Monday, January 20, 2025

రూ. 1 కోటి నగదు బహుమతి వద్దన్న గీతా ప్రెస్

- Advertisement -
- Advertisement -

గోరఖ్‌పూర్(యుపి): గాంధీ శాంతి అవార్డును తమకు ప్రకటించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్ల్లు గీతా ప్రెస్ సోమవారం తెలిపింది. అయితే ఏ విధమైన విరాళాలు స్వీకరించడం తమ సాంప్రదాయం కానందున అవార్డు కింద ప్రకటించిన రూ. 1 కోటి నగదును తాము స్వీకరించబోమని గీతా ప్రెస్ ప్రకటించింది.

గాంధీ శాంతి అవార్డును ప్రకటించిన అనంతరం గీతా ప్రెస్ ట్రస్టీ బోర్డు ఆదివారం నాడిక్కడ సమావేశమైంది. రూ. 1 కోటి నగదు బహుమతిని స్వీకరించరాదని సమావేశం నిర్ణయించింది.

ప్రతిష్టాత్మక ఈ అవార్డుకు తమను ఎంపిక చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖకు గీతా ప్రెస్ ప్రచురణకర్త ధన్యవాదాలు తెలిపారు. ఇది తమకు ఎతో గౌరవప్రదమని, అయితే ఏ విధమైన విరాళాలు స్వీకరించరాదన్నది తమ సాంప్రదాయమని గీతా ప్రెస్ మేనేజర్ లాల్‌మణి త్రిపాఠి సోమవారం నాడిక్కడ విలేకరులకు తెలిపారు. నగదు రూపంలో అవార్డు తీసుకోరాదని ట్రస్టీ బోర్డు నిర్ణయించిందని, అయితే అవార్డును మాత్రం స్వీకరిస్తామని ఆయన తెలిపారు.బోర్డు చైర్మన్ కేశవ్ రాం అగర్వాల్, ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ చాంద్‌గోటియా, ట్రస్టీ దేవి దయాళ్ ప్రెస్ నిర్వహణను చూసుకుంటున్నారని త్రిపాఠి తెలిపారు.
2021 సంవత్సరానికి గాంధీ శాంతి అవార్డు తమకు ప్రకటించిన వార్త తెలసిన వెంటనే గీతా ప్రెస్ నెలకొని ఉన్న తూర్పు ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 1923లో స్థాపించిన గీతా ప్రెస్‌లో హిందూ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథాల ముద్రణ జరుగుతుంది. సనాతన ధర్మ సిద్ధాంతాలను ప్రోత్సహించే లక్షంతో జయ దయాళ్ గోయంక, ఘన్‌శ్యామ్ దాస్ జలన్ గీతా ప్రెస్‌ను స్థాపించారు. ఇప్పటివరకు వివిధ భాషలలో 93 కోట్లకు పైగా పుస్తకాలను గీతా ప్రెస్ ముద్రించింది. గోరఖ్‌పూర్‌లోనే ప్రచురణ జరుగుతుంది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2.40 కోట్ల పుస్తకాలను అతి తక్కువ ధరలకు తమ పాఠకులకు అందచేయడం జరిగిందని, ఈ పుస్తకాల విలువ రూ.111 కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు. పుస్తకాలకు డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పటికీ డిమాండ్‌కు తగ్గట్టు పుస్తకాలను అందచేయలేకపోతున్నామని త్రిపాఠి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News