తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండల పరిధిలోని ముదివిన్ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, సిఐ చిలువేరు శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట వెంకటయ్య (45) కులవృత్తిలో భాగంగా ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో కళ్ళు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. నడుముకున్న మోకు ప్రమాదవశాత్తు జారడంతో తాటిచెట్టు పైనుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని 108 వాహనంలో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడు భార్య సునిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు.