నోబెల్ పురస్కారమందుకొన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ యెన్నో భాషల్లోకి అనువాదం అయింది. ఒక్క తెలుగులోనే చాలా అనువాదాలు వచ్చాయి. రఘువర్మ చేసిన స్వేచ్ఛా కవితానువాదం వాటికి మరో చేర్పు. మిగతా వాటికి సమఉజ్జిగా ఈ అనువాదం కూడా కమనీయంగా, అద్వితీయంగా ఉంది.కవిగా రఘువర్మ రచనలు హృదయ జలధి, కవిత్వం వింతభాష, మూడో కంటి చూపు అనే కవితా సంకలనాలుగా వచ్చాయి. ఆయన ప్రతి కవితలో లాలిత్యం కనిపిస్తుంది. అతను చేసే సామాజిక విమర్శలోనూ లాలిత్యం పాలు తగ్గదు. ఇటీవలి కాలంలో రఘువర్మ కాళిదాసు ‘మేఘసందేశా’న్ని వచన కవితగా అనువాదం చేశాడు. ఆ తరవాత మరొక పుస్తకంగా కాళిదాసు ‘ఋతుసంహారా’న్ని వచన కవితగా తెచ్చాడు.
ఇప్పుడు ఠాగూర్ ‘గీతాంజలి’ని వచనకవితా అనువాదం చేశాడు. ఎంతో మంది దీనిని పద్యాలుగా అనువదించారు. కొందరు వచనంలోకి అనువదించారు. గేయాలుగా అనువదించినవారున్నారు.
ఎక్కువమంది ఇంగ్లీషు నుండి వచనంలోకే తెచ్చే ప్రయత్నం చేశారు. వచనంలోనికి కాకుండా వచన కవిత్వంలోనికి అనువదించడం బహుశా యిదే మొదటిది కావచ్చు. వచనంలో చేసిన మిగతా అనువాదాలకన్నా, పాద నిర్మాణం వాక్యనిర్మాణం ఇందులో భిన్నంగా వుంది.కొంతమంది అనువాదకులు రవీంద్రుడి ఆంగ్ల గద్య కవిత యే పద్ధతిలో ఉందో అదే పద్ధతిలో పేరాలు పేరాలుగా అనువదించారు. అయితే రఘువర్మ పూర్తిగా వచన కవితలాగా పాదనిర్మాణం, వాక్యనిర్మాణాలను దృష్టిలో ఉంచుకొని ‘గీతాంజలి’ని వచనకావ్యంగా తీర్చిదిద్దాడు. తెలుగులో వచ్చిన వచన కవితా కావ్యాల సరసన ఇది చేరుతుంది. వీటినే దీర్ఘకవితలు అని కూడా చాలామంది వింగడించారు. కానీ కావ్యం అనడమే బాగుంటుంది. నారాయణరెడ్డిగారి ‘విశ్వంభర’, శివారెడ్డి ‘ఆసుపత్రిగీతం’, గోపి ‘జలగీతం’ వంటి దీర్ఘ కవితలు వచన కావ్యాలుగా పరిగణనలోనికి వచ్చాయి. రఘువర్మ చేసిన ప్రయత్నం ‘గీతాంజలి’ని తెలుగులో అలాంటి వచన కావ్యాల సరసన నిలబెట్టడానికి అనుకూలంగా వచ్చింది.
రఘువర్మ ఆలోచనలలో, వ్యక్తీకరణలో, మాటల్లో ఎంతో లాలిత్యమే తప్ప పారుష్యం, కాఠిన్యం ఎప్పుడూ ఉండవు. అదే అతని జీవనశైలి, అతని కవిత్వంలో తొంగి చూస్తుంది. గీతాంజలి అనువాదాలు కొన్ని ఉదాహరణకి.
నేను నీ మోము వైపు చూస్తాను,/ నా కళ్ళల్లో నీళ్ళు నిండుతాయి!/ నా బ్రతుకులోని కాఠిన్యమూ, అపశృతీ అంతా…/ కరిగిపోయి ఒక మధుర శ్రావ్య స్వర సమ్మేళనం/ అవుతుంది!/ నేను కేవలం గాయకుడిగా మాత్రమే/ నీ సన్నిధికి వచ్చాననీ నాకు తెలుసు!/ నే నెన్నడూ చేరుకుంటానని/ అసలు ఆశపడలేని నీ పాదాలను…/ దూరంగా విశాలంగా సాచిన/ నా పాటరెక్క అంచుతో తాకి ధన్యుడనౌతాను!/ నా పాడడంలోని అమితానందాన్ని గ్రోలుతూ/ నన్ను నేనే మరిచి నా ప్రభువైన నిన్ను/ “చెలికాడా” అని పిలుస్తాను !!!ఇది ‘గీతాంజలి’లో రెండో ఖండిక. ఇది తెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో తనకు తెలియని ఆరాధనా సంప్రదాయాన్ని ఇక్కడ తెలుగువారికి తెలిసే సంప్రదాయంగా మలచడంలో రఘువర్మ సఫలమయ్యాడని చెప్పాలి. అనువాదం చేయడంలో రఘువర్మ సునిశితమైన అనుసృజనదృష్టిని మనం గమనించవచ్చు.
