 నుంచి 73 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. వీరిలో51 మందిని గుర్తించగా, మిగిలిన వారి ఆచూకీ లభించలేదు. కోర్టు విచారణలో తాను చేసిన అకృత్యాలను డొమినిక్ అంగీకరించాడు. డొమినిక్ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలియడంతో బాధితురాలు అతడి నుంచి విడిపోయింది. బహిరంగ విచారణ చేపట్టాలని కోర్టును ఆశ్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News