ఒక్క అవకాశమివ్వాలన్న ఆప్ చీఫ్ కేజ్రివాల్
బరూచ్: గుజరాత్‌లో మార్పుతేవడం కోసం ఒక్క అవకాశమివ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ పిలుపునిచ్చారు. ఒక్క అవకాశమిస్తే ఢిల్లీ,ఇటీవల విజయం సాధించిన పంజాబ్ తరహాలో మార్పు తీసుకు వస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో ఢిల్లీ ఎంతో సక్సెస్ సాధించిందని చెప్పుకొచ్చారు. అలాగే పంజాబ్‌లో కూడా మార్పుమొదలైందన్నారు. గుజరాత్‌లోని బరూచ్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రివాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇప్పటివరకు గుజరాత్‌లో 6000 పాఠశాలలను మూసివేశారని పేర్కొన్నారు. మరికొన్ని అధ్వాన్న స్థితిలో ఉన్నాయన్నారు.
ఇలా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ను సరిగా చేయకపోవడంవల్ల పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుందన్నారు. ఢిల్లీ తరహాలో పాఠశాలల పరిస్థితిని మార్చేస్తామని, గుజరాత్‌లో పరిస్థితిని మార్చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో ధనవంతులు, పేదల పిల్లలు కలిసి చదువుకుంటున్నారు. ఈ సారి ఢిల్లీలో 99.7 శాతం పాసయ్యారని కేజ్రివాల్ అన్నారు. ‘ మాకు ఒక్క అవకాశమివ్వండి… పాఠశాలల పరిస్థితి మెరుగుపర్చకపోతే నన్ను బయటకు తోసేయండి’ అని కేజ్రీవాల్ చాలెంజ్ విసిరారు. అంతేకాదు, గుజరాత్ పరీక్ష పేపర్ల లీక్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజి లేకుండా ఒక్క పరీక్ష అయినా నిర్వహించగలరా? అంటూ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు సవాలు విసిరారు.