అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో కొత్త పాత్ర పోషించనున్న గీతా గోపినాథ్
ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లో ఇండియన్ అమెరికన్ గీతా గోపినాథ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా ఉన్నారు. అయితే ఆమెను ఐఎంఎఫ్‌కు ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రమోట్ చేసినట్లు ఆ సంస్థ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం ఐఎంఎఫ్‌కు ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న జాఫ్రీ ఒకామోటో వచ్చే ఏడాది తొలిభాగంలో తన పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. ఆయన స్థానాన్ని గీతా గోపినాథ్ భర్తీ చేస్తారు. ఐఎంఎఫ్‌లో మూడేళ్లపాటు చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేసిన గీతా గోపినాథ్ 2022 జనవరిలో హార్వర్డ్ యూనివర్శిటీలో తిరిగి తన అకాడమిక్ పొజిషన్‌ను తీసుకోవాలనుకున్నారు.
“జాఫ్రీ, గీతా ఇద్దరూ గొప్ప సహోద్యోగులు. జాఫ్రీ పదవి నుంచి తప్పుకోబోవడం నాకు విచారకరమే అయినప్పటికీ, గీత అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలో ఉండాలని నిర్ణయించుకోవడం, మా ఎఫ్‌డిఎండిగా కొత్త బాధ్యతలు నిర్వహించనుండడం ఆనందాన్ని ఇచ్చింది” అని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా తెలిపారు. ఆమె ఇంకా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో తొలి మహిళా చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ అని తెలిపారు. సభ్య దేశాలు, సంస్థలు ఆమెకు గౌరవాన్ని ఇస్తాయని కూడా తెలిపారు.గీతా నేతృత్వంలో ఐఎంఎఫ్ పరిశోధన విభాగం మరింత పటిష్టపడిందన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో 190 సభ్య దేశాలున్నాయని, క్లిష్టమైన పాలసీ ఛాయిస్‌ల నేపథ్యంలో ఐఎంఎఫ్ కార్యకలాపాలు నిర్వహించడం, అందునా కరోనా మహమ్మారి కాలంలో నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్నదని కూడా క్రిస్టాలినా జార్జివా తెలిపారు. ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా గీతా నిఘా, పాలసీ సంబంధాలు, పరిశోధనల పర్యవేక్షణ, ప్రధాన ప్రచురణలకు నేతృత్వం వహిస్తారని, ఐఎంఎఫ్ ప్రచురణల ప్రామాణికతలను ఉన్నతంగా ఉంచేలా చూడగలరని ఆమె అభిప్రాయపడ్డారు.
Gita Gopinath promoted to IMF’s first deputy MD