Dissonant అనే పదానికి నిఘంటువులు చెప్పే అర్థాలు తీసుకుని వుంటే అనువాదం ఇంత సముచితంగా ఉండేది కాదు. అపశ్రుతి అనే పదంతో ప్రతిభావంతమైన హత్తుకునే అనువాదాన్ని చేయగలిగాడు. అంతేకాదు వచన కవిత ఎక్కడా అసహజమైన అభివ్యక్తులతో లేదు. మరొక అనువాదం ఇలా ఉంది.అతడు వచ్చేసి నా చెంతనే కూర్చున్నాడు,/ అయినా నేను మేల్కొనలేక పోయాను/ ఇది ఎటువంటి శప్త సుషుప్తి,/ ఇది నా విషాద దురదృష్టం!/ రాత్రి నిశ్శబ్దనిశ్చలంగా ఉన్నప్పుడు/ అతడు వచ్చాడు,/ అతడి చేతుల్లో వీణ ఉంది,/ ఆ వీణావాదన మాధుర్య స్వర రాగాలతో/ నా స్వప్నాలు ప్రతిధ్వనించాయి!/ అయ్యో! ఎందుకు మరి ఈ విధంగా/ నా రాత్రులన్నీ నష్టజాతకంగా గడిచేశాయి?/ ఓప్‌ా, ఎవరి శ్వాసైతే నా నిద్రను స్పృశిస్తూ/ జోకొడుతుందో/ అతడి చల్లని దర్శన భాగ్యాన్ని/ ఎప్పుడూ నే నెందుకిలా/ కోల్పోతున్నాను?/ దీని మూల వాక్యాలు ఇక్కడ చూడండి. He came and sat by my side but I woke not, what a cursed sleep it was, O miserable me! అని ఉన్నదాంట్లో, ’cursed sleep’ అనే పదబంధాన్ని ఒక సిద్ధ మాసంలో శప్త సుషుప్తి అని ‘రఘువర్మ’ అనువాదం చేయడం అతని ప్రతిభకు, భాషా జ్ఞానాన్ని నిదర్శనం.
ఠాగూర్ ‘గీతాంజలి’లో 35వ ఖండికను అందరూ కోట్ చేస్తారు. ఎన్నో సందర్భాలలో చదువుతుంటారు. దానికి కూడా చాలామంది మంచి అనువాదాలే చేశారు. దాన్ని ‘రఘువర్మ’ చాలా చక్కగా మలిచారు./ where the mind is without fear and the head is held high;/ where knowledge is free;/ where the world has not been broken up into fragments b narrow walls;/ where words come out from the depth of truth;/ where tireless striving stretches its arms towards perfection; / ఈ తరహా వాక్యాలు ఇంకా చాలా వచ్చిన తర్వాత చివరిలో/In to that heave of freedom, my father let my country awake అని ఖండిక ముగుస్తుంది. ఈ తరహా వాక్యరచన ఇంగ్లీషుకు కానీ సంస్కృతానికి కానీ చాలా సహజంగా వుంటుంది. ఈ వాక్యప్రయోగాలనే యత్‌తత్ ప్రయోగాలు అని అంటారు. ఎక్కడైతేౠఅక్కడ అనే భావాలతో వచ్చేవాక్యాలనే యత్‌తత్ ప్రయోగాలు అని అంటారు. ఈ ఠాగూర్ ఖండికని కూడా చాలామంది అనువాదం చేశారు.
కానీ రఘువర్మ తన ముద్రని చూపాడు. కవితకి తెలుగుతనం తేవడం ఎంత ముఖ్యమో మూలంలోని నిర్మాణపరమైన అందం కాపాడడం కూడా అంతే ముఖ్యం. అందుకే రఘువర్మ కింది విధంగా అనువాదం చేశాడు. మూలంలోని యత్‌ౠతత్ ప్రయోగాన్ని అదే విధంగా ఉంచాడు. ఎక్కడ మనస్సు భయం లేకుండా ఉంటుందో/ ఎక్కడ మనిషి తల యెత్తుకొని బ్రతుకుతాడో/ ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా వర్థిల్లుతుందో/ ఎక్కడ ప్రపంచం ఇరుకైన ఇంటి బంధాల గోడలతో/ ముక్కలు ముక్కలుగా విడిపోవడం లేదో/ ఆ స్వేచ్ఛామయ స్వర్గంలోనికి/ ఓ జగత్పితా, నా దేశాన్ని మేల్కోనివ్వు!!!/ ఇలా మూలంలోని నిర్మాణంలో అందాన్ని అనువాదంలోనికి తెచ్చాడు. ‘గీతాంజలి’ అంటేనే తన పాటలతో భగవంతునికి అంజలి ఘటించడం.‘గీతాంజలి’లోని 103 ఖండికలలో ఈ సమర్పణ భావాన్ని అతి మెత్తగా లలిత లలితంగా అనుసృజన చేయగలిగాడు రఘువర్మ. అందుకు అతను అభినందనీయుడు.
స్వేచ్చానువాదం : రఘువర్మ
పేజీలు : 132 , వెల : రూ. 150/-
అడుగుజాడలు ప్రచురణ
9290093933.